ప్రజాస్వామ్యంలో బ్లాక్‌ డే కంటే ఘోరమైన రోజు

ఏపీ చట్టసభల్లో ఇది చాలా బాధతో కూడిన రోజు  

చట్ట సభలపై గౌరవం లేకుండా టీడీపీ వ్యవహరించింది

చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు మండలి గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను ప్రభావితం చేశారు

రూల్‌ 71ని అడ్డుపెట్టుకొని టీడీపీ డ్రామాలు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను టీడీపీ అడ్డుకుంది

13 జిల్లాల సమాన అభివృద్ధే మా తాపత్రయం

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ చట్టసభల్లో ఈ రోజు చాలా బాధాకరమైనదని ఆర్థిక  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును సెలెక్షన్‌ కమిటీకి పంపడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చైర్మన్‌ టీడీపీకి చెందిన సభ్యుడు కావడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లుగా చేసినట్లు ఉందన్నారు. చంద్రబాబు చైర్మన్‌ను ప్రభావితం చేయడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మంత్రులతో కలిసి మాట్లాడారు. 
ఈ రోజు ఏపీ చట్టసభల్లో చాలా బాధతో కూడిన రోజు..బ్లాక్‌ డే కంటే కూడా ఎక్కువ పదాన్ని వాడాలి. టీడీపీ పార్టీ ఏమాత్రం కూడా చట్టానికి గౌరవం లేకుండా ఆశ్చర్యకరమైన పరిస్థితిలో మండలి చైర్మన్‌కు ఎదురుగా గ్యాలరీలో కూర్చోని చాలా పచ్చిగా ఇన్ఫ్‌ప్లూయన్స్‌ చేస్తూ నిర్ణయం తీసుకునేలా వ్యవహరించారు. ఈ సమావేశాలు ప్రత్యేకమైనవి. వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రెండు బిల్లులు తెచ్చింది. 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చేసేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేశాం. వంద సంవత్సరాల చరిత్ర తెలుసుకొని, అన్ని కమిటీలను అధ్యాయనం చేసి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు చట్టం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేశారు. ఈ బిల్లును మండలికి పంపిస్తే ..ప్రతి స్టేజీ నుంచి కూడా టీడీపీ విస్మరిస్తూ వ్యవహరించింది. అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడు బీఏసీలో ఈ బిల్లుపై స్పష్టంగా చర్చించిన తరువాత కూడా రూల్‌ 71 తీసుకువచ్చి..దాన్ని అడ్డం పెట్టి, బిల్లులు ప్రవేశపెట్టేందుకు ఓటు ద్వారా ఎన్నుకోబడిన శాసన సభలో 90 శాతం మెజారిటీతో ఆమోదం తెలిపిన బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ రూల్‌ 71 ఏ రాష్ట్రంలో లేదు..ఎక్కడా కనిపించలేదు. కేవలం ఇక్కడే ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బిల్లులకు ప్రాధాన్యత ఉండాలని తెలిసీ కూడా బాధ్యతాయుత స్థానంలో ఉన్న చైర్మన్‌ ఒప్పుకున్నా కూడా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. చివరకు టీడీపీ సాధించింది ఏమీ లేదు. బిల్లును పాస్‌, లేదా రిజెక్ట్‌ చేయాల్సి ఉంది. బిల్లును ప్రవేశపెట్టే సమయంలోనే సెలెక్ట్‌ కమిటీకి పంపించాలంటే ఒక మోషన్‌ పెట్టాలి. మొదట ఇది చేయకుండా చివర్లో మోషన్‌ బిల్లు పెడుతున్నట్లు తాజా డేట్‌ వేసి సెలెక్ట్‌ కమిటీకి బిల్లులు పంపించాలని కుట్రలు చేశారు. బిల్లును శాసన సభకు రాకుండా అడ్డుపడ్డారు. రూల్స్‌ను విస్మరిస్తూ చివరకు చైర్మన్‌ చెప్పిందేంటంటే..ఇదంతా నాదే తప్పు..అయినా కూడా విచక్షణాధికారంతో సెలెక్షన్‌ కమిటీకి పంపిస్తున్నానని చెప్పారు. 71వ రూల్‌ వాడి, బిల్లులకు అడ్డుపడి పచ్చిగా పార్టీకి చైర్మన్‌ లొంగిపోతే ప్రజల పరిస్థితి ఏంటి? . కేవలం టీడీపీకి చెందిన వాడిని కాబట్టి మా నాయకుడు చెప్పినట్లు చేస్తున్నానని చైర్మన్‌ చెప్పినట్లుగా ఉంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు  ఇలా వ్యవహరించడం దుర్మార్గం. చట్టసభలు ఇలా చేయడం మొదలు పెడితే చట్టాలు ఎలా చేస్తాం. ఇది చాలా అన్యాయం..దుర్మార్గం. 13 జిల్లాల అభివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో ఓ నిర్ణయం తీసుకుంటే..ఆ నిర్ణయం నచ్చలేదని చెప్పవచ్చు కానీ ఇలా కుట్రపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమైన ఆలోచన. గ్యాలరీలో చంద్రబాబు కూర్చొని చైర్మన్‌గా కూర్చున్న వ్యక్తిని ప్రభావితం చేశారు. ఇది చాలా దురదృష్టం.

Back to Top