విజయనగరం : ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు.. మూడు రాజధానుల బిల్లు కు గవర్నర్ ఆమోదం తెలపడం అందరూ స్వాగతిస్తున్నారని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సీఆర్‌డీఏ బిల్లు రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపడం శుభపరిణామం అని అన్నారు. మూడు రాజధానుల బిల్లు ఆమోధాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారన్నారు. గవర్నర్ నిర్ణయంతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని బొత్స స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. చివరకు ధర్మమే గెలిచింది మండలిలో టీడీపీకి సంఖ్యాబలం ఉందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని బొత్స మండిపడ్డారు. వీధి రౌడీల్లా శాసన మండలిలో బిల్లును అడ్డుకున్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా.. చివరకు ధర్మమే గెలిచిందని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి. అమరావతి కూడా రాష్ట్రంలో అంతర్భాగమే. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. రాజధాని రైతులకు తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు.