గుంటూరు: తల్లి గర్భంలో ఎంత రక్షణ ఉంటుందో.. అలాంటి రక్షణ ఏపీలో ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం ఆమె నరసరావుపేటలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యామూల్ ఆనంద్, రేంజి ఐజీ వినీత్ బ్రిజిలాల్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ ఘటన దేశంలో సంచలనం కలిగించిందని.. ఇలాంటి సంఘటనలు ఏపీలో జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రాష్ట్ర్రంలో మొత్తం 18 ‘దిశ’ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘దిశ’ ఎస్ ఓ ఎస్ యాప్ ను కూడా రూపొందించామని చెప్పారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారని.. కానీ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు పోలీస్ శాఖపై నిందలు వేస్తున్నారని హోంమంత్రి సుచరిత విమర్శించారు.