విశాఖపట్నం: ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చంద్రబాబు మార్క్ వంచన, మోసానికి ప్రతిబింబంగా ఉందని, ప్రభుత్వంపై ఆధారపడిన పేద బలహీనవర్గాల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ బడ్జెట్ కనిపించడం లేదని విశాఖ జిల్లా వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ఏపీ అంటే అమరావతే అన్నట్టు బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించి, రాష్ట్రంలో వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీల్లోని ఫ్రీబస్, ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలను పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం ద్వారా, వాటి అమలుపైనా అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు 9 నెలల పాలనపై ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైందని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పారు. శనివారం విశాఖలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నమ్మి కూటమికి ఓటేసిన ప్రజలను చంద్రబాబు మరోసారి వంచించారు. సంక్షేమ పథకాలకు అరకొర కేటాయింపులతో పాటు కొన్ని పథకాలను పూర్తిగా విస్మరించడంతో ద్వారా వంచనకు, మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని నిరూపించుకున్నారు. ప్రభుత్వంపై ఆధారపడిన పేదలను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వెనకబడిన వర్గాలను ఆదుకుని, వారి జీవన ప్రమాణాలు పెంచేలా ఈ బడ్జెట్ కనిపించడం లేదు. అధికారంలోకి రావడం కోసం సూపర్ సిక్స్ వాడుకున్నారే కానీ, అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ ప్రభుత్వం మీద ప్రజలకు కూడా నమ్మకం పోయింది. పథకాలపై చిత్తశుద్ధి లేదు: మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి, ఫ్రీ బస్, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకాలను పూర్తిగా ఎత్తేశారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. తల్లికి వందనం పథకానికి అరకొర నిధులు కేటాయించారు. 80 లక్షల మంది పిల్లలకు రూ.15 వేలు చొప్పున ఇవ్వడానికి రూ.12,450 కోట్లు కావాల్సి ఉంటే, బడ్జెట్‌లో చూపించింది రూ.9,400 కోట్లు మాత్రమే. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేది కాకుండా, రూ.20 వేల చొప్పున ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాట మార్చారు. పీఎం కిసాన్ పథకానికి ముడి పెట్టి ఇస్తామని చెప్పి మళ్లీ మోసగించారు. రూ.10 వేలకూ పైగా కోట్లు అవసరమైతే కేవలం రూ. 6300 కోట్లు మాత్రమే కేటాయించడం ద్వారా పథకం అమలుపై రైతుల్లో సందేహాలు కలుగుతున్నాయి. నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగ యువతను, ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ఉద్యోగులను.. ఇలా అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వంచించింది. వాస్తవాలు చెప్పేందుకు భయం: వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులపై అసత్యాలు ప్రచారం చేశారు. రూ. 14 లక్షల కోట్ల అప్పులంటూ ఆధారాలు లేకుండా విమర్శలు చేసి ప్రజలను తప్పదోవ పట్టించారు. అలాంటి నాయకులు ఈనాడు బడ్జెట్‌లో అప్పుల గురించి వాస్తవాలు చెప్పడానికే భయపడిపోతున్నారు. విజనరీని, అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు ఏడాది కూడా కాకుండానే పాలన చేతకాక చేతులెత్తేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మూలధన వ్యయం రూ.24 వేల కోట్లు చెప్పి, కేవలం రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారు. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను కూడా సాధించుకోలేని చేతకాని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. రూ.23 వేల కోట్లు రావాల్సి ఉంటే కేవలం రూ.12 వేల కోట్లే తెచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఊసేది?: మేనిఫెస్టోని వైయస్ జగన్ భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించి అమలు చేశారు. 90 శాతం హామీలను అమలు చేసి మేనిఫెస్టో పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు మాత్రం ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసగించారు. కూటమి ఏడాది పాలనతోనే చంద్రబాబు, జగన్ పాలనల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహించారు. ఏపీ అంటే అమరావతే అన్నట్టు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం, వెనుబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను పూర్తిగా విస్మరించారు. విశాఖకు మెట్రో రైలు తీసుకొస్తామని ఎన్నికల్లో గొప్పలు చెప్పి బడ్జెట్‌లో దాని ఊసే మరిచారు. హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ: గ్రూప్–2 నిర్వణలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైంది. నిరుద్యోగ యువత రోడ్డెక్కారు. వలంటీర్లను, బేవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించారు. వారంతా నిరసన తెలుపుతున్నారు. మద్దతు ధర కోసం మిర్చి రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని దించడానకి మహిళలు కూడా రోడ్డెక్కే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతూ, ప్రశ్నించిన వారిని ౖఅరెస్ట్ చేయడం, ఇంకా తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వైయస్ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం తప్ప అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు శూన్యం. ఈ 9 నెలల చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఇప్పటికే విరక్తి మొదలైంది. అందుకే హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ.. అని ప్రజలు అంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ గుర్తు చేశారు.