వనజాక్షి, రిషితేశ్వరి ఘటనల్లో సీబీఐ గుర్తుకురాలేదా..?

చంద్రబాబుకు హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రశ్న

గుంటూరు: వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలో అవసరం లేని సీబీఐ ఇప్పుడు అవసరం వచ్చిందా..? పుష్కరాల తొక్కిసలాటలో జనం చనిపోతే సీబీఐ గుర్తుకురాలేదా..? అని చంద్రబాబును హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రశ్నించారు. గుంటూరులో హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతివ్వటానికి వీల్లేదంటూ చంద్రబాబు గతంలో జీవోలు ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు అవసరం లేని సీబీఐ ఇప్పుడు కావాలంటున్నారన్నారు. గతంలో ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలన్నారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఏడాదిగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందని హోంమంత్రి సుచరిత అన్నారు. ఏడాదికాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయగలిగామన్నారు. చంద్రబాబు వెళ్తూ వెళ్తూ.. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి వెళ్లాడని, రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అదే విధంగా మహిళా రక్షణ కోసం దిశ చట్టం ఏర్పాటుతో పాటు పోలీసులకు వీక్లి ఆఫ్‌లు తీసుకొచ్చామని, పాఠశాల విద్యలో సమూల మార్పులు తెచ్చామన్నారు. త్వరలో 27 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నామన్నారు. 
 

Back to Top