ఆ అధికారులే సస్పెండైతే వైఫల్యం ఎవరిది..?

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 

పలనాడులో దాడులపై ‘ఈసీ’ పూర్తి విచారణ జరిపించాలి

వెబ్‌కాస్టింగ్‌ల బహిర్గతంపై ఎన్నికల కమిషన్‌ పక్షపాతధోరణి తగదు

పేదోడి సంక్షేమాన్ని కూలదోసేందుకే చంద్రబాబు లేఖలు మీద లేఖలు రాస్తున్నాడు

ఐదేళ్ల పరిపాలన నచ్చితేనే ఆశీర్వదించమన్న దమ్మున్న నేత జగన్‌గారు

ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారనే ఫ్రస్టేషన్‌తో చంద్రబాబు దాడుల కుట్రకు బరితెగించాడు

ఎవరెన్ని కుట్రలు చేసినా 175కి 175 స్థానాలూ వైఎస్‌ఆర్‌సీపీవే..

మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

విజ‌య‌న‌గ‌రం: ఎన్నికల కమిషన్‌  నియమించిన అధికారులే సస్పెండైతే వైఫల్యం ఎవరిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్ర‌శ్నించారు. వెబ్‌కాస్టింగ్‌ల బహిర్గతంపై ఎన్నికల కమిషన్‌ పక్షపాతధోరణి తగదన్నారు. విజయనగరంలో మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

జూన్‌ 9 విశాఖలో జగన్‌ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంః
మేం ఎన్నికల మేనిఫెస్టోను ఒక పవిత్రగ్రంథంలా చూసుకుంటామనేది ప్రజలందరికీ తెలుసు. గడచిన ఐదేళ్ల కాలంలో వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో హామీల్ని ఏ విధంగా అమలు చేశామనేది.. రాబోయే ఐదేళ్లకూ మా పనితీరు ఎలా ఉంటుందనేది ప్రజలకు ఇప్పటికే అర్ధమైంది. విద్యావైద్యం రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చి.. ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పులు తెచ్చామనేది కూడా వారు కళ్లారా చూస్తున్నారు. కాబట్టే.. మా అధినేత జగన్‌ గారు కోరినట్టు మీ కుటుంబంలో మంచి జరిగితేనే మరోమారు మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమన్నారు. ఆమేరకే, ప్రజలంతా నిన్నటి ఎన్నికల్లో తమ విలువైన ఓటు ద్వారా వారి ఆశీస్సులను వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా అందించారు. జూన్‌ 4 ఫలితాల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయ ప్రభంజనంతో జగన్‌ గారు మళ్లీ ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 

విజయనగరంలో 9 స్థానాలనూ కైవసం చేసుకుంటాంః
విజయనగరం జిల్లాలోని 9 స్థానాలకు తొమ్మిందింటినీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంటోంది. గడచిన ఐదేళ్లల్లో విజయనగరం ప్రజల అవసరాలన్నీ తీర్చాం. దళారులు, మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలందజేతలో గానీ.. విద్యావైద్యంలోనూ మా ప్రభుత్వ పూర్తి పారదర్శకంగా వ్యవహరించింది. అదే నమ్మకంతో మేం తొమ్మిందింటికి తొమ్మిది స్థానాలను గెలుస్తామనే ధృఢమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అనుకున్నదాని కంటే ఒకట్రెండు శాతం అధికంగా ప్రజలు ఎన్నికల్లో పాల్గొన్నారు. జగన్‌ గారి పట్ల, మా అభ్యర్థుల పట్ల ఎంతో నమ్మకం ఉంచారు. సానుకూల ఓట్లతో మమ్మల్ని ఆశీర్వదించారు. విజయనగరం ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

పేదవాడి సంక్షేమాన్ని కూలదోయడం చంద్రబాబు నైజంః
చంద్రబాబు ఈ రాష్ట్రంలోని ప్రజలపై కక్షసాధింపు ధోరణితో ఉన్నాడు. ఆయన పేదవాడికి గానీ.. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమం ఇవ్వరాదనే నైజంతో బతుకుతుంటాడు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతీ నెలా ఒకటో తేదీనే ఇంటి దగ్గరకే వెళ్లి పింఛన్‌ ఇస్తుంటే.. అలా ఇవ్వొద్దని లేఖ రాశాడు. దాని కారణంగా రాష్ట్రంలో 34 మంది వృద్ధుల చావులకు కారకుడిగా మిగిలాడు. అదేవిధంగా ఆసరా, రైతుభరోసా, చేయూత పథకాల కింద ఆడబిడ్డలకు, రైతులకు పంటపెట్టుబడి ఇవ్వాలంటే.. వాటినీ ఇవ్వడానికి వీల్లేదంటూ లేఖలు రాసి అడ్డుకున్నాడు. ఆయన మనసులో మాట పేరిట రాసిన పుస్తకంలోనే వ్యవసాయం దండగమారిదని.. పేదలను సంక్షేమానికి దూరంగా ఉంచినప్పుడే ప్రభుత్వం విలువ తెలుస్తోందన్న ప్రబుద్ధుడు చంద్రబాబు.   

బురదజల్లి బూతద్దంలో చూపే వ్యసనంలో బాబుః
చంద్రబాబు అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం లేనప్పుడు పనిగట్టుకుని అధికార పార్టీ పైనా, ప్రభుత్వం మీద బురదజల్లడం వాటినీ మరలా బూతద్దంలో చూపెట్టి విషప్రచారం చేయడం ఆయనొక వ్యసనం గా మారింది. అందులో భాగంగా ఉన్నవి లేనివి కల్పించి ఎన్నికల సంఘానికి టీడీపీ తరఫున రోజుకో లేఖ రాస్తున్నారు. 

పక్షపాత ధోరణితో ఎన్నికల సంఘంః
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ దాడులు, అల్లర్లకు ప్రధాన కారకుడు చంద్రబాబే అనేది నూటికి నూరుపాళ్ళూ వాస్తవం. వైజాగ్‌లో ఒక సంఘటన జరిగిందని పచ్చమీడియాలో అదే పనిగా చూపెడుతున్నారు. అసలు, ఆ ఘటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధంలేదు. పలనాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాలలో చోటుచేసుకున్న గొడవలకు కారణం టీడీపీ నేతలేననేది బాధితులు చెబుతున్నారు. పలనాడు మొత్తంలో 9 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేస్తే ఈసీ మాత్రం ఒక వెబ్‌కాస్టింగ్‌ వీడియోనే లీక్‌ చేయడం.. అనుమానాలకు తావిస్తుంది. మరి, మిగతా వీడియోలను ఎన్నికల యంత్రాంగం ఎక్కడ దాచారు..? వీటి గురించి పోలింగ్‌ రోజు సాయంత్రానికే ఎన్నికల కమిషన్‌కు ఎందుకు చెప్పలేదు.?? అంటే, ఎన్నికల కమిషన్‌ వ్యవహారశైలిలో పక్షపాతధోరణి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్‌ వెబ్‌కాస్టింగ్‌ వీడియోలన్నీ బహిర్గతం చేసి రాజకీయ పార్టీలకతీతంగా విచారణ చేయించాల్సిన బాధ్యత ఉంది. 

నియమించిన అధికారులే సస్పెండైతే భాద్యత ఈసీదేః
విచిత్రమేమంటే, ఎన్నికల కోడ్‌ రాగానే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవడం .. అప్పటికే పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేయాలని లేఖలు రాయడం అందరం చూశాం. వారు కోరిన మీదటే పాత అధికారులను మార్చి కొత్తవారిని ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. తీరా, ఎన్నికల రోజుకు ఎక్కడైతే అధికారుల్ని మార్చారో.. సరిగ్గా అక్కడే దాడులు, అల్లర్లు చోటుచేసుకున్నాయి. సిట్‌  ఎంక్వైరీలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న అధికారులంతా సస్పెండ్‌కు గురయ్యారు. ఇలా జరగడం దేశ చరిత్రలో తొలిసారిగా చెప్పుకోవాలి. అంటే, ఇంత తంతుకు కారకులెవరు..? నియమించిన వాళ్లే సస్పెండ్‌ చేశారంటే ఎన్నికల కమిషన్‌దే బాధ్యత కదా..? టీడీపీ నేతల రిగ్గింగ్‌పై మా పార్టీ నేతలు ఫిర్యాదులిచ్చినా ఎన్నికల కమిషన్‌ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం బాధాకరం. 

జూన్‌ 4 వరకూ అందరూ సంయమనం పాటించాలిః
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకుముందెన్నడూ లేని విచిత్రమైన పరిస్థితులను చూస్తున్నాం. నేను రాజకీయాల్లోకొచ్చాక చాలా ఎన్నికలు చూశాను. కానీ, ఇప్పటి ఎన్నికల్లో జరుగుతోన్న దాడులు, అల్లర్ల పరిస్థితిని నేను ఏనాడూ చూడ్లేదు. ప్రధాన పార్టీల నేతలంతా రిలాక్స్‌ మూడ్‌లో ఎవరికి వారు విదేశాలకు వెళ్లారు. కాబట్టి.. ఆయా పార్టీల కేడర్‌ కూడా ఎన్నికల ఫలితాలొచ్చేదాకా రాజకీయాల్ని పక్కనబెట్టి కాస్త సంయమనం పాటించడం మంచిది. ఇకనైనా, ఈ దాడులు, అల్లర్లు ఆపండి. సోషల్‌మీడియాలో కూడా అనవసరంగా ట్రోలింగ్‌లు పెట్టకండని అందరినీ కోరుతున్నాను. జూన్‌ 4 వరకూ అన్ని రాజకీయ పార్టీల కేడర్‌ సంయమనం పాటించి ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్‌ జరిగేలా సహకరించాలని విజ్ఞప్తిచేస్తున్నాను. 

Back to Top