ఎంపీ విజయసాయిరెడ్డితో మంత్రి అంబటి భేటీ

బ్రో సినిమాపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసే అవకాశం 

ఢిల్లీ: ఎంపీ విజయసాయిరెడ్డితో ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బ్రో మూవీ లావాదేవీలపై ఆయన చర్చించారు. ఇతర ఎంపీలను కూడా మంత్రి కలవనున్నారు. బ్రో సినిమాకు  విదేశాల నుంచి నిధుల తరలింపుపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. 

 బ్రో సినిమా వ్యవహారంలో నూటికి నూరు శాతం అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని, అదో కుంభకోణమని మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. తాను చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేకపోతే సినిమా నిర్మాతగానీ పవన్‌ కళ్యాణ్‌గానీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.

వాస్తవాలు వెల్లడించేందుకు భయపడుతున్నారా? దాస్తున్నారా? అని నిలదీశారు. దాస్తున్నారంటే అందులో స్కామ్‌ దాగి ఉందనే అర్థమని స్పష్టం చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అంబటి బుధవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అమెరికాలో తన ముఠా ద్వారా వసూలు చేసిన డబ్బును నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ద్వారా పవన్‌ కళ్యాణ్‌కు ప్యాకేజీగా ఇప్పించారన్నారు.

బ్రో సినిమాకు విదేశీ పెట్టుబడులు అక్రమంగా వచ్చాయని, ఇది మనీలాండరింగ్‌ కాదా? అని అంబటి సూటిగా ప్రశ్నించారు. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత? కలెక్షన్లు ఎంత? పవన్‌ పారితోషికం ఎంత? ఆదాయ పన్నుగా కట్టింది ఎంత? అని ప్రశ్నించారు. అత్యంత నిజాయితీపరుడినని, అపర దాన కర్ణుడినని, సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తినంటూ డైలాగ్‌లు కొట్టే పవన్‌ వాస్తవాలను ఎందుకు దాస్తున్నారని నిలదీశారు.

సినిమాను సినిమాలాగే చూడాలన్న సాయి ధరమ్‌ తేజ్‌ వ్యాఖ్యలపై మంత్రి అంబటి స్పందిస్తూ అలాంటప్పుడు సినిమాలను సినిమాలుగానే తీయండి.. మధ్యలో మమ్మల్ని గోకడమెందుకు? అని చురకలంటించారు. తనపై పుంఖాను పుంఖాలుగా వెబ్‌ సిరీస్‌ తీసినా అభ్యంతరం లేదన్నారు.  

Back to Top