జై విశాఖ నినాదం అంద‌రిలో వినిపించాలి

మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్దతుగా ఇచ్ఛాపురంలో భారీ ర్యాలీ 

ఇచ్ఛాపురం : అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణే ధ్యేయంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మూడు రాజ‌ధానుల ఏర్పాటు చేస్తున్నార‌ని, ఇందుకోసం మీరంతా మాతో కలిసి రావాలి అని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు  పిలుపునిచ్చారు. జై విశాఖ అంటే జైజై విశాఖ అనే విధంగా మీ మీ నినాదాలు అందరికీ వినిపించాలి. చంద్ర‌బాబు గుండెల్లో రైళ్లు ప‌రుగులు పెట్టాలి. మీరు ఆ విధంగా నిన‌దిస్తే అచ్చెన్నాయుడు లేరు, రామోహ‌న్ నాయుడు లేరు .. చంద్ర‌బాబు నాయుడు లేరు. మీరు నిన‌దిస్తే చాలు వీరంతా బెదిరిపోవాలి. ఉత్త‌రాంధ్రలో రాజ‌ధాని ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి అడ్డంకులూ లేకుండా వ్య‌వ‌హ‌రించ‌గ‌ల‌గాలి. ఆ విధంగా మీరంతా పోరాటం చేయ‌గ‌ల‌గాలి... అని పిలుపు ఇచ్చారాయ‌న.

మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా సోంపేట మండ‌లం కొర్లాం నుంచి ఇచ్ఛాపురం వ‌రకూ భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం ప్ర‌జా ప్ర‌స్థానం గ్రౌండ్స్ లో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ.. విశాల దృక్ప‌థంతో ఉన్న ప్ర‌జ‌లు విశాఖ వాసులు అని, ఏ విధంగా చూసుకున్నా రాజ‌ధానికి విశాఖ యోగ్య‌త ఉన్న న‌గ‌రం అని అన్నారు. అన్ని విధాలుగా అనుకూలం అయిన‌టువంటి న‌గ‌రం, అంత‌టి కాస్మోపోలిటన్ ఎట్మాస్ఫియ‌ర్ ఉన్న న‌గ‌రం కూడా ఇంకొక‌టి లేదు అని చెప్పారు. అదేవిధంగా రాజ‌ధానిగా విశాఖ ఏ విధంగా అనుకూలం అన్న‌ది వివరించారు. మిగలిన‌టువంటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విశాఖ‌ను మించిన న‌గ‌రం మ‌రొక‌టి లేదు. కొంద‌రి స్వార్థం కార‌ణంగా ఇవాళ క్యాపిటల్ లేకుండా అయిపోయింది. 

 
కేవ‌లం ఐదు వంద‌ల ఎక‌రాలు ఉంటే చాలు రాజ‌ధాని నిర్మాణం సాధ్యం. కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ లో చేసిన చ‌ట్టం ప్ర‌కారం సెక్ష‌న్ 6 కింద శివ రామ కృష్ణ‌న్ క‌మిష‌న్ రిపోర్ట్ కూడా అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌నే సూచిస్తోంది. కానీ ఇవేవీ కాద‌ని ఆ రోజు చంద్ర‌బాబు నేతృత్వంలో క‌మిటీ ఒక‌టి  రాజ‌ధానిగా అమ‌రావ‌తిని సూచించింది. ప్ర‌తిపాదించింది. ఇలాంటి సంద‌ర్భంలో మ‌నం అంతా ఏక‌మై వ‌చ్చినటువంటి అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొన్న‌టి వేళ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు అర‌స‌వ‌ల్లి వ‌ర‌కూ రావాల‌ని చూశారు. కానీ త‌రువాత వాళ్లంతా తోక‌ముడిచి వెళ్లిపోయారు. అందరికీ స‌మానంగా సంప‌ద‌ను పంచాల‌న్న‌ది మా సంక‌ల్పం. అదేవిధంగా ఇవాళ మన ప్ర‌భుత్వ హ‌యాంలో కొన్ని అభివృద్ధి ప‌నులు చేశాం. ఆర్బీకే వ‌చ్చింది. 

అదేవిధంగా గ్రామ స‌చివాల‌యాలు ఏర్పాటు చేశాం. ఇంకా కొన్ని వ‌స్తాయి. ఇక రాజ‌ధానికి సంబంధించి డ‌బ్బుల‌న్నీ తీసుకునివెళ్లి అమ‌రావ‌తిలో పెట్టేస్తాం అంటే ఎలా ? ఇది స‌బ‌బు కాదు. అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా ఉంచి, విశాఖ‌ను పాల‌న రాజ‌ధాని చేయాల‌న్న‌ది మా ఆలోచ‌న. అదేవిధంగా న్యాయ రాజ‌ధానిగా క‌ర్నూలును చేయాల‌ని భావిస్తున్నాం.ఆ విధంగా అడుగులు వేస్తున్నాం. ఏ విధంగా చూసుకున్నా మ‌నం దెబ్బ‌తిన్నాం. మ‌రోసారి ఆ విధంగా జ‌ర‌గ‌కూడ‌దు. ప్ర‌పంచ వ్యాప్తంగా అంగీక‌రించిన న‌మూనానే మ‌నం కూడా పాటించాలి. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణే ధ్యేయంగా మూడు రాజ‌ధానుల ఏర్పాటు అన్న‌ది చేయాలి. ఇందుకోసం మీరంతా మాతో కలిసి రావాలి అని పిలుపునిస్తున్నాను. జై విశాఖ అంటే జైజై విశాఖ అనే విధంగా మీ మీ నినాదాలు అందరికీ వినిపించాలి. చంద్ర‌బాబు గుండెల్లో రైళ్లు ప‌రుగులు పెట్టాలి. మీరు ఆ విధంగా నిన‌దిస్తే అచ్చెన్నాయుడు లేరు, రామోహ‌న్ నాయుడు లేరు .. చంద్ర‌బాబు నాయుడు లేరు. మీరు నిన‌దిస్తే చాలు వీరంతా బెదిరిపోవాలి. ఉత్త‌రాంధ్రలో రాజ‌ధాని ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి అడ్డంకులూ లేకుండా వ్య‌వ‌హ‌రించ‌గ‌ల‌గాలి అన్నారు.

రాష్ట్రం విడిపోయాక మ‌నం చాలా నష్ట‌పోయాం. రాజ్యాంగం ప్ర‌కారం అందుకున్న అధికారం ఉప‌యోగించుకుని రాష్ట్ర విభ‌జ‌న అన్న‌ది జ‌రిగింది. విడ‌దీసేందుకు ఓ చ‌ట్టం చేసింది. కొత్త రాష్ట్రం ఏర్ప‌డ్డాక కూడా ప‌ది ఏళ్ల వ‌ర‌కూ హైద్రాబాద్లో ఉండ‌వ‌చ్చు. ఇది ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద్రాబాద్ ఉంటుంది. అటుపై  దీని ప‌దేళ్ల లోపు నిర్మాణం జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. ఇది సెక్ష‌న్ ఫైవ్ చెబుతోంది. సెక్ష‌న్ 6 ఏం చెబుతుంది అంటే కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ఒక క‌మిటీ నియ‌మించి, ఇందులో భాగంగా రాజ‌ధాని ఏర్పాటు కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంంగా క‌మిటీ తిరిగి అభిప్రాయాలు సేక‌రిస్తుంది అని చెప్పింది. ఇందుకు ఆరు నెల‌ల కాలం గ‌డువుగా నిర్ణ‌యించింది. ఆ విధంగా ఓ క‌మిటీ ఏర్పాటైంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి అన్ని ఇబ్బందుల‌నూ దృష్టిలో ఉంచుకుని, త‌రువాత రాజ‌ధాని ఏర్పాటుకు సంబంధించి ఉన్న ఇబ్బందుల‌నూ దృష్టి లో ఉంచుకుని ఓ నివేదిక ఇచ్చింది.

శివ రామ కృష్ణన్  క‌మిటీ ఇక్క‌డ అంటే విజ‌య‌వాడ - గుంటూరు మ‌ధ్య రాజ‌ధాని ఏర్పాటు చేయ‌వ‌ద్దు అని  చెప్పింది. అదేవిధంగా హ్యూజ్ క్యాపిట‌ల్ వ‌ద్ద‌నే వ‌ద్దు అని చెప్పింది. కానీ ఆ రోజు హైద్రాబాద్ లోనే అన్ని పెట్టుబ‌డులు పెట్ట‌డం కార‌ణంగా త‌రువాత జ‌రిగిన ఉద్య‌మాల‌తో ఆ ప్రాంతాన్ని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. ఇదంతా 75 ఏళ్ల సంవ‌త్స‌రాల్లో జ‌రిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్ల పెట్టుబ‌డులు పెడితే ఇవాళ మ‌న‌కు ఈ అవస్థ అన్న‌ది త‌ప్పేది. ఆ రోజు ఈ విధంగా చేయ‌క‌పోతే ఎంతో బాగుండేది. ఇదే విష‌యాన్ని  శివ రామ కృష్ణ క‌మిటీ త‌న నివేదిక లో పేర్కొంది. హైద్రాబాద్ లాంటి న‌గ‌రం లో పెట్టుబ‌డులు పెట్టిన విధంగా మ‌ళ్లీ అటువంటి ఎక్స్‌ప‌ర్మెంట్ చేయ‌వ‌ద్ద‌ని చెప్పింది.  అయినా అమ‌రావ‌తి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు పెట్టాలి. ఐదు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు కావాలి. ఇవాళ ఉద్దానంకు ఒక మంచి నీటి ప‌థ‌కం అందించే క్ర‌మంలో భాగంగా సంబంధిత ప‌నుల‌కు ప్రారంభించాం. ఇది రావాలంటే నిధులు కావాలి. డ‌బ్బుల‌న్నీ ఒకే చోట పెట్టుబ‌డి రూపంలో పెడితే మ‌న‌కు మిగిలిన ప్రాంతాల అభివృద్ధి అన్న‌ది సాధ్యం అయితే కాదు.  ఆ రోజు చంద్రబాబు అమరావతి చుట్టూ ఉన్న భూములు అన్ని ముందే కొనేసి, అక్కడ రాజధాని ఏర్పాట్లు చేశారు. అంత‌కుముందు ఒకసారి నూజివీడు అని, ఒకసారి దొనకొండ అని, అందరిని మోసాగించి అమరావతి అని ప్రకటన చేశారు. ఆఖ‌రికి అమ‌రావ‌తి పేరిట ఓ క్లోస్డ్ మోడల్ క్యాపిట‌ల్ ని డిజైన్ చేశారు చంద్రబాబు. 2019 మేం అధికారంలోకి వచ్చాక ఇవ్వని పరిశీలించాక తెలిసింది. అక్కడ ఉన్న మోసం అని..రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఉమ్మ‌డి రాజ‌ధాని హైదరాబాద్లో మ‌రో 10 ఏళ్ళు ఉండే అవకాశం ఉన్నా కూడా అమరావతి కి చంద్రబాబు వచ్చారు. చంద్రబాబు చేసిన తప్పును సీఎం జగన్ సరి దిద్దుతున్నారు, అందుకోసమే వికేంద్రీకరణ చేపట్టాం. దేశంలో 8 రాష్ట్రాలు ఇదే మోడల్ ని పాటిస్తున్నాయి. పక్కన ఉన్న ఒడిశా చూడండి కోర్ట్ కట‌క్ లో ఉంది. శాస‌న స‌భ భువ‌నేశ్వ‌ర్ లో ఉంది. ఒక‌నాడు మ‌నకు రాజ‌ధాని చెన్న‌య్ అయినప్పుడు మన తాతలు 1200 కి.మీ దూరం ప్రయాణించాల్సి వ‌చ్చేది. అటుపై రాజ‌ధాని క‌ర్నూలు అయిన‌ప్పుడు మ‌న తండ్రులు 850 కిలో మీట‌ర్లు ప్ర‌యాణించాల్సి వ‌చ్చేది. రాజ‌ధాని హైదరాబాద్ అయిన‌ప్పుడు మ‌నం 800 కి.మీ. ప్ర‌యాణించి వెళ్ళాం. కానీ మన పిల్లలకు ఈ అవ‌స్థ‌లు ఉండ‌వు. వారికి 250 కి.మీ.దూరంలోనే వైజాగ్ రాజధాని అవుతోంది.. దీనిని మనమందరం మద్దతుగా ఉండాలి. రైతుల పాదయాత్ర పేరుతో అరసవల్లి వచ్చే ప్రయత్నం చేశారు.అందులో చాలా మంది రైతులే కారు. అందుకే వాళ్లు వెన‌క్కు వెళ్లిపోయారు.

విశాఖపట్నం రాజధాని వస్తే అందరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పెద్ద పట్టణం ఇది. విశాల భావం కలిగిన ప్రజలు ఇక్క‌డ ఉన్నారు.  రోడ్ మార్గం, రైల్ మార్గం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పోర్ట్ కలిగిన పెద్ద పట్టణం విశాఖ. చంద్రబాబు వైఖరి వల్లనే ఈ రోజు మనం రాజధాని లేని రాష్ట్రంగా మిగులిపోయాం. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి అన్న‌దే మా ధ్యేయం. మీ ఊళ్లో కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ సెంటర్ చూడండి ఇది కాదా అభివృద్ధి అంటే ? ప్రతి పక్షాలకు ఇవి కనిపించవా ? సీఎం జగన్ రాజధానిని తీసుకెళ్లి ఇడుపులపాయలో పెట్టడం లేదు కదా ! ఆయన ఆలోచనలో స్వార్థం లేదు. విశాఖ కేంద్రంగా ప‌రిపాల‌న రాజ‌ధాని ఏర్పాటుకు మీ అందరి మద్దతు ఉండాలి. గ్రామాల్లో మీ గొంతులు వినిపించాలి.. అని పేర్కొన్నారు.

నియోజవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మాత్యులు  ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.
-  రూ.1.04 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలను ప్రారంభం.
- ఇచ్ఛాపురం పురపాలక సంఘంలో సమగ్ర  తాగునీటి సరఫరా ప‌నుల‌కు శ్రీ‌కారం.
- రూ.58.83 కోట్ల అంచనా  వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన.
- రూ.75 లక్షల వ్యయంతో వైఎస్సార్  విజ‌య స్థూపం ద‌గ్గ‌ర  లాండ్ స్కేప్ అభివృద్ధి ప‌నులకు శంకుస్థాపన.
- శిలాగంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, రూ. 26.50 లక్షలతో నిర్మించిన గ్రామీణ పశు వైద్య కేంద్రం, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభం.

 కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, జెడ్పి చైర్మన్ పిరియా విజయ సాయి రాజ్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, నర్తు రామరావు,  శ్యామ్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ పిలక రాజ్యలక్ష్మి, జేఏసీ సభ్యులు లజపతి రాయ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉలాల భారతి దివ్య, స్వర్ణమని, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, డాక్టర్ దానేటి శ్రీధర్, కడియాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

Back to Top