రాజకీయ భవిష్యత్తుపై లోకేష్‌కు దిగులు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

అమ‌రావ‌తి:  టీడీపీ నేత నారా లోకేష్‌కు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై దిగులు ప‌డుతున్నాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యత నిర్వర్తించడంలో తెలుగుదేశం ఘోరంగా విఫలమౌతోంది. పాకపక్షమైన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో ప్రజాస్వామ్య పంథాలో పోటీపడలేక పోతుంది. అధికారపక్షానికి దీటుగా ప్రజలకు మేలు చేయడంలో తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతోంది టీడీపీ. ఓ పక్క పార్టీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క ఆయన కుమారుడు నారా లోకేష్‌ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ప్రభుత్వాన్ని అర్థరహితంగా విమర్శించడం మినహా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారు. ప్రతిపక్షంగా ఉండడం టీడీపీకి కొత్తేమీ కాదు. 1989–94, 2004–2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశమే ప్రతిపక్షం. పదేళ్లు అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు సైతం తన రాజకీయ అనుభవాన్ని విస్మరించి– డైనమిక్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. తండ్రి దారిలోనే లోకేష్ కూడా పయనిస్తున్నారు. రాజకీయ అనుభవంతో పాటు పరిపాలనా అనుభవం గల తండ్రి, పలువురు సీనియర్ల అండ ఉన్నాగాని లోకేష్‌ బాబు మాట తీరు మారలేదు. ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన లోకేష్‌ తన పార్టీ కార్యకర్తలను, నేతలను క్రియాశీలకంగా ఎలా నడిపించాలో ఇంకా నేర్చుకోలేకపోవడం టీడీపీ అంతర్గత సమస్య. అయితే, ఇప్పటి వరకూ వైఎస్పార్‌ కాంగ్రెస్‌ సీఎం, మంత్రులు, చట్టసభల సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులపై అసంబద్ధమైన ఆరోపణలు, విమర్శలకు దిగే లోకేష్‌ తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అఖిలభారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను బెదిరించే ధోరణిలో ఆయన వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే ఈ రెండు తరగతులకు చెందిన అధికారులతో పాటు కొందరు పోలీసు అధికారులు జైళ్ల పోతారని పరోక్షంగా హెచ్చరించడం దారుణం. మంత్రిగా దాదాపు రెండేళ్ల అనుభవం ఉన్న ఈ ‘యువనేత’కు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ఏఏ నిబంధనలకు లోబడి ఎలా విధులు  నిర్వహిస్తారో తెలిసి ఉండాలి. కాని, అమాత్యుడిగా తన అనుభవాన్ని గాలికి వదిలేసిన టీడీపీ ‘జాతీయ ప్రధాన కార్యదర్శి’– ఆలిండియా సర్వీసు అధికారులు సహా పలువురు పోలీసు అధికారులు తమ కెరియర్‌ ను పాడుచేసుకుంటున్నారని వాపోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. ప్రభత్వ అధికారులు విధి నిర్వహణలో తప్పులు, పొరపాట్లు చేస్తే వారిని నియంత్రించే పటిష్ఠమైన పాలనా వ్యవస్థ ఏపీలో ఉంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ పరిపక్వత కనబరచని లోకేష్‌ బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తును ఇనుమడించదు సరికదా, ఆయన ప్రజల ముందు నవ్వుల పాలవుతార‌ని విజ‌య‌సాయిరెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top