2020కి మంగళగిరి ఎయిమ్స్ పూర్తి చేస్తాం..

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న‌కు కేంద్ర‌మంత్రి స‌మాధానం

ఢిల్లీః  కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2020 సెప్టెంబర్‌ నాటికి మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తవుతుందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే  రాజ్య సభకు తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌లోని మంగళగిరిలో ఎయిమ్స్‌ను నెలకొల్పడానికి 2015 అక్టోబర్‌ 7న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎయిమ్స్‌ నిర్మాణం కోసం మొత్తం 1618 కోట్ల రూపాయయలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కేంద్రం 385.54 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది’  అని మంత్రి చెప్పారు. ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ బ్లాక్‌, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. హాస్పిటల్‌, అకడమిక్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు 26 శాతం పూర్తయినట్లు ఆయన తెలిపారు. 2019 మార్చిలో మంగళగిరి ఎయిమ్స్‌లో ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ వైద్య సేవలు ప్రారంభమైనట్లు కూడా మంత్రి చెప్పారు. ఎయిమ్స్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు నిర్ణీత కాలవ్యవధిలోనే సాగుతున్నందున నిర్మాణ వ్యయం అంచనాలు పెరిగే అవకాశమే లేదని ఆయన తెలిపారు.

Back to Top