ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ముఖ్య‌మంత్రి కట్టుబడి ఉన్నారు

ప్ర‌తిప‌క్షాల త‌ప్పుడు ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి

ముస్లిం మైనారిటీలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవులలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారు

చంద్రబాబు ముస్లిం మైనారిటీలను చిన్నచూపు చూశారు

అక్రమ కేసులు బనాయించి ముస్లిం యువకులను వేధించారు

ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారానికి అవసరమైతే చట్టసవరణకైనా ప్ర‌భుత్వం సిద్ధం 

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ముస్లిం మతపెద్దలతో ఆత్మీయ స‌మావేశం 

పాల్గొన్న‌ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీల భద్ర‌త, సంక్షేమానికి, వారి ఉన్నతికి అనేక నిర్ణయాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌దేన‌ని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా అన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు వైయస్ఆర్ సీపీకి, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు అండగా ఉండాలని నిశ్చయించుకోవడం శుభపరిణామం అన్నారు. ముస్లిం మైనారిటీ మత పెద్దలు, ముస్లిం స్వచ్చంద సంస్థ‌లు, మైనారిటీ విభాగం జిల్లాల అధ్యక్షులతో తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ భాషా అధ్యక్షత వహించారు. ముస్లిం మైనారిటీలకు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథ‌కాలు, వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు వాటిని ప్రజలలోకి తీసుకువెళ్ల‌డం వంటి త‌దిత‌ర అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషాతోపాటు పార్టీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర‌ అధ్యక్షులు ఖాదర్ భాషా, హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ గౌస్ లాజం, శాసనమండలి సభ్యులు రుహుల్లా, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ల‌ అప్పిరెడ్డి పాల్గొన్నారు. 

డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ.. దివంగ‌త మ‌హానేత‌ వైయస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన 4శాతం రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీ కుటుంబాలలో ఏ విధంగా వెలుగులు నింపాయో నేడు వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ముస్లిం మైనారిటీలు అన్ని రంగాలలో అభివృద్ది చెేందేందుకు దోహదం చేస్తున్నాయన్నారు. అయితే ఇటీవల కాలంలో టిడిపి నేతలు, చంద్రబాబు, లోకేష్ వంటి వాళ్లు ఈ ప్రభుత్వం ముస్లింలకు ఏమీ చేయడం లేదంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని వాటిని ముస్లింలందరూ తిప్పికొట్టాలన్నారు. చంద్రబాబు హయాంలో ముస్లింలపై చేసిన అరాచకాలు ప్రతి ముస్లింను గాయపరిచాయన్నారు. వాటిని ముస్లింల ఎవ్వరూ మరిచిపోలేదన్నారు. వైయస్ జగన్ చేసిన మేలును, చంద్రబాబు ముస్లింలపై చేసిన అరాచకాలపై చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయిలలో ముస్లిం మైనారిటీలతో సదస్సులను నిర్వహించి వారిలో చైతన్యం తెస్తామని వివరించారు.

అనంత‌రం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలను ఓటు బ్యాంకుగా గతంలో రాజకీయ పార్టీలు ఉపయోగించుకునేవని అన్నారు. దివంగత మ‌హానేత‌ వైయస్ రాజశేఖరరెడ్డి, నేడు వైయస్ జగన్ ముస్లిం మైనారిటీలలో వెనకబాటుతనాన్ని రూపుమాపాలనే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా ముస్లింలకు వైయస్సార్ ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు వారి కుటుంబాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయని అన్నారు. నేడు సీఎం వైయస్ జగన్ ముస్లిం మైనారిటీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవులలోనూ, స్థానిక సంస్థ‌ల్లోనూ విశేష ప్రాధాన్యం ఇచ్చారన్నారు. నేడు అమలు జరుగుతున్న అమ్మఒడితోపాటు షాదీతోఫా, విదేశీ విద్య వంటి అనేక పధకాలు ముస్లింలలో పేదరికాన్ని పొగొట్టేవిధంగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఆ పథ‌కాలు అందుకుంటున్న ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరులు వాటిని వారి కమ్యూనిటిలో చెప్పడంతోపాటు వారిలో చైతన్యం తేవాలన్నారు. 

దేశంలో ముస్లిం మైనారిటీలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం వైయస్సార్ సీపీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రమేననేది దేశంలోని ఇతర ప్రాంతాలలోని ముస్లిం మైనారిటీలందరూ ముక్తకంఠంతో చెబుతున్నారని అన్నారు. సీఎం వైయస్ జగన్ ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారం పట్ల ఎంత కృతనిశ్చయంతో ఉన్నారంటే వారికి ప్రయోజనం కలుగుతుందంటే అవసరమైతే చట్టాలు సైతం మార్చడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. ముస్లిం మైనారిటీలు వారికి జరుగుతున్న మేలును వారి కుటుంబాలలో ప్రతి ఒక్కరికి తెలియచేయడంతోపాటు వైయస్ జగన్ పాలనలో ముస్లిం మైనారిటీలు సురక్షితంగా ఉన్నారనే విషయాన్ని కూడా చెప్పాలని కోరారు. ముస్లిం మైనారిటీల సమస్యలను పార్టీ కేంద్ర కార్యాలయానికి గాని, తన దృష్టికి గాని నేరుగా కాని తెలియచేస్తే వారి సూచనలు, సలహాలు తీసుకోవ‌డానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామ‌న్నారు.  

పలువురు ముస్లిం స్వచ్చంద సంస్థ‌ల ప్రతినిధులు మాట్లాడుతూ.. వైయస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లభించినన్ని పదవులు గతంలో మరే ప్రభుత్వంలో లభించలేదన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి వైయస్ జగన్ అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారని సదా ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు.

Back to Top