తాడేపల్లి: పరిపాలన ఎలా ఉండాలో మూడున్నరేళ్లగా సీఎం వైయస్ జగన్ ఒక మోడల్ చూపిస్తూ ముందుకెళ్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అట్టడుగు వర్గాలు ఉన్నతస్థాయికి చేరుకుంటేనే నిజమైన సమసమాజం ఏర్పడుతుందని గాంధీ, పూలే, అంబేడ్కర్ వంటి మహానాయకులు కన్న కలలను సీఎం వైయస్ జగన్ నిజం చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టి.. వాటిని ఆచరణలో చూపిస్తున్నారన్నారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ గార్డెన్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభకు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డైరీ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగం.. ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు బహిరంగంగా, బరితెగించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే వ్యక్తి తన చంద్రన్న కానుక, విదేశీ విద్యను ఎందుకు అమలు చేయరని ప్రశ్నించడం హాస్యాస్పదం. చంద్రబాబు వ్యాఖ్యలను పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో ప్రచురిస్తున్నారు. మూడున్నరేళ్ల ముందు ఎలా ఉండేది.. ఈ మూడున్నరేళ్లలో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. గ్రామాలు, పట్టణాలు, పేదల ఇళ్లు, కాలనీలు ఎలా తయారవుతున్నాయో అందరూ చూస్తున్నారు. వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి వచ్చినవారంతా ఉన్నతాధికారులుగా, చైతన్యవంతులుగా, ప్రభుత్వంలో క్రియాశీలక పాత్రలో ఉన్నారు. ఉన్నతాధికారంలో ఉన్న మీరు అనుకుంటే వంద, రెండు వందల కుటుంబాలను బాగుచేసే అవకాశం ఉంది. అలా బాగుపడేందుకు అవకాశాలు క్రియేట్ చేసే నాయకుడు ఉన్నప్పుడు ఇదీ సరైన దారి అని చెప్పే అదృష్టం ఉన్నతాధికారులకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైయస్‌ఆర్ సీపీ డీఎన్‌ఏలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలు సహజమైన కుటుంబ సభ్యులుగా తలిచే పార్టీ వైయస్‌ఆర్ సీపీ. అయినా సరే, ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయి.. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చి విద్యా, వైద్య రంగంలో కీలకమైన ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. నేరుగా వెనుకబడిన వర్గాలకు విద్యా, జ్ఞానం దాని నుంచి సాధికారత సాధించే దిశగా అడుగులు వేసే ప్రయత్నం వైయస్‌ఆర్ హయాం నుంచి మొదలైంది. వెనుకబడిన వర్గాలు సొంత కాళ్ల మీద నిలబడటమే కాకుండా నాకు ఇది కావాలని ఎంపిక చేసుకునేలా దానికి అవసరమైన అన్ని రకాల వనరులను ఎడ్యుకేషన్‌లో, అలాగే వైద్యరంగంలో ఫ్యామిలీ డాక్టర్ దగ్గర నుంచి టాప్ కార్పొరేట్ వైద్యం వరకు రెండింటినీ ఏకకాలంలో ఆవిష్కరించిన మహానాయకుడు సీఎం వైయస్ జగన్. ఇంతకాలం రాజకీయం పార్టీలు, ఆ పార్టీలకు నాయకత్వం వహించే నాయకులు పేదవాడు పేదవాడిగానే ఉండాలని, ఎన్నికల సమయంలో వారిని కొనుక్కోవాలి, ఆశపెట్టాలి, ఎన్నికలు అయిపోగానే అలాగే ఉంచాలని ఆలోచించారు. బహుజనుల పేరు చెప్పుకుని వచ్చిన పార్టీలు సైతం అదే దారిలో వెళ్లాయి. నేటికీ పార్లమెంట్‌లో మహిళా బిల్లుని రానివ్వడం లేదు. కానీ సీఎం వైయస్ జగన్ తొలిసారి తనకు తాను పరీక్ష పెట్టుకునే దిశగా అడుగులు వేయడం వల్లే.. చట్టం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజ్వేషన్లు అమలు చేశారు. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. సీఎం వైఎస్ జగన్ తన నిర్ణయంతో బెంచ్ మార్కు ఏర్పాటు చేశారు. ఇంతకంటే ఎవరూ తక్కువ రిజర్వేషన్లు ఇవ్వలేరు. వెనుకబడిన వర్గాలు సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం చేయూత ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ నమ్మారు. రెండు పేజీల మేనిఫెస్టోను రూపొందించి వాటిని అమలు చేస్తున్నారు. ఎక్కువ మందికి న్యాయం జరుగుతుందని భావిస్తే సంతకం చేయడానికి సీఎం వైయస్ జగన్ వెనుకాడరు. ఆదర్శప్రాయుడైన సామాజికవేత్తలా సీఎం ఆలోచిస్తున్నారు. ఆయనకు తెలుగుపై మమకారం ఉందన్నారు. పులివెందులబిడ్డ అచ్చ తెలుగులో మాట్లాడగలరు. ఇంగ్లీష్‌పై మోజుతో తెలుగుపై కోపంతో ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు. అవసరం అయి పెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలని ఇంగ్లీష్‌ను ప్రోత్సహించారు. తొలి వంద అంతర్జాతీయ యూనివర్సిటీలలో పేద విద్యార్థులు సీటు తెచ్చుకుంటే ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వమే భరిస్తోంది. మరో వంద యూనివర్సిటీల్లో రూ.50 లక్షల ఫీజు పెట్టి.. మొత్తం 200 అంతర్జాతీయ యూనివర్సిటీలకు మన పేద బిడ్డలు వెళ్లగలిగితే పూర్తి భారం మన ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం విదేశీ విద్య పేరుతో అరకొరగానే నిధులు ఇచ్చింది. వాటిలో కూడా కొన్ని బకాయిలు పెట్టింది.. వాటిని కూడా ఈ ప్రభుత్వమే చెల్లిస్తోంది. బలహీనవర్గాల కుటుంబాలలో మార్పు తీసుకురావడానికే సీఎం వైయస్ జగన్ విద్యకు ఇంత పెద్దపీట వేస్తున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మేలుని అన్ని వర్గాలకి తెలియజెప్పాలి. అధికారం అనేది సేవ అని.. ప్రజల జీవితాలలో మార్పు తీసుకొచ్చే బాధ్యత అని సీఎం వైయస్ జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు. వైయస్ జగన్‌ను అధికారంలో కొనసాగించడం బలహీనవర్గాలకు అవసరం. కుటుంబ పెద్దగా రాష్ట్రం గురించి ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. దావోస్ ఎందుకు వెళ్లలేదని ప్రతిపక్ష నేత అడుగుతున్నాడు.. గతంలో తొమ్మిదిసార్లు దావోస్ వెళ్లి చంద్రబాబు ఏం చేశారు..? చంద్రబాబు కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఒప్పందాన్ని అమలు చేయలేదు. చంద్రబాబు చేసుకున్న ఒప్పందాల్లో ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కటీ లేదు. గతంలో జరిగింది.. ఈ రోజు జరుగుతున్న వాటికి తేడా చాలా స్పష్టంగా ఉంది. సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు కొనసాగాలి. మరింత మెరుగ్గా అమలు జరగాలి. దాని ఫలితాలు 100 శాతం రావాలంటే.. మభ్యపెడుతున్న ప్రతిపక్షాలను తిప్పికొట్టాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. గతంలో ఉద్యోగుల యూనియన్‌లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేవారు. మా ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమని సీఎం వైయస్ జగన్ చూస్తున్నారు. ఉద్యోగులు లేకుండా ఏమీ చేయలేం. లక్ష్యాన్ని చేరువ కావడానికి చిత్తశుద్ధితో పని చేయాలి.. అందరి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఉద్యోగులంతా ఓపిగ్గా సహకరిస్తున్నారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి సరైన మార్గంలోనే వెళ్తుంది. ఒక్క రూపాయి కూడా తమ ప్రభుత్వం వేస్ట్ చేయటం లేదన్నారు. సంక్షేమ పథకాల సాయాన్ని లబ్ధిదారుల చెంతకు చేరుస్తున్నారు.