కొమ్మినేని శ్రీనివాసరావు కేసులో దుర్మార్గంగా వ్యవహరించారు

ఎక్కువ కాలం ఆయనను జైలులో ఉంచేందుకు కుట్రపన్నారు

పత్రికాస్వేచ్ఛను కాపాడేలా సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు 

కూటమి సర్కార్ కుట్రలకు చెక్‌ పెట్టిన న్యాయవ్యవస్థ

వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ నాయకులు జె.సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి 

తాడేపల్లి: రాష్ట్రంలో పత్రికాస్వేచ్ఛకు విఘాతం కలిగించేలా సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై కక్షపూరితంగా నమోదు చేసిన కేసులపై సుప్రీంకోర్ట్ గొప్ప తీర్పు ఇచ్చిందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ నాయకులు జె.సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సాక్షిటీవీ డిబేట్‌లో పాల్గొన్న విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలను యాజమాన్యానికి ఆపాదించడానికి కూటమి ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలను ప్రజంటేటర్ కొమ్మినేని శ్రీనివాసరావు స్పష్టంగా వారించారని తెలిపారు. అయిదేళ్ళలోపు శిక్ష పడే సెక్షన్లలో 41ఏ నోటీస్ ఇచ్చిన తరువాత అదుపులోకి తీసుకోవాల్సిన సందర్భంలో దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా డెబ్బై ఏళ్ళ వయస్సు ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలులో ఉన్న సుప్రీంకోర్ట్ ఆదేశాలు, మార్గదర్శకాలను ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు. తరువాత ఆయన అరెస్ట్, రిమాండ్ పై సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్ట్ ఈ కేసులో పత్రికాస్వేచ్ఛ, వాక్‌స్వాతంత్రం, ప్రజాస్వామ్యం ముడిపడి ఉన్నాయని, కొమ్మినేని ఎటువంటి తప్పు చేయలేదని, ఆయన కేవలం యాంకర్‌గానే ఉన్నారని, ఆయనను అరెస్ట్ చేయడం ప్రతికాస్వేచ్ఛను హరించడమేనని స్పష్టంగా కోర్ట్ తీర్పు ఇచ్చిందన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రోత్సహంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పలుచోట్ల సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం, రాళ్ళు రువ్వడం, దాడులకు పాల్పడ్డారు. అలాగే ఈ వివాదాన్ని మరింతగా పెంచేలా పలువురు తెలుగుదేశం నాయకులు, మంత్రులు తీవ్రస్థాయిలో వైయస్ జగన్, ఆయన కుటుంబసభ్యులపై దూషణలకు పాల్పడుతూ దుర్భాషలాడారని గుర్తు చేశారు. వారిపై ఫిర్యాదు చేసినా కూడా ఈ ప్రభుత్వ ఆదేశాల వల్ల పోలీసులు ఎక్కడా కేసులు రిజిస్టర్ చేయలేదన్నారు. అలాగే కొమ్మినేని శ్రీనివాసరావును ఎక్కువ కాలం జైలులో పెట్టాలనే కుట్రలో భాగంగా పోలీస్ కస్టడీ పిటీషన్ వేయడం, అలాగే హైకోర్ట్‌కు వెళ్ళకుండా సుప్రీంకోర్ట్‌కు వచ్చారంటూ వాదనలు చేశారని వెల్లడించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని భయపెట్టాలని, సాక్షి మీడియాను బెదిరించాలని కూటమి ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసిందని, అయినా కూడా న్యాయవ్యవస్థ వీరి కుట్రలకు చెక్ పెట్టిందని తెలిపారు.

Back to Top