మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేద్దాం

పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం

పోరాటం చేయలేనివారు నోరుమూసుకొని కూర్చోండి..

అచ్చెన్నాయుడికి అవగాహనుందా..? అమరావతి వెనకున్న కుట్ర గురించి తెలుసా..?

మన విశాఖ– మన రాజధాని సదస్సులో మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం: పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ‘‘తరాలుగా వెనుకబాటుకు గురవుతూ వస్తున్న  ఉత్తరాంధ్రకు చేయూతనివ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయానికి అండగా నిలబడాల్సిన బాధ్యత, అవసరం మనపై ఉంది. మన ప్రాంత ప్రజల కోరికను తీర్చుకోవడానికి గొంతెత్తి వీధులోకి వచ్చి అందరినీ చైతన్యవంతులను చేద్దాం. మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేద్దాం’’ అని మంత్రి ధర్మాన పిలుపునిచ్చారు. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ‘మన విశాఖ – మన రాజధాని సదస్సు’కు మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

అమరావతి పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దాగి ఉంది. రాజధాని కోసం కేంద్ర కమిటీ అందజేసిన నివేదికను చంద్రబాబు విస్మరించారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండొచ్చని విభజన చట్టంలో చెప్పినా రెండేళ్లకే హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చాడు. ఏపీకి ఒకే రాజధాని పెట్టడం మంచిది కాదని కేంద్ర కమిటీ చెప్పింది. ఒడిశాలోని కటక్‌లో హైకోర్టు, భువనేశ్వర్‌లో పాలన రాజధాని ఉంది. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతోంది. 

విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే ఇనిస్టిట్యూషన్స్‌ వస్తాయి.. ఇన్వెస్టిమెంట్స్‌ వస్తాయి. మన పిల్లలకు ఉన్నత చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. మన ఆస్తుల విలువలతో పాటు మన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. దీని గురించి మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు నోరురావడం లేదు. మన ప్రాంతం కోసం పోరాటం చేస్తున్న మనల్ని  దద్దమ్మలు అని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు. అచ్చెన్నాయుడుకు సరైన అవగాహనుందా..? అమరావతి వెనుక ఉన్న కుట్ర గురించి తెలుసా..? చేతగాకపోతే నోరు మూసుకొని కూర్చొండి.. ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము పోటీ చేస్తాం. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మాట్లాడితే అవమానించినట్టే’’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. 
 

Back to Top