ఆజాద్ స్ఫూర్తిని కొన‌సాగిస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి వెల్ల‌డి

కేంద్ర కార్యాలయంలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వర్ధంతి కార్యక్రమం

తాడేప‌ల్లి: భారత విద్యా వ్యవస్ధను ఉన్నతంగా తీర్చిదిద్దిన స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆలోచనలు, సిద్దాంతాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళతామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.  అబుల్‌ కలాం ఆజాద్‌ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా నివాళులర్పించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆజాద్‌ చిత్రపటానికి వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేతలు పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. విద్యాశాఖా మంత్రిగా విద్యా వ్యవస్ధను ఉన్నతంగా తీర్చిదిద్దిన గొప్పవాడిగా ఆయన నిలిచారని, ఆయన బాటలోనే పయనిస్తూ, ఆయన అడుగుజాడల్లో అందరూ ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ఆజాద్‌ ఆలోచనలు, నిర్ణయాలు విద్యారంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాయి, విద్యారంగంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్కరణలు తీసుకురావడానికి గల కారణం కూడా ఆజాదేన‌ని చెప్పారు. వైయ‌స్ జగన్‌ గారి ఆలోచనలు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్దాంతాలు ఆజాద్ స్పూర్తితోనే కొనసాగుతున్నాయని గర్వంగా చెప్పగలం, రాబోయే రోజుల్లో కూడా ఇదే స్పూర్తిని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నామని ఈ సందర్భంగా ప్రసంగించిన నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, దూలం నాగేశ్వరరావు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు షేక్‌ ఆసిఫ్‌, డాక్టర్‌ మెహబూబ్‌ షేక్, మనోహర్‌ రెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, మస్తాన్‌, గౌస్‌, రవిచంద్ర, కొమ్మూరి కనకారావు, పురుషోత్తం, పలువురు నాయకులు పాల్గొన్నారు.
 

Back to Top