సమున్న‌త రాజ‌కీయ దృక్ప‌థం వైయ‌స్ఆర్‌సీపీ సొంతం

  శ్రీ‌కాకుళం నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్లీన‌రీలో మంత్రి వర్యులు ధ‌ర్మాన  

శ్రీ‌కాకుళం : సమున్న‌త రాజకీయ దృక్ప‌థం వైయ‌స్ఆర్‌సీపీ సొంతం అని, రాజ్యాంగ స్ఫూర్తికి నిద‌ర్శ‌నం ఇప్ప‌టి ప్ర‌భుత్వ పాల‌న  రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. స్థానిక అంబేద్క‌ర్ ఆడిటోరియంలో శ్రీ‌కాకుళం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్లీన‌రీని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నేమ‌న్నారంటే.. 

"ఈ స‌మాజాన్ని మెరుగైన స‌మాజంగా రూపొందించేందుకు ప‌నిచేసేదే రాజ‌కీయ పార్టీ..ఇందులోభాగంగా అంద‌రి క్షేమం కోరుకునే విధంగా ప‌నిచేయాలి అంటే ఏం చేయాలి..? అన్న విష‌యమై అధ్యయ‌నం చేశాం..అవినీతి లేని ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం ఓ వంతు..అందుకు త‌గ్గ వ్య‌వ‌స్థ‌ను రూపొందించి అమ‌లు చేయ‌డం..మ‌రో వంతు. అదే రీతిన గౌర‌వంగా అర్హ‌త  ఉన్న వారంద‌రికీ సంక్షేమం అందేలా చేయడం.. బాధ్య‌త. సంక్షేమం అందుకోవ‌డం అన్న‌ది రాజ్యాంగం అందించిన గౌర‌వం అని భావించే విధంగా చేయ‌డం..ఓ అధికార పార్టీ విధి. వీట‌న్నింటిపై విధాన‌ప‌ర నిర్ణ‌యాలు వెలువ‌రించ‌డం..అమ‌లు చేయ‌డం అన్న‌ది ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ  పాటిస్తున్న ప్ర‌థమ క‌ర్త‌వ్యం.." 

ఓ రాజ‌కీయ పార్టీకి ప్లీన‌రీ ఎందుకంటే ? 
అది రూపొందించే మ్యానిఫెస్ట్ ఉద్దేశం ఏంటంటే? 
"పాల‌న‌లో భాగంగా ల‌క్ష్యాల‌ను చేరుకున్నామా లేదా అందుకు అనుగుణంగా పార్టీని న‌డిపామా ? న‌డ‌ప‌లేకపోతే అందుకు ఏయే అంశాలు దోహ‌ద‌ప‌డ్డాయి. మ‌రింత స‌మ‌ర్థ నీయ ధోర‌ణిలో ఏ విధంగా ప‌నిచేయాలి..? అన్న‌వి.. పార్టీలో ప‌నిచేసేవారంద‌రికీ ఓ అవ‌గాహన క‌ల్పించ‌డ‌మే..అందుకు ఓ నిర్ణ‌యానికి రావ‌డ‌మే ప్లీన‌రీ. ఇది జరిగి తీరాలి. వీటిని పొలిటిక‌ల్ పార్టీలు త‌మ విధి విధానంలో భాగంగా ఏటా చేస్తుంటాయి. అధికారంలో రాని నాడు   మ‌నం కూడా  గుంటూరులో చేశాం. అప్పుడు అనుకున్నాం 
ఆ రోజు పాల‌న‌లోకి వ‌చ్చాక, అధికారం ద‌క్కాక మ్యానిఫెస్టో అన్న‌ది ఏ విధంగా అమ‌ల్లో ఉండాలో అన్న‌ది డిజైన్ చేశాం."

మ్యానిఫెస్టో ఎందుకంటే... 
"దుర‌దృష్టం ఏంటంటే ఎన్నిక‌ల ముందు రిలీజ్ చేసే మ్యానిఫెస్టో అన్న‌ది ఎన్నిక‌ల త‌రువాత చాలా చోట్ల అమ‌లులో లేదు. అందుకే మ్యానిఫెస్టో చూసి దేశంలో చాలా చోట్ల ఓటు వేయ‌ని ప‌రిస్థితి నెల‌కొని ఉంది. ఇటువంటి అపవాదు మ‌న‌కు రాకూడ‌దు అని జ‌గ‌న్ భావించారు. అందుకే ఆ..నింద రాకుండా, ఆ అప‌వాదు లేకుండా మ్యానిఫెస్టోను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని క‌న్నా ముందు ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి, ప్ర‌జల బాధ‌లు గుర్తించి, త‌దనుగుణ రీతిలో ఎన్నిక‌ల ప్ర‌ణాళిక రూపొందించారు." 

ప్ర‌జ‌ల క‌ష్టాలు చూశాక..స్పందించాక 
ప్ర‌వేశ పెట్టిన‌వే ప‌థ‌కాలు...
"ఇదే సంద‌ర్భంలో ప్ర‌జ‌ల క‌ష్టాలు ద‌గ్గర నుంచి చూశారు. వారి ద‌య‌నీయ ప‌రిస్థితుల గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా  గ్రామీణ వాతావ‌ర‌ణంతో మ‌మేకం అయిన  మ‌న కుటుంబాలలో ఒక‌ప్పుడు  ఇల్లాలిని గౌర‌వించేవారు. కానీ క్ర‌మ,క్ర‌మంగా అవి త‌గ్గాయి. లేదు స్త్రీని బ‌లోపేతంచేయాలి అని..ఆమెకు పాత రోజుల్లో ద‌క్కిన గౌర‌వం..ద‌క్కే విధంగా చేయాలి అని సంక‌ల్పించి వెల్ఫేర్  ప్రొగ్రాంలు అన్న‌వి రూపుదిద్దుకున్నాయి. ప్ర‌భుత్వం క‌ట్టించి ఇచ్చే ఇల్లు నుంచీ అమ్మ ఒడి వ‌ర‌కూ, ఆర్థికంగా వారికి స్వావ‌లంబ‌న క‌ల్పించే ద‌శ నుంచీ రుణాలు ఇప్పించేంత వ‌ర‌కూ అన్నింటా మ‌గువ‌కే తొలి ప్రాధాన్యం. అదేవిధంగా గ‌త ప్ర‌భుత్వం ఇస్తామ‌న్న డ్వాక్రా మ‌హిళ‌ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే ఇవ్వ‌డం నుంచీ, పిల్ల‌ల‌ను చ‌దివించే స్థోమత లేక‌పోతే ..వారికి అమ్మ ఒడి  అందించి, డ్రాపౌట్లు నివారించే వ‌ర‌కూ అన్నింటా మ‌గువ‌ల‌కే తొలి ప్రాధాన్యం. ఆ విధంగా బ‌డి ఈడు పిల్ల‌లు బ‌డిలోనే అన్న నినాదం అమ‌ల్లో భాగంగా మంచి భోజ‌నం అందించి మిగిలిన సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నాం.. విద్య‌లో మ‌న దేశం 22 వ స్థానంలో ఉంది. ఇంత బ‌లమైన రాష్ట్రం విజ్ఞ‌త క‌లిగిన రాష్ట్రం అయినా ఈ అథ‌మ స్థానం మ‌న‌కెందుకు ? " 

75 ఏళ్ల‌లో పొలిటిక‌ల్ పార్టీలు ఏం చేశాయ‌ని.. ? 
"ఎందుకంటే ఓ వ‌ర్గానికి చ‌దువులు అందకుండా పోయాయి..స‌మానమ‌యిన రీతిలో విద్యావ‌కాశాలు అంద‌రికీ ఉండాలి అని రాజ్యాంగంలో చెప్పారు. అదేవిధంగా కేర‌ళ మాదిరిగా నూటికి  నూరు మంది చ‌దువుకునే విధంగా ఈ భావ జాల వ్యాప్తికి కృషి చేస్తూ, సంబంధిత చ‌దువుల‌కు మంచి సౌక‌ర్యాలు అందిస్తూ సంబంధిత ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ 75 ఏళ్ల‌లో పొలిటిక‌ల్ పార్టీలు ఏం చేశాయ‌ని..? ఆఖ‌రికి సంక్షేమ ప‌థ‌కాల అమలుపై అప్ప‌టి ప్ర‌ధాని రాజీవ్ గాంధీ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కానీ మ‌న రాష్ట్రంలో ప‌రిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి." 

విష ప్ర‌చారం వ‌ద్దే వద్దు! 
అలాంటివి అడ్డుకోండి ! 
"అవినీతి లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాల వ‌ర్తింపు, అమ‌లు అన్న‌వి అవుతున్నాయి. ఓ రాజ‌కీయ పార్టీగా మ‌నం త‌ప్పు చేయ‌లేదు.. స‌రైన సిద్ధాంతంతో ప‌నిచేసే రాజ‌కీయ పార్టీలోనే మ‌నం ప‌నిచేస్తున్నాం. క‌నుక గ్రామాల్లో కూడా అంతా త‌లెత్తుకుని తిరిగే విధంగా సంక్షేమ ఫ‌లాలు అందుకునే విధంగా,గ్రామ స్థాయిలో స‌ర్పంచుల జోక్యం లేకుండా చేయ‌గ‌లుగుతున్నాం. ప్ర‌శ్నిస్తే ప‌థ‌కాలు రావు అన్న అపోహ‌లు లేకుండా, మ‌నం అన్ని ప‌థ‌కాల‌నూ వ‌ర్తింపజేయ‌గ‌లుగుతున్నాం. ఇవ‌న్నీ అర్థం కాని కొంత‌మంది, అర్థం అయినా అర్థం కాని విధంగా ప్ర‌వ‌ర్తిస్తూ కొంత‌మంది ఏవేవో మాట్లాడుతున్నారు." 

పాల‌న మ‌రింత స్థానికం 
స‌చివాల‌య వ్య‌వ‌స్థ 
అమ‌లుకు చిహ్నం 
"నిజాయితీతో కూడిన మాట‌లు ఏనాడ‌యినా విప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు చెప్పారా..ప్ర‌భుత్వం తీసుకువ‌స్తే ఈ మార్పు చేయ‌గ‌లిగాం అని మ‌నం చెప్ప‌గ‌లుగుతున్నాం..పెట్రోలు, డీజిలు ధ‌ర‌ల పెరుగుద‌ల అంతటా ఉంది. కానీ ఆ రాష్ట్రాల‌లో లేని ప‌థ‌కాలు ఇక్కడ అమ‌లువుతున్నాయి. వాటిపై మాట్లాడకుండా ప‌క్క రాష్ట్రాల‌తో ధ‌ర‌ల‌ను పోలుస్తూ మాట్లాడ‌డం త‌గ‌దు. కార్య‌క‌ర్త‌లు అప్ర‌మత్తంగా లేక‌పోతే అస‌త్య ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు న‌మ్మే అవ‌కాశాలున్నాయి. మీరు ఎప్పుడ‌యినా ఊహించారా ! స‌మ‌ర్థ‌నీయ స్థితిలో ప‌నిచేసే 15 మంది అధికారులు గ్రామంలో ఉండి సంబంధిత స‌చివాలయ స్థాయిలో ప‌నిచేసే అవ‌కాశం ఉంటుంద‌ని ? ఆఖ‌రికి రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్ కూడా త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానుంది." 

మార్పు  అంటే ఇదే 
గ్రామాల్లో చెప్పండి ! 
"ప‌రిపాల‌న అంటే దిగువ స్థాయి వ‌ర‌కూ చేరుకోవ‌డం..ఇది క‌దా మార్పు అంటే..మీకు ఏ ఇన్ఫ‌ర్మేష‌న్ కావాల‌న్నా స‌చివాల‌యం కు పోవ‌చ్చు. అదేవిధంగా రైతుకు అందించే స‌మాచారం విష‌యమై ఆర్బీకేలు ప‌నిచేస్తున్నాయి. పెట్టుబ‌డి సాయం కింద ఏడాదికి 
రూ.13 వేలు అందిస్తాం అన్నాం..అందించాం. కానీ అన్యాయం,అన్యాయం అని విప‌క్షాలు అంటున్నాయి.. అంటే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే ఇవ‌న్నీ తీసేస్తారా ? నెల వ‌చ్చేట‌ప్ప‌టికి పింఛను రాక‌పోతే వృద్ధులు ఏమ‌యిపోతారు? వ‌స‌తి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి రాక‌పోతే పేద బిడ్డ‌లు ఏమయిపోతారు? వీటి గురించి మాట్లాడాలి.. క‌రప్ష‌న్ ఫ్రీ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను, పాల‌న వ్య‌వ‌స్థ‌ను ఆహ్వానించి ప‌నిచేయాలి..ఇది క‌దా! మార్పు అంటే.."

"మ‌నం అంతా చేసేవ‌న్నీ చెప్పాల్సి ఉంది..అంటే రాజ‌కీయ పార్టీ అంటే ప్ర‌జా జీవ‌నాన్ని మార్చేందుకు కృషి చేసే ఓ స‌మ‌గ్ర, సమున్న‌త వ్య‌వ‌స్థ. అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌లు రూపొందించి అధికారంలోకి రాగానే ప‌నిచేసే వ్య‌వ‌స్థ..అదేవిధంగా  విప‌క్షాలు ఈ రోజు అభివృద్ధి లేదు అని చెప్ప‌డం త‌గ‌దు.. డ‌బ్బు ఎక్క‌డా దుర్వినియోగం చేసే ప‌ని లేదు. ఇంత‌కూ  చంద్ర‌బాబు త‌న  పాల‌న‌లో ఏం చేశారో చెప్పగ‌ల‌రా ? ఆయ‌న క‌ట్టిన బ‌డి కానీ, వెల్ నెస్ సెంట‌ర్ కానీ, ఆర్బీకే సెంట‌ర్ కానీ చూపించ‌గ‌ల‌రా ? "

"ఇదే విష‌యంలో టీడీపీ నాయ‌కులు అచ్చెన్నాయుడు కానీ, రామ్మోహ‌న్ నాయుడు కానీ స్పందించ‌గ‌ల‌రా  ? ఎంతో సైలెంట్ గా బ‌డుల‌కు కొత్త వ‌స‌తులు స‌మ‌కూరాయి. 30 ల‌క్ష‌ల ఇళ్ల ప‌ట్టాలు అందించాం.  ఇందుకు 12వేల కోట్ల రూపాయ‌లు వెచ్చించాం. అర్హులు ఇల్లు క‌ట్టించుకునేందుకు మేం ఇచ్చే డ‌బ్బులు స‌రిపోతాయి అని అనుకోవ‌డం లేదు.. కానీ ఇల్లు కట్టివ్వ‌డం అంటే వారికో సామాజిక గౌర‌వం ఇవ్వ‌డం అని అర్థం. కార్య‌క‌ర్త‌లు వీటిపై మాట్లాడాలి. కార్య‌క‌ర్త‌లే పార్టీ చేపట్టద‌లుచుకున్న ప‌నులు లేదా ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌నులు ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల్సిందే ! మీరయినా,నేన‌యినా ఈ ప‌ని చేయాల్సిందే ! అదేవిధంగా క‌రోనా స‌మ‌యంలోనూ ఎన్నో కష్ట,న‌ష్టాల‌కు ఓర్చి వాట‌న్నింటినీ జయించాం. మీరు విప‌క్ష నాయ‌కుల‌ను అడ‌గండి మీకు బుద్ధి ఉందా ? అని ! ఇవాళ పాల‌న సాగుతున్న తీరు స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణిలో ఉన్నందున మీకు ఓ ధైర్యం వ‌చ్చి ఉంటుంది.." 

ఆత్మ గౌర‌వ‌మే ప్ర‌ధానం 
"ప‌థ‌కాల విష‌య‌మై మ‌నం ఎవ్వ‌రి ద‌గ్గ‌ర‌కూ పోవాల్సిన అవస‌రం లేద‌ని తేలిపోయింది. వీటిని అర్థం అయ్యేలా చెప్పే బాధ్య‌త 
పార్టీకీ, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సమ‌న్వ‌య క‌ర్త‌లుగా ప‌నిచేసే కార్య‌క‌ర్త‌లే ! గ‌తంలో ఏనాడ‌యినా ఈ విధంగా ఉందా..? క‌నుక కార్య‌క‌ర్త‌లు 
వీటిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. గ‌తంలో మాదిరిగా ఉంటే ప్ర‌జ‌లకు ఒక అవ‌మాక‌ర‌మైన జీవితం వ‌స్తుంది..అది మ‌నం 
వద్ద‌నుకున్నాం..మీరు పూర్తిగా పార్టీ పై ఆధార ప‌డ‌వ‌ద్దు. రాజ‌కీయ పార్టీలో ప‌నిచేసే వారికి ఎవ‌రికి వారు సంపాదించుకునే వృత్తి ఒక‌టి ఉండాలి..ఆ విధంగా ఉంటే అప్పుడు పార్టీ వెనుక నుంచి కొంత సాయం అందిస్తుంది"

ఆ రోజు ఎన్టీఆర్ వేద‌న అర్థం చేసుకున్నారా ? 
"తెలుగుదేశం పార్టీ దొంగ‌ల పార్టీ.. నేను అన‌కూడ‌దు ఆ రోజు ఎన్టీఆర్ వేద‌న అర్థం చేసుకున్నారా ? విన్నారా ? ఏ ఎన్టీ.రామారావు ను ప‌ద‌వీచ్యితుడ్ని చేశారో ఆ విధంగా ఆయ‌న్ను ఇప్పుడు వాడుకుంటున్నారు. కొన్ని పేప‌ర్లు చ‌ద‌వ‌డానికి బాగుంటాయి కానీ ఒట్టి అబ‌ద్ధం. వాళ్లు ఎంత అబ‌ద్ధాలు చెబుతున్నా వాటికి కౌంట‌ర్ చేస్తూ మ‌నం ప‌నిచేస్తున్నాం.. చేయ‌గ‌లిగినంత ప‌నిచేస్తూ ఉన్నాం..అయినా కొన్ని మీడియా సంస్థ‌లు విష ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే కార్య‌కర్త‌లు బాగా ప‌నిచేయాలి..విష ప్ర‌చారం తిప్పికొట్టాలి..యువ‌కులు మేం చెప్పిన మాట‌ల‌ను సోష‌ల్ మీడియాలో బాగా విస్తృతం అయ్యే విధంగా ప‌నిచేయండి. మ‌హిళ‌ల‌లో కొత్త‌గా ప‌నిచేసే వారిని గుర్తించండి. యంగ‌ర్ జన‌రేష‌న్-ను ఐడెంటిఫై చేయండి. వారితో క‌లిసి ప‌నిచేయండి. అదేవిధంగా రైతాంగాన్ని వీలున్నంత వ‌ర‌కూ ఆదుకుంటున్నాం. దీనిపైనే ఫోక‌స్ చేస్తూ, వీలున్నంత వ‌ర‌కూ సాగు  అనుకూలం అయ్యే విధంగా ఆర్థిక ప్ర‌యోజ‌నం ద‌క్కే విధంగా కృషి చేస్తున్నాం. ఈ దేశంలో రైతాంగానికి చేసినంత ఏ ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వం చేసింద‌ని అనుకోవ‌డం లేదు. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై తిరుగుబాటు చేయండి. జూలై మూడున జ‌రిగే జిల్లా స్థాయి ప్లీన‌రీలో ఇంకా విస్తృతంగా మాట్లాడ‌తాను. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌నిచేసిన కార్య‌క‌ర్త‌ల‌కూ, నాయ‌కుల‌కూ అభినంద‌నలు చెబుతున్నాను."

క్షేత్ర స్థాయిలో క‌మిటీల‌ను బ‌లోపేతం చేయండి

"అదేవిధంగా క్షేత్ర స్థాయిలో క‌మిటీల‌ను బ‌లోపేతం చేయండి.. ప‌నిచేయ‌ని వారిని మార్చండి. స‌మ‌గ్ర‌మైన, నీతివంత‌మైన నాయ‌కులను ఎంపిక చేస్తే దాని కార‌ణంగా పాల‌న మారుతుంది అనేందుకు తార్కాణాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా చూడండి 
ఎక్క‌డ ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ నీతివంతంగా ఉందా లేదా అన్న‌ది చూస్తున్నారు. దేశంలో చ‌దువరుల సంఖ్య పెరిగింది. అదేవిధంగా అనేక విష‌యాలు వాస్త‌వాలు తెలుసుకునేందుకు ఆస్కారం పెరిగింది. అందుకోసం ఆ దిశ‌గా పార్టీ బ‌లోపేతానికి నీతివంతం అయిన పాల‌న అందించేందుకు అంతా ప‌ని చేయాల్సి ఉంది.  ఏమ‌యినా స‌రే ముఖ్య‌మంత్రి స‌భ‌కు కార్య‌క‌ర్త‌లంతా త‌ర‌లి వ‌చ్చేలా కృషి చేయాలి. వీలున్నంత వ‌ర‌కూ అంతా త‌ర‌లివ‌చ్చి జై జ‌గ‌న్ అని నిన‌దించి వెళ్లాలి.. అని పిలుపు ఇస్తున్నాను. వ‌ర్షం ప‌డినా స‌భ‌ను విజ‌య‌వంతం చేసేవాడే స‌రైన కార్య‌క‌ర్త..! ఆ విధంగా అంతా క‌లిసి పనిచేయాలి. ముఖ్య‌మంత్రి ఏరికోరి ఈ శ్రీ‌కాకుళం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకున్నారు. కనుక బోరున వ‌ర్షం ప‌డినా సరే అంతా స‌భ‌ను విజ‌య‌వ‌తం చేసేందుకు స‌మ‌ష్టిగా కృషి చేయండి." అని అన్నారు.

 జెడ్పీ మాజీ చైర్మ‌న్ వైవీ.సూర్య‌నారాయ‌ణ నేతృత్వంలో..జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, రాష్ట్ర స్థాయిలో నెలకొల్పిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపిటిసిలు, పార్టీకి సంబంధించి వివిధ విభాగాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top