విశాఖ: పారిశ్రామిక సదస్సు విజయవంతం కాకూడదని, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనే కుట్రతో ఈనాడు రామోజీరావు పిచ్చి వార్తలు, చెత్త వార్తలు ప్రచురిస్తున్నారని, దిగజారుడు రాతలతో ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. ఈనాడు పత్రికలో ‘ఈ పత్రిక సమాజమానికి హానికరం, మేము రాసే వార్తలు సమాజానికి, రాష్ట్రానికి హానికరం’ అని ఓ పక్క రాసుకోండి అని చురకలంటించారు. తప్పుడు కథనాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న ఈనాడు పత్రికను మీడియా సమావేశంలోనే మంత్రి గుడివాడ అమర్ చించివేశారు. ఈనాడును టిష్యూ పేపర్ కింద వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈనాడు రామోజీరావు వ్యాపారాలన్నీ విశాఖలో స్టార్ట్ చేసి.. ఈరోజు విశాఖపైనే విషం కక్కుతున్నాడని మండిపడ్డారు.
విశాఖపట్నం జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..‘పారిశ్రామిక రాయితీకి జాడేది అని ఈనాడు పత్రిక ఆర్టికల్ రాసింది. దాదాపు రూ.726 కోట్లు ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు రిలీజ్ చేయలేదని రాశారు. పారిశ్రామిక సదస్సుకు ముందు రిలీజ్ చేస్తామని చెప్పాం. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో పారిశ్రామిక సదస్సు, ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.
ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తే ఈ రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు రాకుండా మానేస్తారు. ప్రభుత్వానికి, సీఎం వైయస్ జగన్‌కు పేరు రాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి అసత్య కథనాలను రాస్తోంది. రాష్ట్రంలో రామోజీరావుకు కావాల్సిన మనిషి, రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా చూపిస్తాడు. సీఎం వైయస్ జగన్ పరిపాలనలో ఏ మంచి జరిగినా చెడుగానే చూపిస్తామన్నట్టుగా రామోజీరావు ప్రవర్తిస్తున్నాడు. గన్నవరం ఘటనలో పాత ఫొటోలు ప్రచురించి గందరగోళం సృష్టించాడు.
గత ప్రభుత్వం 3600 కోట్లు బకాయిలు పెట్టి పారిశ్రామికవేత్తలను ఇబ్బందులను పెట్టింది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వైయస్ జగన్ ప్రభుత్వం వాటిని చెల్లించింది. ఎంఎస్‌ఎంఈలకు కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ.900 కోట్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వం. దాని గురించి చెప్పడానికి ఈనాడు రామోజీరావుకు మనసు రాదు. పారిశ్రామిక సదస్సు విజయవంతం కాకూడదు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనే తపనతో పిచ్చి వార్తలు, చెత్త వార్తలు రాస్తున్నారు.
రామోజీకి దమ్ము, ధైర్యం ఉంటే ఒక రాజకీయ పార్టీ స్థాపించండి. జర్నలిజం అనేది విలువ కలిగిన వృత్తి. ఆ వృత్తికి మచ్చతెచ్చే విధంగా ఈనాడు రామోజీరావు ప్రవర్తిస్తున్నాడు. ఈ రకమైన దిగజారుడు రాతలు రాసి ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. మీ రాతలు, చేష్టల వల్ల సీఎం వైయస్ జగన్, వైయస్‌ఆర్ సీపీ మీద కోపం చూపిస్తుననామని అనుకుంటున్నారు.. కానీ రాష్ట్రం మీద, ప్రజల మీద చూపిస్తున్నారని తెలుసుకోండి.
ఈనాడు పత్రికలో ఓవైపు ఈ పత్రిక సమాజమానికి హానికరం అని రాసుకోండి. మేం రాసే వార్తలు సమాజానికి, రాష్ట్రానికి హానికరం అని రాసేయండి. ఇలాంటి పత్రికలను చింపేయాలి. ఈనాడును టిష్యూ పేపర్ కింద వాడుకోవాలి. వ్యాపారాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో స్టార్ట్ చేసిన రామోజీరావు ఈరోజు తెలంగాణలోని ప్యాలెస్‌లో కూర్చొని ఆంధ్రరాష్ట్రంపై విషం కక్కుతున్నాడు. తప్పుడు రాతలు, సమాజానికి, రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే అబద్ధాలు ఇప్పటికైనా రామోజీరావు మానుకోవాలి.
మార్చి 3, 4 తేదీల్లో జరగబోయే పారిశ్రామిక సదస్సు ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. రాష్ట్రంలోని యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అన్ని రంగాల్లో పెట్టుబడులు రాబోతున్నాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రం తాలూకా ముఖచిత్రం మారబోతుంది. రాష్ట్రానికి మంచి జరగబోతోంది.
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ మేజర్ అడ్వాంటేజ్. రెండో అతిపెద్ద సముద్రతీరం కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఖర్చు చేసి 3 పోర్టులు నిర్మిస్తోంది. పీపీపీ కింద మరో పోర్టు నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే 6 ఆపరేషన్ పోర్టులు ఉన్నాయి. 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మించబోతున్నాం. పోర్టు ఆధారిత ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ సీఎం వైయస్ జగన్ ఆలోచన. పోర్టులకు ఆనుకొని విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో దాదాపు 26 వేల నుంచి 30 వేల ఎకరాలు పారిశ్రామిక భూములు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయి. దేశంలో, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన నగరాలన్నీ పోర్టు కలిగి ఉన్న నగరాలే. రాష్ట్రంలోని వనరులను గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ప్రదర్శించబోతున్నాం. సదస్సు ద్వారా రాష్ట్రానికి మంచి జరగబోతోంది’ అని మంత్రి గుడివాడ అమర్ అన్నారు.