విశాఖ: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని, ఏపీలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్ నవీన్ జిందాల్ ప్రకటించారు. విశాఖలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో నవీన్ జిందాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ శ్రీవేంకటేశ్వర స్వామి వారి పుణ్యభూమి. ఏపీలో పనిచేసిన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నా. ఏపీ ఇన్‌ఫ్రా బేస్, వ్యాపార అనుకూల వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ప్రోగ్రెసివ్ పాలసీ, పెట్టుబడిదారులకు అనుకూలమైన స్థలాన్ని సృష్టించే సింగిల్ విండో పాలసీని రూపొందించిన వైయస్ జగన్ ప్రభుత్వానికి జిందాల్ గ్రూప్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతకు ముందే ఏపీలో ఒక యూనిట్‌ను ప్రారంభించామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరో యూనిట్‌ను కూడా ప్రారంభించనున్నాం. 6 నెలల్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి అందించనున్నాం. కృష్ణపట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్‌ను రూ.10 వేల కోట్లతో స్థాపించబోతున్నాం. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి పైగా ఉపాధి లభించనుంది. ఈరోజు ప్రభుత్వంతో ఎంవోయూ కూడా కుదుర్చుకోనున్నాం.
ఏపీలో సమృద్ధిగా వనరులు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక జీఎస్‌డీపీ వృద్ధిని ఏపీ సాధించింది. గత నెలలో స్టీల్ ప్లాంట్‌కు సీఎం వైయస్ జగన్ భూమిపూజ చేశారు. స్టీల్ ప్లాంట్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నందుకు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత, నా సోదరుడు సజ్జన్ జిందాల్‌కు ధన్యవాదాలు. ఏపీలో మేం నిర్మించిన ప్రాజెక్టులు శ్రేష్ఠతకు మచ్చుతునక. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి , ఆలోచనలకు, దూరదృష్టికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.