రాజ్యాంగపరమైన హక్కుల సాధనకే సుప్రీం కోర్టుకు..

రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రం చెప్పింది..

వికేంద్రీకరణను బలంగా తీసుకువెళ్ళేందుకు 'సుప్రీం'లో స్పెషల్ లీవ్ పిటిషన్

ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా హైకోర్టు తీర్పు 

రాజధాని ఏర్పాటుపై చట్టసభలకు హక్కు లేదన్న అంశంపై దేశవ్యాప్త చర్చ జరగాలి

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

విశాఖ‌ప‌ట్నం:  రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ  లక్ష్యమని ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ స్పష్టంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగానే సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్ర ప్ర‌భుత్వం పార్లమెంట్‌ సాక్షిగా చెప్పింద‌ని గుర్తుచేశారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ఇవ్వకముందే అమరావతి రాజధానిగా ప్రకటించారని, రాజధానిపై చంద్రబాబు వేసింది ఎక్స్‌పర్ట్‌ కమిటీ కాదు.. ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ అని మంత్రి అమ‌ర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. రాజ‌ధాని ఏర్పాటుపై చ‌ట్టస‌భ‌ల‌కు హ‌క్కు లేద‌న్న అంశంపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. విశాఖ‌ప‌ట్నంలో మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని హైకోర్టు పేర్కొన్నoదువల్లనే, రాజ్యాంగ పరంగా శాసనసభకు ఉన్న హక్కులను సాధించుకోవడం కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. శనివారం విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానమని, దానికి మరింత బలం చేకూర్చడం కోసం, రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను సాధించుకోవడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాం అని ఆయన స్పష్టం చేశారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు తెలియజేశామని ఆయన చెప్పారు. రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం చట్టసభలకు లేదన్న అంశంపై.. దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అని అమర్నాథ్ అన్నారు. 

ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమే ఇది..
హైకోర్టు తీర్పుపై ఇప్పటికే అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించామని, రాజధానిని నిర్ణయించే అధికారం శాసనసభకు పూర్తిగా ఉందని, ఇటువంటి తరుణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా ఉందని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఆర్టికల్ 258 ప్రకారం 2014లో అప్పటి ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తీసుకు వచ్చిందని, ఆ చట్టాన్ని మార్చే అధికారం ఈ ప్రభుత్వానికి లేదని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చకూడదని చెప్పటం ఎలా సమంజసం అని ప్రశ్నించారు.  రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా అమర్నాథ్ గుర్తు చేశారు. శాసనసభను నిర్దేశించే అధికారం ఆఖరికి కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ వికేంద్రీకరణ ద్వారానే... రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలన్నది ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ తపన, ఆలోచన అని చెప్పారు.

అది నారా-నారాయణల ఇన్వెస్ట్ మెంటు కమిటీ
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ఒక కమిటీని వేసి, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకోవాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం సూచించిందని, ఇందులో భాగంగానే శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటైందని అమర్నాథ్ చెప్పారు. ఈ కమిటీపై చంద్రబాబు నాయుడికి మొట్టమొదటి నుంచి గౌరవం లేదని అందుకే తన క్యాబినెట్ మంత్రి నారాయణ నేతృత్వంలో కమిటీని వేసి, సుజనాచౌదరి ఇచ్చిన సూచనల మేరకు,  శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వెలుగు చూడకుండానే అమరావతిని చంద్రబాబునాయుడు రాజధానిగా ప్రకటించారు అని ఆయన అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన స్కామ్ లో..  ఆయన వేసింది ఎక్స్ పర్ట్ కమిటీ కాదు అని, అదొక నారా-నారాయణలకు చెందిన ఇన్వెస్ట్ మెంటు కంపెనీ అని మండిపడ్డారు. 

శాసనసభ ఉనికినే ప్రశ్నించే విధంగా తీర్పులా..!
గత అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు బిల్లును ప్రవేశపెట్టామని, పాత దానిని వెనక్కి తీసుకుని మరింత సమగ్రంగా కొత్త బిల్లును తీసుకు రావాలన్న ఆలోచన చేస్తున్న తరుణంలో, పాత బిల్లును రద్దు చేసిన తర్వాత హైకోర్టు తీర్పు వెల్లడించింది అని ఆయన అన్నారు. వెనక్కి తీసుకున్న బిల్లు పై హైకోర్టు తీర్పు ఇవ్వడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుందని ప్రశ్నించారు. శాసనసభ ఉనికినే ప్రశ్నించే విధంగా తీర్పులు వస్తే రాష్ట్ర ప్రగతికి విఘాతం ఏర్పడుతుందని అమర్నాథ్ తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చెందిందని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని శ్రీకృష్ణ కమిటీ పేర్కొందని, మళ్లీ అటువంటి పొరపాట్లు జరగకుండా వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పిందని అమర్నాథ్ వివరించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది అమర్నాథ్ గుర్తుచేశారు. 

బాబు కట్టని, కట్టలేని రాజధాని కోసం ఎందుకు తాపత్రయం..?
చంద్రబాబు నాయుడు, అతని అనుచరులు అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రకటనకు ముందుగానే పెద్దఎత్తున భూములను కొనుగోలు చేసి, ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారని అమర్నాథ్ విమర్శించారు.  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చంద్రబాబునాయుడు కట్టని, కట్టలేని రాజధానికోసం ఎందుకు తాపత్రయపడుతున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి, పారిపోయి వచ్చిన చంద్రబాబు, కనీసం యాభై ఎనిమిది నెలలపాటు కూడా అమరావతిని పాలించలేని వ్యక్తి, ఈరోజు యాత్రల పేరుతో రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అమర్నాథ్ ధ్వజమెత్తారు.  

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే తపనతో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప్రయత్నాలు సాగిస్తుంటే, కేవలం అమరావతిలోని 29 గ్రామాల కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని కుట్రలు పన్నుతున్నారని అమర్నాథ్ మండిపడ్డారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top