గుర్ఖాలకు సూట్లేసి ఎంఓయూలు చేసిన ఘనత చంద్రబాబుది

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ అడ్డగోలు విమర్శలు

ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణకు రూ.1463 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చాం

సంక్షేమం, శ్రేయస్సు, అభివృద్ధి, సంతోషం అనే నాలుగు స్థంభాలపై పాలన

లోకేష్‌కు మంగళగిరిలో మంగళం పాడటం ఖాయం

విశాఖను కాదు.. టీడీపీని కాపాడటమే పవన్‌కల్యాణ్‌ బాధ్యత

పూటకొకరితో సంసారం చేసేపద్ధతి పవన్‌ది

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

తాడేపల్లి: నేపాల్‌ గుర్ఖాలకు సూటూ బూటూ తగిలించి ఎంవోయూలు చేసిన ఘనత ప్రతిపక్ష నేత చంద్రబాబుదని, టీడీపీ అధికారంలో ఉండగా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. గతంలో పెట్టుబడుల పేరుతో తెలుగుదేశం పార్టీ డ్రామాలాడిందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు అండ్‌ కో ఓర్వలేక ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలను మంత్రి తీవ్రంగా ఖండించారు. 

మంత్రి అమర్‌నాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

పారిశ్రామికంగా రాష్ట్రం పరుగులు             
        ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు పారిశ్రామికంగా పరుగులు తీయిస్తున్నారు. ఇందులో భాగంగా, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జపాన్‌కు చెందిన ప్రతిష్టాత్మక యెకహోమా గ్రూపుకు చెందిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి చేతుల మీదుగా నిన్న ప్రారంభించారు. దాదాపు 100 ఎకరాల్లో ఏటీసీ టైర్ల పరిశ్రమను రూ. 1,500 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ప్లాంటులో తొలి యూనిట్ సిద్ధమైంది. ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ ద్వారా దాదాపు 2,000 మంది స్థానికులకు ఉపాధి కలగనుంది. మరో ఎనిమిది పరిశ్రమలకు ముఖ్యమంత్రిగారు భూమి పూజ చేశారు. అలాగే యెకహోమా సంస్థకు సంబంధించి రెండో యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక విప్లవానికి ఇదొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. అయితే పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులకు సంబంధించి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మాజీ ఐటీ శాఖ మాజీ మంత్రి నారా లోకేష్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కనీస అవగాహన లేకుండా విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నఅభివృద్ధి, వస్తున్న పెట్టుబడులను చూడలేక..  వారు పడుతున్న ఆవేదన, కడుపు మంట.. వారి మాటల్లోనే కనిపించింది. 

జపాన్ ప్రతినిధులు మాట్లాడింది లోకేష్ బుర్రకు అర్థం కాలేదా...?
        పరిశ్రమలు-పెట్టుబడులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న టీడీపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాను. యెకహోమా గ్రూప్‌ ప్రతినిధులు మాట్లాడిన మాటలు టీడీపీ నాయకులు వింటే బాగుండేది. మేం చెప్పే మాటలు ఎలానూ మీ బుర్రలకు ఎక్కవు. కనీసం జపాన్ ప్రతినిధులు ఏం మాట్లాడారో వింటే.. వాస్తవాలు మీకు తెలిసేవి. వారు మాట్లాడిన ఇంగ్లీషు, విదేశాల్లో ఇంగ్లీషు మీడియం చదివిన లోకేష్ బుర్రకు అర్థం కాలేదా..?. ఎంతసేపటికీ, ప్రభుత్వం చేసే ప్రతి పనినీ విమర్శించమే  పనిగా పెట్టుకునే తాపత్రయం ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తాము అక్టోబర్‌ 2020లో రాష్ట్రానికి వచ్చామని, దానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం డిసెంబర్‌ 2020లో ఇచ్చిందని, ఫిబ్రవరి 2021లో పనులు ప్రారంభించినట్లు, ఆగస్ట్‌-2022లో ప్లాంటును ఫస్జ్ ఫేజ్ పూర్తి చేసి, మొదటి విడతగా ఉత్పత్తిని తీసుకువచ్చామని, 30 నెలలు పట్టాల్సిన ఈ పనులను కేవలం పరిశ్రమకు పునాది వేసిన 15 నెలల్లోనే పూర్తి చేసి, ఉత్పత్తులు ప్రారంభించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జరిగిందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ప్రపంచంలోనే టాప్‌ ఫైవ్‌ కంపెనీల్లో ఒకటైన ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురించో, లేక  ముఖ్యమంత్రి జగన్ గారు గురించో గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. వారు వాస్తవాలనే చెప్పారు. ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు అనుకూల వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం ఉండబట్లే ఇది సాధ్యమైందని  జపాన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అది కూడా మీకు అర్థం కాకపోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాం. 

మీరు తెచ్చిన పరిశ్రమలేవో చెప్పండి
        రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా.. అది మేమే చేశామని లోకేష్‌ చెబుతున్నాడు. వెయ్యికోట్లు పెట్టుబడులు పెట్టే సంస్థలను తాము వందల్లో తీసుకువచ్చామని చెబుతున్నాడు. వాళ్ల నాన్న చంద్రబాబుకు ఆ సంస్థలకు శంకుస్థాపన చేసే సమయం కూడా లేదని చెప్పుకోవడం సిగ్గుచేటు. అదే నిజం అయితే,  టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు- పెట్టుబడుల వివరాల జాబితా ఏమిటో విడుదల చేయాలి. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు మతితప్పి మాట్లాడుతుంటే...  వెయిట్‌ లాస్‌ కోసం నారా లోకేష్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుని మైండ్‌ లాస్‌ చేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. 

- రాష్ట్రంలో ఏముందని పెట్టుబడులు పెట్టడానికి వస్తారని లోకేష్‌ అంటున్నాడు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన మాకీ సంస్థ ఏ స్టేట్‌మెంట్‌ ఇచ్చిందో మీకు గుర్తు లేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. జపాన్ నుంచి డిజైన్లు తీసుకొచ్చి.. సినిమా డైరెక్టర్ ను చంద్రబాబు కలవమన్నాడట.. అదీ చంద్రబాబుకు ఉన్న జ్ఞానం. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఏనాడు అయినా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే యోచన ఎందుకు చేయలేదు. పారిశ్రామికంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే మనకున్న సముద్ర తీరం, పోర్టులు, లాజిస్టిక్‌ సపోర్టు, నేషనల్‌ హైవే కనెక్టవిటీస్‌తో పాటు అందుబాటులో ఉన్న నైపుణ్యతను ప్రమోట్‌ చేసుకుంటున్నాం. మనకున్న రిసోర్స్‌ను మనం గుర్తించకుంటే పక్కరాష్ట్రం, ఇతరదేశాల వాళ్లు గుర్తిస్తారా?

లోకేష్ వి మంగళవారం మాటలు..
        వారం రోజుల్లో అతి పెద్ద కుంభకోణాన్ని బయటపెడతానంటూ నారా లోకేష్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అదేదో నిన్నే చెప్పొచ్చు కదా. దానికి మళ్లీ ముహూర్తమా? లేక మింగలేక మంగళవారం సామెతగా.. నిన్న మంగళవారం అని చెప్పలేదా? నువ్వు ఏం కుంభకోణం బయటపెడతావని సూటిగా ప్రశ్నిస్తున్నాం. తాము అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని తండ్రీకొడుకులిద్దరూ కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, పరిశ్రమలు, పెట్టుబడులు రాకూడదు, పేదవాడికి మేలు జరగకూడదు, వాళ్లకు సంక్షేమం అందకూడదనే తాపత్రయమే తండ్రీకొడుకుల మాటల్లో, చేష్టల్లో కనిపిస్తోంది. తాము అధికారంలో ఉంటే మేము, మావాళ్లు బాగుండాలనే ఉద్దేశం... అదే అధికారంలో లేనప్పుడు రాష్ట్రంలో ఏ మంచి జరగకూడదు, పేదవాడికి సంక్షేమ ఫలాలు అందకూడదనే దుగ్ధతో విమర్శలు, కుట్రలు చేస్తున్నారు.

ఎవరెవరికో సూటు-బూటు వేసి ఎంవోయులు చేసుకుంది బాబే
        రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు, ప్రజల అభివృద్ధి, ప్రజల సంతోషం ... ఈ నాలుగు స్తంభాల మీద  పరిపాలనను ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు నడిపిస్తున్నారు. దాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు,మీరు ఏ మంచీ చేయలేదు. మేం మంచి చేస్తుంటే, మామీద పడి ఏడుపెందుకు..?. మీరు ప్రతిపక్షంలో ఉంటే రాష్ట్రం ఏమైపోయినా పరవాలేదన్నట్లు విమర్శలు చేయడం సరికాదు. తెలుగుదేశం ప్రభుత్వం అయిదేళ్ల పాలనలో రాష్ట్రానికి మీరేమి చేశారు? నాలుగుసార్లు పార్ట్‌నర్‌ షిప్‌ సమ్మిట్‌లు పేరుతో 20 లక్షల కోట్లు పెట్టుబడులు, 40లక్షల మందికి ఉద్యోగాలంటూ ఊదరగొట్టి..  ఈవెంట్లకు దాదాపు రూ.150 కోట్లు ఖర్చు పెట్టి ...  వైజాగ్‌లో ఎవరెవరికో సూటు- బూటు వేసి తీసుకువచ్చి ఎంవోయులు చేసుకుంటే, ఎవరు పెట్టుబడులు పెడతారు? మీదొక డ్రామా పార్టీ కాబట్టే, వాళ్లతో ఫోటోలు దిగి పెట్టుబడులు అంటూ హడావుడి చేశారు. మీ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటే.. అవన్నీ నమ్మడానికి ప్రజలేమీ అమాయకులు కాదు కదా. మీరు చెప్పిన మాటలకు చేసిన ఎంవోయూలపై వాస్తవాలు చెప్పగలరా?

ఫోన్ కాల్ దూరంలో పారిశ్రామికవేత్తలకు అందుబాటులో..
         పెట్టుబడులపై  కాకిలెక్కలు చెప్పవద్దని, వాస్తవాలే వెల్లడించాలని ముఖ్యమంత్రి జగన్ గారు పదేపదే స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు, పారిశ్రామికవేత్తలకు అన్నిరకాల సహకారం అందిస్తామని, ఏమీ కావాలన్నా ఫోన్‌ కాల్‌ దూరంలో తమ ప్రభుత్వం ఉంటుందంటూ నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా  ముఖ్యమంత్రిగారు తన ప్రసంగంలో పదేపదే చెప్పారు. ఇంత నిజాయితీగా, చిత్తశుద్ధితో చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా?, విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేసే ఒక్క జగన్ మోహన్ రెడ్డిగారికే అది సాధ్యం.  గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ఇవ్వాల్సిన బకాయిలతోపాటు, గడిచిన మూడేళ్లలో రూ 1700కోట్లు ఇన్సెంటివ్‌లు ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ఏడాదికి సంబంధించిన ఇన్సెంటీవులు ఇవ్వబోతున్నాం. అలాగే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రిగారు పదేపదే స్పష్టం చేశారు. 

- అపాచీ, టీసీఎస్‌, యెకహోమా సంస్థలు కూడా తామే తెచ్చామని నారా లోకేష్‌ చెప్పుకుంటున్నాడు. ఒకసారి మాట్లాడితేనే పని జరుగుతుందా?, పరిశ్రమలు వచ్చేస్తాయా..?. కృషి చేస్తేనే కదా పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేది. తద్వారా మనవాళ్ళకు ఉద్యోగాలు వస్తే దాన్ని గొప్పగా చెప్పుకోవాలి. అంతేకానీ వాళ్లతో మాట్లాడాను, వీళ్లతో మాట్లాడానని చెప్పుకోవడం కాదు కదా? భూమి ఇచ్చింది మేము, అనుమతులు ఇచ్చింది మేము, పెట్టుబడులు పెట్టింది, సంస్థలు ప్రారంభించింది మా హయాంలో. అలాంటప్పుడు వాటి గురించి మేము చెప్పుకోక నువ్వు ఎలా చెప్పుకుంటావు..? రెండున్నరేళ్లపాటు ఐటీశాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్.. రాష్ట్రానికి ఎన్ని సంస్థలు తెచ్చాడు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పు. చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టే.. మామీద విమర్శలు చేస్తున్నారు.

బ్రాహ్మణితో గొడవలు ఉంటే ఇంట్లో తేల్చుకో..
    జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మంచి కోరితే... చంద్రబాబు నాయుడు చావు కోరే రకం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే.. వాటాలు ఇవ్వాలి అని భారతమ్మ గారి పేరును రాజకీయాల్లోకి లాగుతున్నారు.  భారతమ్మకు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నావు లోకేష్..? నీకు, నీ భార్య బ్రాహ్మణికి మధ్య గొడవలు ఉంటే.. మీరు మీరు తేల్చుకోండి. నీ అంత నీచంగా మేము మాట్లాడం. నువ్వు, నీ భార్యను తిట్టలేక... మాతో తిట్టించాలనే తాపత్రయం నీ మాటలలో కనిపిస్తోంది. భారతమ్మ ఏరోజు అయినా రాజకీయాలు కల్పించుకున్నారా? ఎక్కడైనా రాజకీయాలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఇంకోసారి భారతమ్మ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. మాతో అనిపించుకోవడం ఎందుకు?. మేము ఏమైనా అంటే మళ్ళీ, తండ్రీకొడుకులు మళ్లీ భోరున ఏడవడం ఎందుకు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కూర్చుని వెక్కి వెక్కి ఏడవటం ఏంటి?. ఎవరో ఒకరి మీద బురద చల్లి,  మీరు నీచ రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు. బురదను వాళ్లే తడుచుకుంటారనేలా తయారయ్యారు. ఇలాంటి విమర్శలు ఇకనైనా మానుకుంటే మంచిది. 

- రాజకీయ భవిష్యత్‌ ఉండదని మీకు బాగా అర్థం అయింది. రాష్ట్ర ప్రజలకు మేం మంచి చేశాం కాబట్టే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలుస్తాయని చెబుతున్నాం. మీ మాదిరిగా, పని చేయకుండా గొప్పలు చెప్పుకోవడం లేదు. పేదవాడికి మంచి చేశాం, సంక్షేమం అందించాం కాబట్టే గడప గడపకు వెళుతున్నాం. వారి స్పందన తెలుసుకుంటున్నాం. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టిస్తూ, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తూ పరిపాలన చేస్తుంటే... టీడీపీ కడుపుమంట ఏంటో అర్థం కావడం లేదు.

లోకేష్ లా బీచ్ ల్లో, స్విమ్మింగ్ పూల్ చదువులు చదవలేదు
        జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఏం చదివారో అనేది అందరికీ తెలుసు. నీమాదిరిగా, బీచ్‌ల్లోనో, స్విమ్మింగ్ పూల్ ల్లోనో నీవు వేషాలు వేసినట్టు.. అంతటి గొప్ప చదువులు ఆయన చదవలేదు. జగన్‌గారు ప్రజల తాలుకా కష్టాన్ని చదివారు. పేదల బాధలు తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారి ఇబ్బందులు తెలుసుకునే, ఈరోజు అద్భుతమైన పాలన అందిస్తున్నారు. వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని నువ్వు..  ముఖ్యమంత్రిగారి నాయకత్వం మీద విమర్శలు చేయడమా?. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు మళ్లీ నీకు సర్వ మంగళం పాడటం ఖాయమని తెలిసిపోయింది. మీ నాన్నకు నువ్వు... నీకు ఇంకొకడు.. మీ ముగ్గురూ కలిసి.. ఇక "మనం" సినిమాతరహాలో పక్కన ఓ కుక్కపిల్లను పెట్టుకుని ఫోటో తీసుకుని, మీ జూబ్లీహిల్స్‌ అవినీతి ప్యాలెస్‌లో శేష జీవితం గడిపేస్తే బాగుంటుంది. టీడీపీకి మళ్లీ అధికారం రావడం కల. మీ కుట్ర రాజకీయాల కోసం, జగన్‌ గారిని, భారతమ్మను నోటికి వచ్చినట్లు మాట్లాడటం మర్యాదగా ఉండదని హెచ్చరిస్తున్నాం.

కాపు జనసేన కాదు.. కమ్మ జన సేనా..?
      ప్రభుత్వాలుగా కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలే ఉంటాయి కానీ... మోదీ గారి దగ్గరకు వెళ్లి వేషాలు వేయడం మాకు అలవాటు లేదు. చంద్రబాబు నాయుడులాగా వేషాలు వేయడం మాకు చేతకాదు. వేషాలు వేస్తోంది మేం కాదు.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లే.  ముందుగా, భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాడో లేదో  పవన్ కల్యాణ్ ను చెప్పమనండి. ఏ పార్టీతో ఎప్పుడు కలిసి ఉంటాడో ఆయనకే తెలియదు. రాజకీయ స్థిరత్వం లేని పవన్‌ కల్యాణ్‌ కూడా రాజకీయాల గురించి మాట్లాడేస్తుంటే ఇంకేమి చెప్పాలి.. మా స్టాండ్‌ ఒకటే. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి, పేదవాడి సంక్షేమం తప్ప మరో అజెండా లేదు. పూటకు ఒకరితో సంసారం చేసే అలవాటు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి లేదు.

- తెలుగుదేశం పార్టీ స్క్రిప్టు, చంద్రబాబు ప్రొడక్షన్‌.. నాదెండ్ల మనోహర్‌ డైరెక్షన్ లో నడుస్తున్న ఆ పార్టీని కాపు జనసేన అంటారా? కమ్మ జనసేన అంటారా? పవన్‌ కల్యాణ్‌ నడిపే పార్టీ కాపు జనసేన కాదు అనేది రాష్ట్రంలోని కాపులందరికీ తెలుసు. కాపులెవరూ పవన్ కల్యాణ్ ను నమ్మరు. పవన్‌ నడిపేది కమ్మ జనసేన పార్టీ కాబట్టే  ఆయనకు ఓట్లు వేయలేదు. రాష్ట్రంలోని కాపులెవరూ పవన్‌ను ఓన్‌ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. టీడీపీ పల్లకీ మోయడమే, ఆ పార్టీకి మేలు చేయడమే పవన్ కల్యాణ్ పాలసీ, ఆ పార్టీ సిద్ధాంతం. 

- వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తారా అని మేము సవాల్ విసిరితే..  పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పలేకపోయారు. అలాంటప్పుడు  మరి అది కమ్మ జనసేనే కదా. మాకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా.. రాష్ట్ర ప్రజలకు, ఆ పార్టీలో తిరుగుతున్న నాయకులకు, కార్యకర్తలకు అయినా పవన్‌ సమాధానం చెప్పాల్సిందే. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top