నెల్లూరు: నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండానే, కూటమి పార్టీలు పాండిచ్చేరికి క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టడం చూస్తుంటే, అప్పుడే వైయస్ఆర్‌సీపీ నైతికంగా విజయం సాధించేసినట్టేనని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరులో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు మాకు 41 మంది కార్పొరేటర్ల బలం ఉందని చెప్పుకుంటూనే ఐదుగురు కార్పొరేటర్లు తిరిగి వైయస్ఆర్‌సీపీకి వస్తే వణికిపోతున్నారని, పోలీసులను పంపించి కార్పొరేటర్, వారి కుమారుడ్ని అరెస్ట్ చేయించి తిరుపతి తీసుకెళ్లిపోయారని చెప్పారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే కార్పొరేటర్లను కూటమి నాయకుల ఇళ్లకు డెలివరీ చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీకార్పొరేటర్ల భార్య, పిల్లలకు ఫోన్లు చేసి బూతులు తిడుతూ, గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తున్న టీడీపీ నాయకులు... 8 నెలల మేయర్ పదవి కోసం ఇంతలా దిగజారడం సిగ్గుచేటన్నారు. రూ. 10 కోట్ల వర్కులిస్తామన్నా కార్పొరేటర్లు టీడీపీలో ఉండటానికి ఇష్టపడటం లేదని, వారికి అక్కడ గౌరవం లేదని, పైగా ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను గుర్తించి వెనక్కి వచ్చేస్తున్నారని వివరించారు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉన్నా మళ్లీ వైయస్ జగన్ గారు సీఎం కాబోతున్నారనే స్పష్టత ప్రజల్లో వచ్చిందని, దాన్ని గుర్తించారు కాబట్టే టీడీపీ నాయకుల్లో వణుకు మొదలైందని చెప్పారు. యానాదులను రాజకీయంగా ప్రోత్సహించాలని వైయస్ జగన్ గారు ఇచ్చిన పదవిని లాక్కోవడం తగదని టీడీపీ నాయకులకు హితవు పలికారు. దీంతోపాటు పల్నాడు జిల్లాలో వైయస్ఆర్‌సీపీని ఎదుర్కోలేకనే పిన్నెల్లి సోదరుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారన్న మాజీ మంత్రి, 30 ఏళ్లుగా టీడీపీలో ఉంటూ ఆధిపత్య పోరుతో వారిలోవారే చంపుకున్న కేసులో పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించారని... వీటన్నింటికీ భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాను కూటమి ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి, రౌడీయిజానికి అడ్డాగా మార్చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ● రూ. 10 కోట్ల వర్కులిస్తామని చెప్పినా టీడీపీతో ఉండటం లేదు అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో నెల్లూరు మేయర్ పదవికి పోటీ చేసే విషయంలో వైయస్ఆర్‌సీపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండానే మమ్మల్ని చూసి కూటమి ప్రభుత్వం వణికిపోతోంది. అధికారంలో ఉండి కూడా టీడీపీకి చెందిన కార్పొరేటర్లను ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ నాయకులు బెదిరిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది. నెల్లూరు కార్పొరేషన్‌లో వైయస్ఆర్‌సీపీకి కేవలం 11 మంది కార్పొరేటర్లు, టీడీపీకి 41 మంది ఉన్నారని చెప్పుకుంటూనే కార్పొరేటర్లతో క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉన్నా వైయస్ జగన్ గారు మళ్లీ సీఎం కాబోతున్నారన్న నమ్మకం ప్రజల్లో వచ్చింది. ఆ ప్రజల నమ్మకమే ఇప్పుడు టీడీపీని భయపెడుతోంది. కాబట్టే కార్పొరేటర్లను కాపాడుకోలేక క్యాంప్‌లు, కిడ్నాప్‌లు, సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క కార్పొరేటర్ స్థానం కూడా గెలుచుకోలేదు. 54కి 54 స్థానాలను వైయస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. సాంకేతికంగా ఆ పార్టీకి ఒక్క కార్పొరేటర్ కూడా లేడు. కూటమి ప్రభుత్వం వచ్చాక మా వారిలో చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కానీ కూటమి పాలన నచ్చక ఏడాదిన్నరకే కొంతమంది కార్పొరేటర్లు తిరిగి వైయస్ఆర్‌సీపీకి రావడంతో కూటమి వణికిపోయింది. రూ.10 కోట్లు వర్కులిస్తామని ఆశ పెడుతున్నా కార్పొరేటర్లు ఆ పార్టీలో ఉండకుండా వెనక్కి వచ్చేస్తున్నారు. అధికారంలో ఉండి కూడా కోట్లు ఖర్చు చేసి పాండిచ్చేరికి క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టిందంటే, పోటీ చేయకుండానే వైయస్ఆర్‌సీపీ గెలిచేసింది. ● కార్పొరేటర్లను డెలివరీ చేయడానికా పోలీసులు ఉన్నది? ఎనిమిది నెలల పదవీ కాలం మాత్రమే ఉండే మేయర్ పీఠం కోసం పోలీసులను పంపించి అర్ధరాత్రి వేళ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే నీచ స్ధాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరులో రౌడీయిజం, డ్రగ్స్, గంజాయి మాఫియా రాజ్యమేలుతుంటే వారిని అరికట్టాల్సింది పోయి కార్పొరేటర్లను డెలివరీ చేసే కార్యక్రమంలో పోలీసులున్నారంటే శాంతిభద్రతలు ఎంత దారుణంగా పతనం అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి పనికిమాలిన విషయాలల్లో తలదూరుస్తున్నారు కాబట్టే, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దేశంలోనే అట్టడుగు స్థాయికి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచిన ఏపీ పోలీస్ వ్యవస్థను, సీఎం చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి వినియోగిస్తూ పూర్తిగా నిర్వీర్యం చేసేశాడు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైయస్ జగన్ గారి సమక్షంలో పార్టీలో చేరి బయటకొచ్చిన వారిని బలవంతంగా పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అర్ధరాత్రయినా ఎక్కడికి తీసుకెళ్తున్నది చెప్పకుండా వేధించారు. అతడిపై కేసులున్నాయని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు కోర్టులో హాజరుపరచకుండా ఉదయాన్ని బలవంతంగా ఒక వీడియో రిలీజ్ చేయించారు. గురువారం మధ్యాహ్నం తాడేపల్లిలో పీఎస్‌లో సీఐ వేణుగోపాల్ రెడ్డి అరెస్ట్ చేస్తే కనీసం స్టేషన్ కి కూడా తీసుకెళ్లకుండా ఒంగోలులో నెల్లూరు పోలీసులు పట్టాభి, విజయ్ భాస్కర్ రెడ్డికి అర్ధరాత్రి 3.30 గంటలకు అప్పగించి వేధిస్తున్నట్టు కార్పొరేటర్ కొడుకు నాకు ఫోన్ చేసి చెప్పాడు. అక్కడ్నుంచి వారిని తిరుపతికి తీసుకెళ్లారు. ఈ పోలీసులిద్దరి ఫోన్ లొకేషన్ తీస్తే కిడ్నాప్ వ్యవహారం మొత్తం బయటకొస్తుంది. రౌడీలు, పోలీసులను అడ్డం పెట్టుకుని మా కార్పొరేటర్ల కుటుంబాలను వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోనే ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేశారు. వైయస్ఆర్‌సీపీ నాయకులను అక్రమ కేసులు పెట్టి వేధించడం ధ్యేయంగా పనిచేస్తున్నారు కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం లేదు. ● యానాదుల అవకాశాలను దూరం చేయొద్దు వైయస్ఆర్‌సీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో యానాది కులాన్ని వైయస్ జగన్ గారు రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్టీలు అనే మానవత్వం కూడా లేకుండా వారిని ఐదేళ్లపాటు పదవిలో కూర్చోనీయకుండా దించడానికి కుట్రలు చేస్తున్నారు. వైయస్ జగన్ గారు ఇచ్చిన రాజ్యాధికారాన్ని బలవంతంగా లాక్కోవాలని చూడటం సిగ్గుచేటు. యానాదులకు రాకరాక వచ్చిన అవకాశాన్ని బలవంతంగా లాక్కుంటూ వైయస్ఆర్‌సీపీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మంత్రి నారాయణ ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తారనుకోలేదు. 164 మంది సభ్యుల బలమున్న కూటమి నాయకులు.. నెల్లూరు వైయస్ఆర్‌సీపీకార్పొరేటర్ల భార్య, పిల్లల మీద కూడా గంజాయి కేసులు పెట్టి వేధించే దుస్థితికి దిగజారిపోవడం వైయస్ జగన్ గారు మళ్లీ రాబోతున్నారన్న భయానికి నిదర్శనం. కనీస సంస్కారం లేకుండా నెల్లూరు టీడీపీ నాయకులు ఆడవారికి ఫోన్లు చేసి తిడుతున్నారు. అవిశ్వాస తీర్మాణం ద్వారా తెలుగుదేశం నాయకులే స్వయంగా తమ కుసంస్కారాన్ని బయటపెట్టుకున్నారు. ● పల్నాడులో టీడీపీ ఉండదనే భయంతోనే పిన్నెల్లి సోదరుల అక్రమ అరెస్ట్ 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న రెండు వర్గాలు ఆధిపత్య పోరుతో దాడి చేసుకుని చంపుకుంటే.. ఆ డబుల్ మర్డర్ కేసుకి ఏమాత్రం సంబంధం లేకపోయినా వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను అక్రమంగా ఇరికించి జైలుకి పంపారు. మర్డర్ జరిగినప్పుడు స్వయంగా జిల్లా ఎస్పీనే టీడీపీలోని ఇరువర్గాలు చేసుకున్న దాడిగా నిర్ధారించారు. టీడీపీ గెజిట్ పత్రిక ఈనాడులో టీడీపీలో వర్గవిబేధాల కారణంగా జరిగిన హత్యగానే రాశారు. దాడిలో ఉపయోగించిన కారు మీద కూడా జేబీఆర్ అని టీడీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా కనిపిస్తుంది. మృతుడి అల్లుడే వైయస్ఆర్‌సీపీకి సంబంధం లేదని చెప్పిన స్టేట్‌మెంట్ కూడా ఉంది. అయినా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా రాజకీయ కక్షతో పిన్నెల్లి సోదరులను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ అక్రమ కేసుతో వారిద్దర్నీ నాలుగు నెలలుగా వేధిస్తున్నారు. పిన్నెల్లి సోదరులు బయటే ఉంటే టీడీపీకి రాజకీయంగా కష్టమని భావించి, పల్నాడులో వైయస్ఆర్‌సీపీ ఆధిపత్యాన్ని అడ్డుకోవాలనే కుట్రతోనే ఈ కేసును వాదించడానికి సిద్ధాథ్ర లూథ్రాని చంద్రబాబు రంగంలోకి దించాడు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలకు భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ రోజున ప్రతి వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రుణం తీర్చుకుంటాం. జైల్లో పెట్టినంత మాత్రాన వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదు. పిన్నెల్లి సోదరుల కుటుంబాలకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.