తుని: పవన్ తన నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని, గంటకో నిర్ణయం, పూటకో మాట మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తన యజమాని చంద్రబాబు మెప్పు కోసం పవన్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పెట్టిన రెండు మీటింగ్‌లు అట్టర్ ప్లాప్ అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇండిపెండెంట్‌గా చాలా మంది గెలిచారని, పార్టీ పెట్టి కూడా పవన్ గెలవలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తారో ఆయనకే క్లారిటీ లేదన్నారు. శనివారం తునిలో మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. మంత్రి దాడిశెట్టి రాజా ఏం మాట్లాడారంటే..: పొంతన లేని ప్రసంగాలు: ఎన్నో కావాలనుకుని ఏమీ కాలేకపోయిన ఒక పాపం పసివాడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లారీలో తిరుగుతూ.. రోజుకో మాట మాట్లాడుతున్నాడు. నేను ముఖ్యమంత్రిని కావాలని నిర్ణయించానని ఒకరోజు అంటాడు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని మర్నాడు మాట్లాడతాడు. ముందురోజు మాట్లాడిన వాటికి, తర్వాత మాట్లాడిన వాటికి ఎక్కడా పొంతన ఉండదు. ఒకరోజు కులాల గురించి మాట్లాడతాడు. మరో రోజు మతం గురించి. అలా నిన్న మతాల గురించి మాట్లాడాడు. సైకియాట్రిస్ట్‌కు చూపండి: మధ్యలో బాబా అవతారం ఎత్తిన పవన్ అమరావతి గురించి ప్రకటన చేశాడు. కాబట్టి ఒక్కసారి ఆ పాపం పసివాణ్ని సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తే బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే.. ఒక గంట ఒక మాదిరిగా, మరో గంట మరో మాదిరిగా ఉంటాడు. ఒక గంట ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా స్క్రిప్ట్‌లో తనకు తాను ఊహించుకుంటాడు. ఇంకో గంట భరత్ అనే నేను సినిమాలోలా సీఎంను ఊహించుకుని కల కంటాడు . కానీ ఆ కలలో జగన్‌గారు గుర్తొస్తే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. గోదావరి జిల్లాలో అభాసుపాలు: పవన్, నీకు ఒక్కదానిపై అయినా క్లారిటీ ఉందా? తూర్పు గోదావరి జిల్లాలో తిరుగుతూ, ఇప్పటికి రెండు సభలు పెడితే రెండూ ఫెయిల్ అయ్యాయి. 5 నియోజకవర్గాల చొప్పున ప్రజలను మొబిలైజ్ చేసి, సభలు పెట్టినా కనీసం 4 వేల మంది కూడా రావడం లేదు. అంటే, నియోజకవర్గానికి కనీసం 1000 మంది కూడా రావడం లేదు. మరి ఎమ్మెల్యేవి ఎలా అవుతావు? పవన్, నువ్వు అభాసుపాలవుతున్నావు. ఈ విషయం తూర్పు గోదావరి జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. నీ యజమాని నీ ప్యాకేజీ తగ్గిస్తాడు. అది చూసుకో. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే నీకు ఆ పరిస్థితి ఉంటే, రాష్ట్రంలో ఇతర చోట్ల ప్రజలు ఎలా వస్తారు? ఇరుకు సందుల్లో సభ పెట్టినా ప్రజల కనిపించడం లేదు. అందుకే నీ యజమాని నీ ప్యాకేజీ తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించుకో. సీఎం కావాలని డిసైడ్ అయ్యానని అంటావు. కానీ వాస్తవాలు నీవు తెలుసుకోవడం లేదు. ప్రజలు కదా డిసైడ్ చేసేది: రాష్ట్రంలో దాదాపు కోటి మంది పిల్లలు ఐశ్వర్యారాయ్, అనుష్క, తమన్నాల్లో ఎవర్నైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఎవరు ఒప్పుకోవాలి. వారు కదా? సీఎం కావాలని నీవు నిర్ణయించుకున్నావని చెబుతున్నావు. మరి దానికి ప్రజలు ఒప్పుకోవాలి కదా? నిన్ను కనీసం ఎమ్మెల్యేను చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. నిజం చెప్పాలంటే ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై నీకు ఇప్పటికీ క్లారిటీ లేదు. నీవు ఎక్కడ పోటీ చేయాలో నీ యజమాని చెబుతాడు. సరిగ్గా నీవు ఎక్కడ ఓడిపోతావో అక్కడ నీకు ప్లేస్ ఇస్తాడు. దాంతో నీవు మళ్లీ ఓడుతావు. దాంతో నన్ను కక్ష కట్టి ఓడించారని నిందిస్తావు. అదీ జగన్‌గారి బ్రాండ్: రాష్ట్ర ప్రజల గుండెల్లో సీఎం శ్రీ వైయస్ జగన్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మీ కుటుంబానికి నేను మంచి చేశానని నమ్మితే ఓటేయమని ఆయన అడుగుతున్నారు. అదీ జగన్‌గారి బ్రాండ్. ఆ విధంగా దేశంలో ఏ సీఎం అయినా అలా చెప్పగలడా? అలాగే ఇదే మాట నీవు, నీ యజమాని చంద్రబాబు చెప్పగలరా? మీరు ప్రజల కోసం ఏనాడైనా, ఏమైనా చేశారా? అంతేకానీ సీఎం కావాలని నిర్ణయించానని ఒకసారి, ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలో మాదిరిగా ఏదేదో ఊహించుకుంటే, ఏం లాభం లేదు. విజయవాడలో గుడులు కూలుస్తుంటే ఎక్కడ దాక్కున్నావ్?: నీకు ఒకసారి కులం, మరోసారి మతం గుర్తుకు వస్తుంది. మీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో 45 గుడులు కూల్చారు. 2014 నుంచి 2019 వరకు నీది, చంద్రబాబు, బీజేపీ బొమ్మ వేసుకున్న ప్రభుత్వం ఉంది. 45 గుడులు కూలిస్తే, కనీసం ప్రశ్నించలేదు. అప్పుడు నోటిలో ఏం పెట్టుకున్నావు?. ఎక్కడ దాక్కున్నావ్.. సదావర్తి భూములు వేల కోట్ల విలువైన భూములను గజదొంగలు, బందిపోట్ల మాదిరిగా టీడీపీ నాయకులు కొట్టేస్తే, ఒక్కమాట కూడా మాట్లాడలేదు. 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వం ఉంది. నీ ఫోటో, చంద్రబాబు, బీజేపీ ఫోటోలతో మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో ఏవైనా అమలు చేశారా? అంతే కాకుండా ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేయమని కోరావు. నాది బాధ్యత అన్నావు. కానీ ఏనాడూ ప్రశ్నించలేదు. ఆనాడే దుర్భర పరిస్థితులు: రాష్ట్రంలో ఎక్కడో ఏదో గొడవ.. అది వ్యక్తిగతంగా జరిగితే, దాన్ని ప్రభుత్వానికి పులుముతూ విమర్శలు చేస్తున్నావు. ఈ పవన్ బాబాకు హఠాత్తుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు గుర్తుకు వచ్చాయి. మరి ఇదే జిల్లాలో 2014 నుంచి 2019 వరకు శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా? కాపు ఉద్యమంలో రైలు తగలబెట్టారు. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు. దాంతో ఎంతో అశాంతి. కానీ ఆనాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకే ప్రజలు ఛీకొడుతున్నారు: అమ్మవారి పేరు పెట్టుకుని లారీ ఎక్కి ఏదేదో మాట్లాడుతున్నావు. ఆ లారీ మీద నుంచి మాకు శాపనార్థాలు పెడుతున్నావు. తప్పులు, పాపాలు నీవు చేసి, మమ్మల్ని నిందిస్తే ఏం ప్రయోజనం? అందుకే ప్రజలెవ్వరూ నమ్మడం లేదు. నిన్ను ఛీ కొడుతూ, నీ మీటింగ్‌లకు రావడం లేదు. దాన్ని కవర్ చేసుకోవడానికి, నీ యజమాని ప్యాకేజీ ఇవ్వడని మమ్మల్ని నిందిస్తూ, నీ మీటింగ్‌లకు వస్తున్న చిన్న పిల్లలను రెచ్చగొడుతున్నావు. అందుకోసం అనవసర మాటలు మాట్లాడుతున్నావు. కులాలు, మతాలు, శాంతి భద్రతలు అంటూ ఏం తోస్తే అది మాట్లాడుతున్నావు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలన, ఆ తర్వాత నాలుగేళ్ల జగన్‌గారి పాలనలో తేడాను ఒక్కసారి గమనించు. నీకే అన్నీ అర్ధం అవుతాయి. అదే నీ పని: నియోజకవర్గం ప్రజలకు మేలు చేస్తాను. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించమన్న మాటలు నీ నోట రావడం లేదు. సీఎం కావాలని నిర్ణయించాను అని చెబుతున్నావు. అసలు నిన్ను కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలిపిస్తే కదా? ప్రజల్లో ఆదరణ ఉంటే, చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులగా గెల్చారు. నీకు ఏ మాత్రం క్లారిటీ లేదు. లేచింది మొదలు.. జగన్‌గారిని తిట్టాలి. ప్రభుత్వాన్ని నిందించడం అదే నీ పని. మతం గురించి మాట్లాడుతున్నావు. వాటి వెనక పచ్చ పార్టీ: రాష్ట్రంలో ఎక్కడ, ఏ గుడిపై దాడి జరిగినా, దాని వెనక పచ్చ బ్యాచ్ ఉందని తేలింది. పచ్చ మీడియా మూలాలు, టీడీపీ నాయకుల ప్రమేయమే కనిపిస్తోంది. ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని అంటున్నావు. మర్చిపోయావా? శ్రీకాకుళంలో నంది విగ్రహం తీసేసింది ఒక ఈనాడు విలేకరి. వీడియోలు కూడా దొరికాయి. రాజమండ్రిలో వినాయకుడి విగ్రహం అపవిత్రం చేసింది టీడీపీ నాయకులు. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ ఇప్పుడు ప్రస్తావించి, రెచ్చగొట్టాలని చూస్తున్నావు. నీ మాదిరిగి ఎవరూ ఉండరు. రాష్ట్రాన్ని నడపాలనుకునే వ్యక్తికి బాధ్యత ఉండాలి. అలాగే మాట్లాడాలి. అంతే కానీ, నీ మాదిరిగా లారీ ఎక్కి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు. ఏనాడైనా ఉన్నావా?: ఇంకా అమరావతిలో ఉంటానంటున్నావు. 2014 నుంచి 2023 వరకు పట్టుమని వారం రోజులు ఎప్పుడైనా మా రాష్ట్రంలో ఉన్నావా? ఈ రాష్ట్రం చంద్రబాబుకు, నీకు ఓ వలస రాష్ట్రం. వస్తారు. దోచుకుని పోతారు. గత పదేళ్లుగా నీ ఫ్యామిలీతో.. అంటే నీ పిల్లలతో ఎప్పుడైనా మా స్టేట్ వచ్చావా? ఇక్కడ ఎప్పుడైనా కుటుంబంతో నిద్ర చేశావా?. మా రాష్ట్రాన్ని నువ్వు ఒక రిసార్ట్గానో, హోటల్ గానో భావించావు తప్ప, చంద్రబాబు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ లేరు. గత నాలుగేళ్లుగానూ లేరు. వాటి నుంచి తప్పించుకోలేరు: 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని దోచుకున్నారు. చివరకు మరుగుదొడ్ల నిధులు కూడా మాయం చేశారు. అవినీతి నుంచి మీరు తప్పించుకోలేరు. మీ దోపిడిని ప్రజలు మర్చిపోలేదు. లారీ ఎక్కాను. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను అంటే కుదరదు. నానిగారి ఇంట్లో చెప్పులు దొంగతనం చేసి లారీ ఎక్కి తిరుగుతున్న దొంగ: నా చెప్పులు పోయాయి అని అంటున్నావు. మచిలీపట్నంలో నాని గారి అభిమానులు అనుకుంటున్నారు. పేర్ని నానిగారి అనుచరులు మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారట. ఆయన ఇంట్లో చెప్పులు, అండర్వేర్లు ఎత్తుకుపోయిన దొంగ లారీ ఎక్కి, తూర్పు గోదావరి జిల్లాలో తిరుగుతున్నాడట. ఎక్కడైనా కనపడితే, చెప్పమని జిల్లా ప్రజలను కోరుతున్నాను.