బడ్జెట్‌లో ఎలాంటి కన్ఫ్యుజన్ లేదు..

తొలి బడ్జెట్‌లోనే 80 శాతం హామీలకు కేటాయింపులు

రాజధానికి తొలి బడ్జెట్‌లోనే 500 కోట్లు కేటాయించాం

ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎలాంటి కన్ఫ్యుజన్‌ లేదని ఆర్థిక మంత్రి బుగ్గ రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కంటే ఈ బడ్జెట్‌లో పన్నులు చాలా తక్కువగా ఉన్నాయని వివిరించారు. కేవలం ఐదుశాతమే వడ్డీలేని రుణాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వడ్డీలేని రుణాలకు కేటాయింపులు వచ్చే బడ్జెట్‌లో భారీ ఎత్తున ఉంటాయని బుగ్గన వెల్లడించారు.

యువజన క్రీడా సర్వీసుకు రూ. రెండువేల కోట్ల రూపాయలను కేటాయిస్తామని చెప్పి.. కేవలం రూ. 200 కోట్ల మాత్రమే గత ప్రభుత్వ ఖర్చు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. రాజధాని నిర్మాణం కొరకు పలు దేశాలు తిరిగి వచ్చిన చంద్రబాబు చివరకు సినీ దర్శకుడు రాజమౌళికి అప్పగించారని విమర్శించారు. రాజధాని నిర్మాణం కొరకు గత ఐదేళ్లలో రూ. 1700 ​కోట్లు ఖర్చు చేస్తే.. అందులో సగానికి పైగా కేంద్రమే ఇచ్చిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 277 కోట్లు మాత్రమే కేటాయించిందని వెల్లడించారు.

సభలో బుగ్గన మాట్లాడుతూ.. ‘‘రాజధాని నిర్మాణం కొరకు తొలి బడ్జెట్‌లోనే రూ. 500 కోట్లు కేటాయించాం. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాల్లో సరైన వసతులు కూడా లేవు. చిన్న చినుక పడినా భవనాల్లోకి వర్షం నీరు వస్తోంది. అమ్మబడి పథకానికిరూ. 6556 కోట్లు కేటాయించాం. ప్రతిపక్షం దానిపైన కూడా విమర్శలు చేస్తోంది. బడ్జెట్‌ను పూర్తిగా చదివితే మా ప్రాధాన్యతలు అర్థమవుతాయి. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, పారిశ్రామికరంగం, సాగునీరు, వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశాం. తొలి బడ్జెట్‌లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 80 శాతం హామీలకు కేటాయింపులు చేశాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఐదేళ్లలో టీడీపీ రూ.96 కోట్లు కేటాయిస్తే.. తాము తొలి బడ్జెట్‌లోనే రూ. 500 కోట్లు కేటాయించాం. 

Back to Top