అసెంబ్లీ: శ్రీశైలం డ్యామ్ స్పిల్ వే కిందిభాగంలో ఏర్పడిన భారీ గుంతను శాశ్వతంగా పూడ్చేందుకు, శాశ్వత మరమ్మతుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి అంబటి రాంబాబు సమాధానమిచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం గుంతను పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..
‘శ్రీశైలం డ్యామ్ స్పిల్ వే కిందభాగంలో పెద్ద గుంతను గుర్తించారా అని ప్రతిపక్ష సభ్యులు అడిగారు. 1998లో ఉధృతంగా వరదలు వచ్చినప్పుడు ఏర్పడిన పెద్ద గుంత ఇది అప్పుడే గుర్తించడం జరిగింది. 2002లో ఈ గుంతను గమనించడం జరిగింది. 2002–04 వరకు ఈ గోతిని పూడ్చేందుకు 15 కోట్ల రూపాయలు తాత్కాలిక మరమ్మతుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. 2009–18 ఈ గోతిని శాశ్వతంగా పూడ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ తరువాత 2018లో 5 కోట్ల రూపాయలతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఈ విధంగా గుంతను శాశ్వతంగా పూడ్చేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. 2019లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు గోతిని పూర్తిగా పూడ్చేందుకు చర్యలు చేపట్టాం. అందులో భాగంగా రూ.45 కోట్లతో కుడివైపు రక్షణగోడ, రోడ్డు నిర్మాణం కోసం రూ.55 కోట్లతో మరమ్మతు పనులు, గోతి శాశ్వత పూడ్చివేతకు రూ.722.5 కోట్లను అంచనాలు రూపొందించి డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ ముందు ఉంచాం.
జనవరి 2022లో డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ ప్రాజెక్టును సందర్శించి రూ.45 కోట్లతో కుడివైపున రక్షణ గోడ, రోడ్డు నిర్మాణం, రూ.55 కోట్లతో ఎప్రాన్ మరమ్మతు పనులను రూపొందించిన అంచనాల డిజైన్లు, డ్రాయింగ్‌లు చీఫ్ ఇంజినీర్ సెంట్రల్ ఆర్గనైజేషన్ వారి ఆమోదం పొందిన తరువాత సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా డ్యామ్ రీహ్యాబ్లిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు వారికి నిధుల కోసం పంపుటకు అంగీకరించడం జరిగింది. అందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పంజ్‌పూల్ శాశ్వత మరమ్మతుల కోసం ఉద్దేశించిన రూ.722.5 కోట్లకు రూపొందించిన అంచనాల విషయమై పరిశీలన కోసం సమగ్ర పరిశోధన చేయమని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ ఆదేశించింది. అందుకోసం మోడలింగ్ జియో టెక్నాలజీ, ఎసెస్‌మెంట్, న్యూమరికల్ సిస్టమ్స్ చేసి కొత్తగా అధ్యయనం చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. అందుకు అనుగుణంగా మోడలింగ్ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ వారు పూణే వారిని జియో టెక్నాలజీ అసిస్టెంట్ కోసం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ బెంగళూరు కొరకు సర్వే ఆఫ్ ఇండియావారిని సంప్రదించడం జరిగింది. వారి వద్ద నుంచి వచ్చిన పరిశోధన ఫలితాల ప్రకారం డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ సలహా మేరకు పంజ్‌పూల్ శాశ్వత మరమ్మతుల కోసం కావాల్సిన అంచనాలను రూపొందించి తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది'.