చట్టం ఎవరికైనా ఒక్కటే 

 రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. 

శ్రీ‌కాకుళం:   చట్టం ఎవరికైనా ఒక్కటే అని  రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.   భైరి గ్రామంలో రూ. 2.41 కోట్ల రూపాయ‌ల‌తో చేప‌ట్టిన ప‌లు ప‌నుల‌ను ఆయ‌న ప్రారంభించారు. ఇందులో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం,రూ.21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం,రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ డ్రెయిన్లు,రూ.10 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం భవన ప్ర‌హ‌రీగోడ ఉన్నాయి. 

వీటితో పాటే రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు,రూ.20 లక్షలతో నిర్మించిన సామాజిక మరుగు దొడ్లు,రూ.30 లక్షలతో తోట గోర్జికి పోయేందుకు  నిర్మించిన సీసీ రోడ్లు ఉన్నాయి. ఎస్సీ కాలనీకి రెండు లక్షలతో తాగునీటి స‌ర‌ఫ‌రా ఏర్పాటు,మరో రూ.10 లక్షలతో డ్రైన్లు ఉన్నాయి. అలానే రూ.67.6ల‌క్ష‌ల‌తో త్రాగు నీటి టాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

మరో 1.4 కోట్ల పనులకు శంకుస్థాపన 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రభుత్వాలు చేస్తున్న పనులు పట్ల పౌరులకు శ్రద్ధ ఉండాలి. అలానే వాటిని వినియోగించుకునేందుకు త‌గు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవాళ ప్ర‌తి ప‌నీ పూర్తి అయ్యేలా భైరీ గ్రామ వైఎస్సార్సీపీ నాయ‌కులు క‌దిలారు. చుట్టు ప‌క్క‌ల గ్రామాల‌కు ఆద‌ర్శంగా నిలిచారు.

ఇక రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన విప‌క్ష నేత చంద్ర‌బాబు అరెస్టును ఉద్దేశిస్తూ.. త‌ప్పు చేసి ఆయ‌న ద‌బాయిస్తున్నారు. స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ పేరిట సీమెన్స్ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నామ‌ని ఆ రోజు చెప్పారు. ఇది ఒక జ‌ర్మ‌నీ కంపెనీ. ఇదే విష‌యం మ‌న రాష్ట్ర ప్ర‌భుత్వం అడ‌గా వారు అదేమీ లేద‌ని అన్నారు.  మొద‌ట ఈ విష‌య‌మై కేంద్ర ప్రభుత్వం చేసిన ఇన్వెస్టిగేష‌న్ ఈడీ పట్టుకుంది. 2021 లో రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. జర్మనీ కంపెనీ వారిని మన రాష్ట్ర ప్రభుత్వం అడగగా, మాకు ఏపీకి ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పేశారు. 

డబ్బు ఎలా ఎక్కడికి వెళ్ళింది అని దర్యాప్తు సంస్థ వేట మొదలు పెట్టింది. అదే పేరుతో ఏర్పాటు అయిన 6 షెల్ కంపెనీలకు వెళ్లినట్టు తేలింది. వారిని పట్టుకున్నాక,అక్కడి నుంచి చంద్ర బాబు పీఏకి, లోకేశ్ పీఏకి డ‌బ్బు వెళ్లి నట్టు తేలింది. వారి కోసం వెళ్తే వారు దేశం వదిలి వెళ్లిపోయినట్లు తేలిపోయింది. ఈ పని అంతా చంద్రబాబు సీఎం గా ఉంటున్నపుడు జరిగింది. అంతే కాదు జీఎస్టీ  కూడా ఎగొట్టారు, 2021 లో కేసు నమోదు అయితే ఇప్పుడు నిరూపితం అవుతోంది. గ‌తంలో తప్పు చేశారని ఆరోపణ వ‌స్తే  ఇందిరా గాంధీ, జయ లలిత,పీవీ న‌ర‌సింహారావు,లాలూ ప్ర‌సాద్ యాద‌వ్, ఇలా అందరూ కోర్టులు ముందు నిరూపించుకున్నారు.

అడ్డంగా దొరికి బొంకితే ఎలా ? దేశంలో చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది. ఇన్ని సాక్షాలు ఉంటే అన్నయం ఎలా అవుతుంది.. దేశం విడిచి పారిపోయిన వారి పీఏ లను ర‌ప్పించాలి. దొంగ దొరికితే సానుభూతి ఎందుకు ? ఎవరి కోసం ? అలా వ‌దిలేస్తే, చివ‌ర‌కు ప్రజలకు బొడి గుండు మిగులుతుంది. ప్రజలకు చేరాల్సిన డబ్బును చంద్రబాబు త‌న అకౌంట్ లో జ‌మ చేసుకున్నారు. కానీ గడిచిన నాలుగేళ్లలో రెండు ల‌క్ష‌ల ముప్పై వేల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు వివిధ సంక్షేమ ప‌థ‌కాల ద్వారా అందించారు. వీటిని నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి జ‌మ చేశాం. ఈ విషయ‌మై మ‌ధ్యవ‌ర్తుల ప్ర‌మేయం అన్న‌ది లేనే లేదు. ఇవాళ ఆత్మ గౌర‌వం ఎక్క‌డా దెబ్బ‌తిన‌ని విధంగా ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాల‌ను వ‌ర్తింపు చేశాం. 

ఇంకా ఆయన మాట్లాడుతూ., 
ఆ రోజు చంద్ర‌బాబు మాట ఇచ్చి త‌ప్పారు. రైతు రుణాల మాఫీ విష‌య‌మై, డ్వాక్రా రుణాల మాఫీ పై ఆ రోజు హామీలు ఇచ్చారు. కానీ మాట‌ల‌న్నీ మ‌రిచిపోయి అధికారం ఆయ‌న అనుభ‌వించారు. ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ‌కు జ‌న్మ‌భూమి క‌మిటీలు నియ‌మించారు. వారంతా ప్ర‌జ‌ల‌ను పీడించారు. వారి రిక‌మెండేష‌న్లు ఉంటేనే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అయ్యేవి. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నులు అయ్యేవి కావు. కానీ ఇప్పుడు ఒక‌నాటి ప‌రిస్థితులు లేవు. అన్నీ మారేయి. వ్య‌వ‌స్థ‌లో మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేదు. లంచాల‌కు తావి లేదు. అవినీతి ర‌హిత పాల‌న అందించ‌డం మా ప్ర‌థ‌మ ధ్యేయం. అందుకు అనుగుణంగా పాల‌న సంస్క‌ర‌ణలు చేస్తున్నాం. వాటి అమ‌లుతో స‌త్ఫ‌లితాలు అందుకుంటున్నాం.

పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో ఇంటి మేడ మీద ఏ రంగు లేదా ఏ పార్టీ జెండా కట్టారో లేదో అన్నది చూడలేదు. మళ్ళీ ఓటు వేస్తారో లేదో చూడలేదు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల వరకే ఓటు,పార్టీలు. తర్వాత ఏర్పాటైన ప్రభుత్వానికి పౌరులు అందరూ సమానమే. ఇదే మా ప్రభుత్వం ప్రిన్సిపల్. దేశంలో ఇంక ఎక్కడా ఇలాంటి ప్రిన్సిపల్ ఆచరిస్తున్న ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వంలో అంతా బ్రోకర్లమయం (జన్మ భూమి కమిటీల పేరిట ఆ రోజు నిబంధనలకు నీళ్లొదిలారు). పౌరులకు అందించిన పథకాల్లో వారికి వాటా ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు ఇందుకు భిన్నంగా పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రతి గ్రామంలో, వార్డులో ఒక కార్యాలయం ఏర్పాటు చేసి, వారికి అనుసంధానంగా వలంటీర్స్ ను నియమించి,నిష్పక్షపాతంగా పథకాలు అమలు చేస్తున్నాం

మంచి చేస్తున్న ప్రభుత్వం పట్ల విమర్శ చేయడానికి ప్రతిపక్షాలకు ఏమి లేకా ..నిత్యావసరాలు ధరలు ఆకాశాన్నంటాయి అంటున్నారు. ధరలు అనేవి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. దేశంలో ఎక్క‌డ‌యినా ధ‌ర‌ల విష‌య‌మై ఆరా తీయండి. ఆ త‌రువాతే మాపై ఆరోప‌ణ‌లు చేయండి. నిత్యావ‌స‌ర స‌ర‌కుల ధ‌రల విష‌య‌మై ఇరుగు,పొరుగు రాష్ట్రాల‌తో పోల్చి చూడండి. క‌నుక విప‌క్షాలు త‌మ అస‌త్య ప్ర‌చారాలు మానుకోవాలి.  మేం ఏం చేశామ‌న్న‌ది చెబుతున్నాం. మీరు కూడా ఆ రోజు ఏం చేశారో ధైర్యంగా చెప్ప‌గ‌ల‌రా ? చెబితే సంతోషిస్తాం.

ఇవాళ నాడు నేడులో భాగంగా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మార్చేశాం. 
అలానే పిల్లలకు ఉచితంగా బుక్స్,షూస్,బెల్ట్,యూనిఫాం,ట్యాబ్ వ‌గైరా వ‌గైరా అందించ‌డంతో పాటే డిజిటల్ క్లాస్ రూమ్స్ ను అందుబాటులోకి తీసుకుని వ‌చ్చాం. వారిని ప్రయోజన‌కారులుగా తీర్చిదిద్ది,త‌ద్వారా వారి కార‌ణంగా భ‌విష్య‌త్ లో ఆ కుటుంబం బాగుపడాలి అనే సంకల్పంతో ప‌నిచేస్తున్నాం.

జిల్లాలో 4 వేల కోట్ల రూపాయ‌ల‌తో సీ పోర్టు (మూల‌పేట పోర్టు) నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఓడరేవు వ‌స్తే,బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఇంకా మెరుగు పడతాయి. బుడగట్లపాలెం లో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నాం. ఇదంతా సీఎం జగన్ విశాల భావజాలంతోనే సాధ్య అవుతోంది అని, చంద్రబాబు జిల్లాకు ఏం చేశారో చెప్పగలరా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కోన్నారు.

జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరాపు సూరిబాబు,   డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ మూర్తి,  ఏంపిపి లు అంబటి నిర్మల, గొండు రఘు రామ్, జెడ్పీటీసీ రుప్ప దివ్య, మండల నాయకులు చిట్టి జనార్ధన రావు, వైయ‌స్ఆర్‌సీపీ  శ్రీకాకుళం పట్టణ అధ్యక్షులు సాదు వైకుంఠ రావు,చల్ల రవి కుమార్, మెంటాడ స్వరూప్, ధర్మాన రఘు, చిట్టి రవి, నక్క కృష్ణ, నక్క శంకర్, బగ్గు అప్పారావు, వైస్ ఎంపిపి చంద్ర మౌళి,  గుండ హరీష్, బాన్న నర్సింగ  రావు, ఊటపల్లి కృష్ణ,  యాల్ల నారాయణ, కొయ్యన నాగ బుషన్, అంధవరపు రమేష్, పొన్నన కుర్మా రావు, నక్క గణేష్, తదితరులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top