విశ్వాస ఘాతకుడు, నమ్మక ద్రోహి కోటంరెడ్డి

కలుపు మొక్కలు వెళ్లిపోతే.. పోయేదేమీ లేదు

దమ్మూ, ధైర్యం ఉంటే ఆ ఆడియో క్లిప్‌ విచారణ ఏజెన్సీలకు ఇవ్వాలి

వైయ‌స్ జగన్‌ బీఫామ్ ఇవ్వకపోతే నీ స్థానం ఎక్కడ..?

శ్రీధర్‌రెడ్డి వెళ్లడం వల్ల పార్టీకి పట్టిన పీడ, దరిద్రం పోయింది

సజ్జలపై చేసిన ఆరోపణలపై దేవుని వద్ద ప్రమాణానికి సిద్ధమా..?

కోటంరెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స‌వాల్‌

అనంత‌పురం: ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్లే విశ్వాస ఘాతకుడు, నమ్మక ద్రోహి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. కోటంరెడ్డి లాంటి క‌లుపు మొక్క‌లు వెళ్లిపోతే మంచిదేన‌న్నారు. శ్రీధర్‌రెడ్డి లాంటి వాడు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జ‌రిగే న‌ష్ట‌మేమీ లేద‌ని, పార్టీకి పట్టిన పీడ, దరిద్రం పోయిన‌ట్టుగా భావిస్తున్నామ‌న్నారు. అనంత‌పురంలో వ్య‌వసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

``పెద్ద గొంతు వేసుకుని శ్రీధర్‌ రెడ్డి మాట్లాడితే ఇక్కడ ఎవరూ భయపడరు, శ్రీధర్‌ రెడ్డి కి రెండు సార్లు ఎమ్మెల్యేగా వైయ‌స్ జ‌గ‌న్ అవకాశం ఇచ్చారు. కోటంరెడ్డి సున్నా.. ఒకటి అనే వైయ‌స్ జగన్‌ పక్కన ఉండబట్టే కోటంరెడ్డికి విలువ వచ్చింది. శ్రీధర్ రెడ్డి చేసే ఆరోపణలు పసలేనివి.. చేతనైతే, ఆయ‌న దగ్గర ఉన్న ఆడియో క్లిప్‌పై విచారణ చేయించాలి. ట్యాపింగ్‌ అనేదానికి ఆయ‌న దగ్గర ఆధారాలు ఏమున్నాయి...? ఆయ‌న‌ కోర్టుకు వెళ్లి, కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి విచారణ చేయించుకోవచ్చు. ఆ సాక్ష్యం ఏ ఏజెన్సీ దగ్గర పెట్టాలో అక్కడ పెట్టు.. వాస్తవమేమిటో నిగ్గు తేలుతుంది. ఇప్పుడు టీడీపీకి ఆ దరిద్రం పట్టింది.. కోటంరెడ్డి టీడీపీలో చేరడం వల్ల నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం కుప్పకూలిపోయింది అనే వార్తలు మనం మున్ముందు వినబోతున్నాం. ఇక్కడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హౌస్‌ ఫుల్‌గా ఉంది కాబట్టి.. టీడీపీ కాళీగా ఉందని అక్కడకు వెళ్తున్నారు.

కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డికి వైయ‌స్ జ‌గ‌న్ బీ-ఫామ్ ఇవ్వ‌క‌పోతే ఈ జన్మలో శాసనసభ్యుడు అయ్యుండేవాడు కాదు. ఆర్ధికంగా ఈ స్థాయికి ఎదిగి ఉండే వాడుకాదు. కార్పొరేటర్ల ఇంటికి వెళ్లి వాళ్లపై దౌర్జన్యం చేస్తున్నాడు. కోటంరెడ్డి చేసే త‌ప్పుల‌పై కేసులు పెట్టరా..? నువ్వేమన్నా మొనగాడివా.. చట్టానికి అతీతుడివా.. తప్పు చేస్తే కేసులు పెట్టకుండా ఉండటానికి..? నమ్మకం లేని చోట ఉండలేను అంటున్నావ్‌.. అసలు నీకు నమ్మకం లేదు కాబట్టే, పదవులు ఇవ్వలేదని వెళ్లిపోయావ్‌. నీకు టిక్కెట్‌ ఇవ్వడమే గొప్ప.. ఆ రోజు ఎంత ఒత్తిడి ఉన్నా సీఎం వైయ‌స్ జగన్ నీకు టిక్కెట్‌ ఇచ్చారు. శ్రీధర్‌రెడ్డికి నీతి నిజాయితీ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డిపై చేసిన ఆరోపణల్లో దేవుని వద్ద ప్రమాణానికి రావాలి. 

నిందలు వేయడం, బురదజల్లడం శ్రీధర్‌ రెడ్డికి ఆనవాయితీ-అతని గురించి దారిన పోయే చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు. నిందలు వేసి వెళ్తున్నావు కదా...ఆధారాలు చూపించాలి. శ్రీధర్‌ రెడ్డికి ఏ మాత్రమైనా, నీతి, నిజాయితీ ఉండి ఉంటే వైయ‌స్ జగన్‌ని విడిచిపెట్టి వెళ్ళే వాడు కాదు. టిక్కెట్‌ రానటువంటి వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు.. వారికి రాజకీయ పునరాసం కావాలి. ఎవరు ఎన్ని మాట్లాడినా.. వైయ‌స్ జగన్‌ ఇచ్చిన బీ-ఫామ్ మీద గెలిచి, వెళుతున్న వారికి నేను పదే పదే ఒకటే చెప్తున్నా.. 2024లో నెల్లూరు జిల్లాలో వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ 100 శాతం స్థానాలు గెలుచుకుంటుంది. ఇప్పుడు మాట్లాడే వారి పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందో ఆరోజు మళ్ళీ మాట్లాడుకుందాం. 

ప్రజల్లో టీడీపీ లేదు.. రాబోయే ఎన్నికల్లో వైయ‌స్సార్ పీపీ విజయ దుందుభి మోగిస్తుంది. మేయర్‌ వెళ్లినంత మాత్రాన ఏమవుతుంది..? ఆనాడు 23 మంది పార్టీని వీడి వెళ్లినప్పుడే మా నాయకుడు బెదరలేదు. రెండు, మూడు కలుపు మొక్కలను తీసేసినంత మాత్రాన ఏమీకాదు. వేరిపారేయాల్సిన వాళ్లు ముందుగానే తెలుసుకుని పలాయనం చిత్తగిస్తున్నారు. శ్రీధర్‌రెడ్డి నోటి వెంటనిజం వస్తే ఒట్టు.. నెల్లూరు జిల్లాలో శ్రీధర్‌ రెడ్డి గురించి ఎవర్ని అడిగినా చెప్తారు అబద్ధాలను అద్భుతంగా చెప్పగలడని. అందరికీ తగువులు పెట్టడం ఆయనకు అలవాటు.. ఆయన లోపల మనిషిని నెల్లూరు జిల్లా ప్రజలను అడిగితే చెబుతారు. శ్రీధర్‌ రెడ్డి ముఖం చూసి నేను వైయ‌స్ఆర్ సీపీలోకి రాలేదు. వైయ‌స్ జ‌గ‌న్ నాయకత్వం చూసి వచ్చాను. ఏ రోజైతే  వైయ‌స్ జగన్‌ కాంగ్రెస్‌పార్టీని వీడి వచ్చాడో ఆనాడే నేను ఆయన వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నా` అని మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి చెప్పారు.

Back to Top