దిశ చట్టం పర్యవేక్షణకు త్వరలో ఐపీఎస్‌ అధికారి

హోంమంత్రి మేకతోటి సుచరిత 
 

తాడేపల్లి: దిశ చట్టం పర్యవేక్షణకు త్వరలో ఒక ఐపీఎస్‌ అధికారిని నియమించడం జరుగుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. దిశ చట్టంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో ఒక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుపై చర్చించామన్నారు. ఒక్కో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు రూ.2 కోట్లు అవసరం అవుతాయని చెప్పడంతో వారంలో నిధులు సమకూర్చి కోర్టులు వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారన్నారు. అదే విధంగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులకు సంబంధించి 13 మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాలని సూచించారన్నారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఒకటే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఉండడంతో ఇంకా అదనంగా మూడు ల్యాబ్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దానికి సంబంధించి రూ.23 కోట్ల నిధులు కూడా మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌లో పనిచేసేందుకు 176 మంది సిబ్బంది అవసరమని, దానికి కూడా జనవరి 1వ తేదీన నోటిఫికేషన్‌ ఇవ్వబోతున్నామన్నారు. అదే విధంగా ఒక డీఎస్పీ స్థాయి అధికారి, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ను కూడా నియమించుకొని మహిళా పోలీస్‌ స్టేషన్లను బలోపేతం చేసి  సమస్యలలో స్టేషన్‌కు వచ్చే మహిళలకు సత్వర న్యాయం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. 
 

Back to Top