చంద్రబాబు నాయుడిది రైతు వ్యతిరేక ప్రభుత్వం

రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు

పెట్టుబడి సాయం లేదు, ఇన్ పుట్ సబ్సిడీ లేదు

ధరల స్థిరీకరణ నిధికి మంగళం పాడిన కూటమి ప్రభుత్వం

చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి సాకే శైలజానాద్ ఫైర్

అనంతపురం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన  మాజీ మంత్రి సాకే శైలజానాధ్.

సాగు భారమై అన్నదాతల ఆత్మహత్యలు 

నీరో చక్రవర్తి తరహాలో వ్యవహరిస్తున్న చంద్రబాబు

ఖజనాలో డబ్బుల్లేవంటూనే రూ.2.27 లక్షల కోట్లు అప్పు

ప్రజా ధనంతో స్పెషల్ ఫైట్లలో సీఎం, మంత్రులు విహారాలు

రైతు సంక్షేమానికి మాత్రం రూపాయి విదల్చని బాబు 

రైతన్నా మీ కోసం పేరుతో కొత్త నాటకం

పంచ సూత్రాలు కాదు పంచ మోసాలు

తేల్చి చెప్పిన సాకే శైలజానాధ్.

అనంతపురం: పండిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ...  ప్రత్తి, అరటి, మొక్కజోన్న, మినుమలు, శెనగలు, మొక్కజొన్న, మిర్చితో పాటు ఏ పంటలకూ గిట్టుబాటు ధరలేక రైతులు రొడ్డెక్కే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. దీనికి తోడు పెట్టుబడి సాయం, ఇన్ పుట్ సబ్సిడీ లేకపోవడంతో సాగు భారమై అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే,  చంద్రబాబు మాత్రం  రోమ్ నగరం తగలబడుతుంటే... ఫిడేల్ వాయించిన నీరో  చక్రవర్తి తరహాలో వ్యవహరిస్తున్నాడని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

● పంచ సూత్రాలు కాదు పంచ మోసాలు...

తాము పండించిన ఏ పంటలకూ గిట్టుబాటు ధర లేక రైతులు జీవితాలు నాశనమవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు.  చంద్రబాబు సర్కారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ద్రోహం చేయడం తప్ప... వారిని ఆదుకునే కార్యక్రమాలు లేవు. రైతుల కష్టాలను కనీసం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు... పంచసూత్రాల పేరుతో రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతులకు గిట్టుబాటు అంటున్న చంద్రబాబే ముందు దాన్ని నేర్చుకోవాలి. అదే విధంగా రాయలసీమ జిల్లాలకు నీరివ్వడంపై కనీస శ్రద్ధ లేని సీఎం... నీటి భద్రత గురించి మాట్లాడ్డం విడ్డూరం. ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం అంటే ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. ఇక రైతు పెట్టుబడి సాయం తగ్గించాలంటున్న చంద్రబాబుకి ఆ మాట చెప్పడానికి నోరెలా వస్తుందో అర్ధం కావడం లేదు. విత్తనాలు రేట్లు నియంత్రించాల్సింది, పెట్టుబడులు తగ్గించాల్సింది కూడా ప్రభుత్వమే. ఎరువులు ధరల విషయంలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో యూరియా కోసం క్యూలైన్లో నిల్చోవడంతో పాటు అధిక ధరలకు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన దుస్థితి. మీ మాటలు వెంటే రైతులు కడుపు మండుతుంది చంద్రబాబూ.

రైతుల పంటలకు అదనపు విలువ జోడించాలి, ప్రుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలంటూ మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ప్రపంచ వేదికగా రైతుల ఉత్పత్తులు మార్కెట్ అంటున్న చంద్రబాబు గారూ... మీరు మీ మంత్రులు ప్రపంచ దేశాల తిరిగి వస్తే మార్కెట్ వస్తుందా? మొక్కజొన్న పంట కొనుగోలు చేస్తామని రైతులు హామీ ఇవ్వడం తప్ప అమలు చేసిందేం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హార్టికల్చర్ సాగులో ముందంజలో ఉండటానికి కారణం దివంగత నేత వైయస్సార్ ఆయన కుమారుడు వైయస్.జగన్ హయాంలో చేపట్టిన సాగు అనుకూల విధానాలే కారణం. డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ విధానం వల్లే అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాలో ఆ మాత్రమైనా వ్యవసాయం సాగవుతోంది, రైతులు బ్రతుకున్నారు. 

● రైతు సాయానికి మనసురాని ప్రభుత్వమిది..

ధరల స్థిరీకరణ నిధి గురించి మీరు మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. ఒకవైపు డబ్బులు లేవని చెబుతారు.. మరోవైపు పెట్టుబడుల పేరుతో ప్రత్యేక విమానాల్లో ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నారు. పెట్టుబడుల సదస్సు పేరుతో మీ నాయకత్వంలో నిర్వహించిన నాలుగో సమావేశం ఇది. పోయిన భూములు తప్ప... వచ్చిన పెట్టుబడులేవీ లేవు. దానికోసం రూ.300 కోట్లు ఖర్చుపెట్టారు. అంతకముందు యోగాడే పేరుతో ఢిల్లీ పెద్దల మెప్పు కోసం వందలాది కోట్లు ఖర్చుపెట్టారు. 
వేలాది కోట్ల రూపాయలు దుబారా ఖర్చులు చేస్తున్న మీకు.. రైతుల కోసం మాత్రం రూపాయి ఖర్చు పెట్టడానికి మనసు రాదు. రూ.600 కోట్లు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉంది. 
వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో రైతుల పేరిట ప్రభుత్వమే ప్రీమియమ్ చెల్లించి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుచేసింది. పంట నష్టపోయిన రైతులకు ఏ సీజన్ లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ లో  చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు. 

● తూతూ మంత్రంగా కొనుగోలు...

చంద్రబాబు ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాకు మంగళం పాడారు. పుడమి తల్లిని నమ్ముకుని సాగు చేస్తున్న రైతులకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. వైయస్.జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు చేయిపట్టుకుని నడిపించింది. మద్ధతు ధర కోల్పోయిన ప్రతి పంటను వైయస్.జగన్ హయాంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు చేసింది. ఇవాళ ఏ పంటకూ మద్ధతు ధర లేదు. ఉల్లి, టమోటతో పాటు చివరకి అరటి పంటను కూడా రైతులు పారబోసే రోజులు మీ పాలనలో దాపురించాయి. కిలో రెండు రూపాయలకు అరటి పళ్లు దొరికే దుస్థితి చంద్రబాబు పాలనలోనే కనిపిస్తోంది.  ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల తరపున కొనాలన్న ఆలోచన కూడా చేయడం లేదు . అనంతపురం జిల్లాలో ప్రతిపంట కొనుగోలులో కూడా రైతులను మోసం చేశారు. అక్కడక్కడా రెండు మూడు సెంటర్లు ఏర్పాటు చేసి ఫోటోలకు పోజు ఇచ్చి... పేపర్లలో వార్తల కోసం చేశారు. అధికారులను ప్రశ్నిస్తే.. ఉత్తరాది ప్రాంతంలో పంట ఎక్కువ ఉందని.. పంట నాణ్యత లేదని మరోసారి సాకులు చెబుతున్నారు.  ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమిది. ప్రశ్నిస్తే తిరిగి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. 

18 నెలల కూటమి పాలనలో 15 దఫాలకు పైగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. అయినా ఈ ప్రభుత్వం రైతులను ఒక్కసారీ ఆదుకున్న పాపాన పోలేదు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పాలనలో ఏ రైతులకూ న్యాయం జరగడం లేదు. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం తక్షణమై రైతు సమస్యలపై దృష్టి పెట్టాలి. అంతే తప్ప మీ అనుకూల పత్రికల్లో ప్రచారం చేసుకుంటూ.. రైతులకు అంతా చేశామని చెప్పుకునే ప్రయత్నం మానుకోవాలి. పదే పదే ఖజానాలో డబ్బుల్లేవని చెబుతున్న చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇప్పటి వరకూ చేసిన రూ.2.27 లక్షల కోట్లు అప్పుతో ఏం చేసింది? ఇదేనా మీ సంపద సృష్టి. మీరు చెప్పిన అప్పుల్లో కొంత మా రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టండి బాబూ? ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మాపై ఎదురుదాడి చేస్తున్నారు. అసమర్ధునికి కోపమెక్కువ బాబూ. మీకు రైతుల పట్ల కనీస ప్రేమ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 మంది రైతులు  ఇప్పటివరకూ ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు పెట్టుబడి సాయం లేక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక, ఎరువులు అందక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. చంద్రబాబు రోమ్ నగరం తగలబడిపోతుంటే... ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి తరహాలో మీ పాలన సాగుతోంది. రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో మీరు నీరో చక్రవర్తి తరహాలో మిగిలిపోవడం ఖాయం.
 
ఇప్పటికైనా మీరు రైతులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోకపోతే..వైయస్.జగన్ నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతలకు అండగా నిలబడ్డంతో పాటు వారి తరపున పోరాటం చేయడం ఖాయమని శైలజానాధ్ హెచ్చరించారు.

Back to Top