ఫైబర్‌నెట్‌ కేసు మూసివేత చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట

వైయ‌స్ఆర్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీసీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ విభాగం (వైయ‌స్ఆర్‌టీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి.

ఇప్పటికే అసైన్డ్‌ భూములు, మద్యం స్కామ్‌ కేసుల క్లోజ్‌

తాజాగా ఫైబర్‌నెట్‌ కేసు క్లోజ్‌ చేయించుకున్న చంద్రబాబు

ఇది సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం

ఇంతకు మించిన దారుణ హేయం మరొకటి ఉండదు

పి.గౌతమ్‌రెడ్డి స్పష్టీకరణ

ఏసీబీ కోర్టులో నా ప్రొటెస్ట్‌ పిటిషన్‌ తిరస్కరణ

దీనిపై హైకోర్టును ఆశ్రయించబోతున్నాను

పి.గౌతమ్‌రెడ్డి వెల్లడి

ఫైబర్‌నెట్‌ ఫైల్స్‌పై చంద్రబాబు స్వయంగా సంతకాలు

బ్లాక్‌లిస్ట్‌ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారా? లేదా?

వేమూరి హరిప్రసాద్‌ను డైరెక్టర్‌గా నియమించారా? లేదా?

ప్రెస్‌మీట్‌లో చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన గౌతమ్‌రెడ్డి 

తాడేపల్లి: ఫైబర్‌నెట్‌ కేసు మూసివేత చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైయ‌స్ఆర్‌ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికే అసైన్డ్‌ భూములు, మద్యం స్కామ్‌ కేసుల క్లోజ్‌ చేయించుకున్న సీఎం చంద్రబాబు తాజాగా, ఫైబర్‌నెట్‌ కేసునూ అదే బాట పట్టించారని ఆయన ఆక్షేపించారు. ఇది తీవ్ర అధికార దుర్వినియోగమని, ఇంతకు మించిన దారుణ హేయం మరొకటి ఉండదని తేల్చి చెప్పారు. 
    చంద్రబాబుపై నమోదైన ఫైబర్‌నెట్‌ స్కామ్‌ కేసు క్లోజ్‌ చేయొద్దంటూ తాను ఏసీబీ కోర్టులో వేసిన ప్రొటెస్ట్‌ పిటిషన్‌ తిరస్కరణ గురైందన్న గౌతమ్‌రెడ్డి, దానిపై హైకోర్టును ఆశ్రయించబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పని చేసే సీఐడీని తన అధీనంలోకి తీసుకున్న చంద్రబాబు, తనపై నమోదైన కేసుల్లో దర్యాప్తు ద్వారా సేకరించిన కీలక సాక్ష్యాధారాలన్నింటినీ మూలన పడేశారని గుర్తు చేశారు. అధికారులపై ఒత్తిడి తెస్తున్న చంద్రబాబు, ఆయనపై నమోదైన కేసుల్లో ఒక్కోటి క్లోజ్‌ చేయించుకుంటున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పి.గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రెస్‌మీట్‌లో పి.గౌతంరెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

నిస్సిగ్గుగా కేసుల మూసివేతల పర్వం:
    పలు కేసుల్లో బెయిల్‌పై ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే తనపై ఉన్న కేసులన్నీఒక్కొక్కటిగా క్లోజ్‌ చేయించుకున్నాడు. ఏపీ ఫైబర్‌నెట్‌ స్కామ్‌లో స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నా, వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా, న్యాయస్థానాలపై గౌరవం లేకుండా కేసులను క్లోజ్‌ చేసుకుంటున్నాడు. సీఐడీ వ్యవస్థలో కొందరు అధికారులను బెదిరించి తనపై ఉన్న కేసులను మూసివేయించుకున్నాడు.

ఫైబర్‌నెట్‌ స్కామ్‌లో ప్రత్యక్ష ప్రమేయం:
    ఏపీ ఫైబర్‌నెట్‌ స్కామ్‌లో సీఎం చంద్రబాబు పాత్ర డైరెక్ట్‌గా ఉంది. ఆయనే కొన్ని ఫైల్స్‌పై స్వయంగాసంతకాలు చేశారు. ఆయనే టెండర్లు పిలిపించారు. వేమూరి హరిప్రసాద్‌ను ముందు పెట్టి ఆయనపై, ఏడాది పాటు ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేయించాడు. టెండర్లకు ముందు రోజే అతన్ని ఫైబర్‌నెట్‌ డైరెక్టర్‌గా నియమించారు. టెరాసాప్ట్‌ కంపెనీకి ఎండీగా ఉన్న వేమూరి హరిప్రసాద్‌ను రాజీనామా చేయించి, ఆ కంపెనీకే మొత్తం టెండర్లు ఇచ్చేలా చంద్రబాబు ప్లాన్‌ చేశారు. వందల కోట్లు కైంకర్యం చేసేందుకు చంద్రబాబు తన మనిషిని ఆ ఛైర్‌లో కూర్చోబెట్టాడు. చివరకు క్యాబినెట్‌ అనుమతి కూడా లేకుండా నేరుగా ఆ ఫైల్‌పై చంద్రబాబు స్వయంగా సంతకం చేశారు. నిజం చెప్పాలంటే టెండర్లు ఓపెన్‌ చేయకుండానే టెరాసాప్ట్‌కు కట్టబెట్టారు. ఇది నియమాలకు పూర్తిగా విరుద్దం. ఇన్ని పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ, ఏసీబీ కోర్టు ఫైబర్‌నెట్‌ కేసును క్లోజ్‌ చేసింది. ఆ కోర్టులో నేను వేసిన ప్రొటెస్ట్‌ పిటిషన్‌ను జడ్జిగారు తిరస్కరించారు. దానిపై హైకోర్టుకు వెళ్తున్నాం.

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు బాబూ?:
    చంద్రబాబుగారు, ఫైబర్‌నెట్‌ టెండర్లకు సంబంధించిన ఫైల్‌పై మీరు సంతకం పెట్టారా? లేదా? ఈ ప్రాజెక్టును డైరెక్ట్‌గా ఒక వ్యక్తికి కట్టబెట్టేందుకు ప్రయత్నించారా? లేదా? ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారా లేదా? వేమూరి హరిప్రసాద్‌పై బాంబే కోర్టులో కేసులు ఉన్నాయి. అయినా కూడా అతన్ని డైరెక్టర్‌గా మీరు నియమించారు. అతని సస్పెన్షన్‌ ఆర్డర్‌ తీసేయమని కింది అధికారులపై ఒత్తిడి చేశారా? లేదా? నాసిరకం వస్తువులు గుర్తించారా? లేదా? వేమూరి సంస్థకే టెండర్లు ఇచ్చింది వాస్తవం కాదా?.
    అసలు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టెరాసాప్ట్‌ కంపెనీకి ఎలా టెండర్లు ఇస్తారు? నెల రోజుల తర్వాత పవనదేవి అనే మహిళ ద్వారా.. వేమూరి హరిప్రసాద్‌ ఆ సంస్థ డైరెక్టర్‌ కాదన్న స్టేట్‌మెంట్‌ ఇప్పించారు. కానీ ఆయనే ఆ సంస్థకు నిజమైన డైరెక్టర్‌. ఆ సంస్థకే ఫైబర్‌నెట్‌ టెండర్లు దక్కాయి.

ఎలాంటి సర్వే లేకుండా టెండర్లు:
    రూ.115 కోట్లలో వీళ్లు టెండర్లు తీసుకున్నారు. టెండర్ల సమయంలో ఏ వస్తువుకు ఎంత నాణ్యత ఉంటుందో సర్వే చేస్తారు. కానీ ఇందులో ఎలాంటి సర్వే జరపకుండా టెండర్లు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీళ్లు వ్యవహరించిన తీరు గందరగోళానికి దారి తీస్తోంది. హరిప్రసాద్‌పై గతంలో శిక్షలు పడితే సీఐడీ అధికారులు పరిగణలోకి తీసుకోరా? ఈ కేసుపై గతంలో సీఐడీ అధికారులు కోర్టుకు పూర్తి నివేదికలు ఇచ్చారు కదా? వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? ఇవేవీ పట్టించుకోకుండా డైరెక్ట్‌గా కేసు క్లోజ్‌ చేయడం ఏ మాత్రం సరి కాదని పి.గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top