తాడేపల్లి: నమ్మి ఓట్లేసిన వారిని గాలికొదిలేయడం చంద్రబాబుకు అలవాటు అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మహిళల దురదృష్టమన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహానేత వైయస్ఆర్ విగ్రహానికి పూలు సమర్పించి, నివాళులర్పించిన పార్టీ మహిళా నాయకురాళ్లు ఆయన్ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌కె రోజా ఏమన్నారంటే..: ఇది చాలా దురదృష్టకరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఏటా మార్చి 8న ప్రపంచ మహిళలందరూ గర్వంగా, గౌరవంగా జరుపుకునే పండగ. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సాధికారత అంటే దివంగత మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి, ఆ తర్వాత వైయస్ జగన్ మాత్రమే గుర్తుకు వస్తారు. మహిళలకు చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా నమ్మి గెలిపించిన ప్రతిసారి వారిని గాలికి వదిలేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. చంద్రబాబు లాంటి వారు మరలా ముఖ్యమంత్రి కావడం చాలా దురదృష్టకరం. టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళల జీవన విధానం దుర్భరంగా మారింది. ప్రభుత్వానికి పట్టడం లేదు: తనను గెలిపించిన కుప్పంలోనే ఎకరాలకు ఎకరాలు గంజాయి సాగు చేస్తుంటే చంద్రబాబుకు కనిపించడం లేదా? హోం మంత్రి సొంత జిల్లా వైజాగ్‌లో ఎకరాలుకు ఎకరాలు గంజాయి పండిస్తున్నా, ముఖ్యమంత్రి ఉన్న గుంటూరు డ్రగ్స్‌కు అడ్డాగా మారినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదు. మహిళ బాగుంటే ఈ ఇళ్లు బాగుంటుందని నమ్మి, వారి సంక్షేమం కోసం వైయస్సార్, జగన్ పాటుపడ్డారు. మహిళలంటే కనీస గౌరవం లేదు: 18–59 ఏళ్ల మధ్య ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే, అంత మందికి నెలకు రూ.1500 చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు, 9 నెలలైనా ఆ పథకం ఎందుకు చేయడం లేదు. చంద్రబాబుకు కూతురు ఉంటే ఆ విలువ తెలిసేది. ‘కోడలు మగబిడ్డను కంటే అత్త సంతోషించదా?’ అన్న చంద్రబాబుకి అసలు ఆడబిడ్డ విలువ ఏం తెలుస్తుంది?. కేవలం చంద్రబాబుకే కాకుండా, టీడీపీ నేతలకు కూడా ఆడపిల్లలంటే చులకన భావం. ప్రభుత్వానికి రెడ్ బుక్ రాజ్యంగం అమలు మీద ఉన్న శ్రద్ధ మహిళల భద్రత మీద లేదు. అది తప్ప, ఏమీ చేయడం లేదు: ఎక్కడ, ఏం జరిగినా జగన్‌గారిపై నింద వేయడం తప్ప వీళ్లు చేసిందేమీ లేదు. అదేపనిగా జగన్‌గారిని నిందిస్తున్న కూటమి నేతలకు పాలన చేతగాక పోతే, పథకాలు అమలు చేయలేకపోతే రాజీనామా చేసి దిగి పోవాలి. ఆడబిడ్డలందరూ అప్రమత్తం కావాలి. జగన్‌గారిపై టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న విషప్రచారం తిప్పికొట్టాలి. దయనీయంగా మహిళల పరిస్థితి: వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళల పరిస్ధితి చాలా దారుణంగా మారింది. నాడు జగన్‌గారు, మహిళల సంక్షేమానికి పెద్దపీట వస్తే, ఇప్పుడు కూటమి పాలనలో వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. మహిళా సంక్షేమాన్ని తుంగలో తొక్కి వేయడంతో, బాధ పడుతున్న మహిళలు, కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశామా? అని ఆవేదన చెందుతున్నారు. వైయస్ జగన్‌గారి కంటే ఇంకా ఎక్కువ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా నిలువునా మోసం చేశారు. ఆడబిడ్డ నిధి. మరో దగా: వైయస్ జగన్‌గారి హయాంలో ప్రతి పథకం మహిళల పేరు మీదే ఉండేది. వారి భద్రత కోసం దిశ వ్యవస్ధ, దిశా యాప్ సమర్థంగా పని చేశాయి. కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంతో మహిళల భద్రత గాల్లో దీపంలా తయారైంది. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు, అమ్మఒడి, ఆసరా, చేయూత, 32 లక్షల ఇళ్ల పట్టాలు, ఇళ్లు ఏ పథకమైనా మహిళల పేరు మీదే కల్పించారు. చట్టసభల్లోనూ అంతే ప్రాతనిధ్యం కల్పించారన్నారు. ఎన్నికల్లో కూటమి మాయమాటలు నమ్మి ఓటేస్తే ప్రజలను దారుణంగా మోసం చేశారు. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 19 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి, రెండు బడ్జెట్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇదే విషయాన్ని మండలి సాక్షిగా నిలదీశామన్నారు. అదే విధంగా ఎన్నికల్లో ఉచిత బస్సు కోసం విపరీతంగా ప్రచారం చేసిన కూటమి నేతలు, తీరా మొన్న శాసన మండలిలో ఫ్రీ బస్సు కేవలం జిల్లాకే పరిమితం అని చెప్పి మోసం చేశారు. ఇది నిలువునా మహిళలను మోసం చేయడమే. రాష్ట్రంలో పథకాల అమలు లేదు కానీ, గంజాయి, మద్యం, డ్రగ్స్ విలయ తాండవం చేస్తున్నాయి. మద్యం ఏరులై పారుతుంది. లక్షలాది రూపాయలకు బెల్టు షాపులు వేలం వేస్తూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారు. అందుకే రాష్ట్రం బాగు పడాలన్నా, మహిళలు సురక్షితంగా ఉండాలన్నీ, మళ్లీ వైయస్ జగన్‌గారు సీఎం కావాలి. అది సాకారమయ్యేలా ఈరోజు నుంచి ప్రతి మహిళ నడుం బిగించాలి. గుంటూరు తూర్పు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త షేక్ నూర్ ఫాతిమా, గంగాధర నెల్లూరు సమన్వయకర్త కృపాజ్యోతి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రజనితో పాటు, పలువులు మహిళా నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.