ప్రభుత్వ మెడికల్ కాలేజీ భూములను కాజేసేందుకు చంద్రబాబు స్కెచ్

పీపీపీ పేరుతో తన బినామీలకు దోచిపెట్టే యత్నం

మండిపడ్డ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా

తుని లోని పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.

యారియా బ్లాక్ మార్కెట్‌తో రూ. 200 కోట్ల‌కు పైగా అవినీతి

ఆరోగ్య‌శ్రీ హైబ్రిడ్ మోడ‌ల్‌, మెడిక‌ల్ కాలేజీలు ప్రైవేటు ముసుగులో భారీ దోపిడీ  

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం 

తుని: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు చెందిన విలువైన భూములను కాజేసేందుకు సీఎం చంద్రబాబు భారీ స్కెచ్ వేశారని, తన బినామీలకు పీపీపీ మోడ్‌తో మెడికల్ కాలేజీలను కట్టబెట్టే యత్నం వెనుక భారీ అవినీతి దాగి ఉందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తుని లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అన్ని వ్యవస్థలను నాశనం చేస్తూ, అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా చేసుకుని పాలన సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరతను సృష్టించి, బ్లాక్ మార్కెట్ దందాను ప్రోత్సహించడం ద్వారా కూటమి నేతలకు రూ.200 కోట్ల మేరకు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ అవినీతి బాగోతాలు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...

 రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్ధికీ మెడికల్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సీఎంగా వైయస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఖరీదైన భూములను సేకరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. తాజాగా సీఎం చంద్రబాబు మెడిక‌ల్ కాలేజీల ఆస్తుల‌పై క‌న్నేసి వైయ‌స్ జ‌గ‌న్ నిర్మించిన మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుప‌రం పేరుతో త‌న వారికి చేతుల్లో పెడుతున్నాడు. సంప‌ద సృష్టిస్తాన‌ని హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు, పోర్టులు, ఆస్ప‌త్రుల రూపంలో  వైయ‌స్ జ‌గ‌న్ సృష్టించిన సంప‌ద‌ను త‌న వారికి క‌ట్టబెట్టేస్తున్నాడు. మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుప‌రం చేసే నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలి. నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేస్తున్న చంద్ర‌బాబు, త‌న జీవితంలో ఒక్క మెడిక‌ల్ కాలేజీ కానీ, ఒక్క పోర్టును కూడా నిర్మించ‌లేక‌పోయాడు.ఒక ప‌థ‌కం ప్ర‌కారం సీఎం చంద్ర‌బాబు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఆరోగ్య‌శ్రీకి రూ. 3700 కోట్ల బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రులు వైద్యం చేయ‌డానికి నిరాక‌రిస్తున్నాయి. ఆస్ప‌త్రుల్లో ఆరోగ్య‌శ్రీ సేవ‌లు అందించ‌బ‌డ‌వు అనే బోర్డులు పెట్టే దుస్థితి వ‌చ్చిందంటే ఇది చంద్ర‌బాబు అస‌మ‌ర్థ పాల‌న‌కు నిద‌ర్శ‌నం. చివ‌రికి ట్ర‌స్ట్ మోడ్‌లో న‌డిచే ఆరోగ్య‌శ్రీని హైబ్రిడ్ మోడ్‌లోకి తీసుకొచ్చే పేరుతో కొత్త‌గా దొపిడీకి తెర‌దీశారు.

-  అవినీతి పాలనలో ప్రజా సంక్షేమానికి చోటు లేదు

వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో స్వేచ్ఛ‌గా, ప్ర‌జా శ్రేయ‌స్సే ల‌క్ష్యంగా ఆద‌ర్శంగా ప‌నిచేసేలా అన్ని వ్యవస్థలను తీర్చి దిద్దారు. నేడు సీఎంగా చంద్రబాబు ఎలా తన జేబులు నింపుకోవాలి, కమీషన్లు ఎలా అందుకోవాలి, రైతుల నోట్లో మట్టి కొట్టి యూరియాను సైతం బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకునేలా చేసి ఎలా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలే చేస్తున్నారు. ఆదాయ మార్గాల‌ను అన్వేషిస్తూ ప్ర‌భుత్వ ఆస్తుల‌ను అప్ప‌నంగా త‌న వారికి క‌ట్ట‌బెట్టేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. గడిచిన 15 నెల‌ల చంద్ర‌బాబు పాల‌న‌లో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ఎరువులు దొర‌క్క రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు క్యూలైన్ల‌లో నిల‌బ‌డినా ఒక్క యూరియా బ‌స్తా కూడా దొర‌క‌ని ప‌రిస్థితి. ఎమ్మార్పీ క‌న్నా రూ.200 ఎక్కువ పెట్టినా యూరియా దొర‌క‌డం లేదు. రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా భారీ ఎత్తున క్యూలైన్లు ద‌ర్శ‌నమిస్తుంటే, చంద్ర‌బాబు మాత్రం యూరియా కొర‌తే లేద‌ని చెబుతున్నారు. యూరియా కొర‌త‌పై ప్ర‌శ్నిస్తున్న రైతుల‌కు పార్టీలు అంట‌గ‌డుతున్నాడు. యూరియా బ్లాక్ మార్కెట్‌కి త‌ర‌లిస్తున్న లారీల‌ను అడ్డుకుంటే త‌ట్టుకోలేకపోతున్నారు. అక్ర‌మ లారీల‌ను కూడా తెల్లారేపాటికి ఆథ‌రైజ్డ్ లారీగా డిక్లేర్ చేస్తున్నారు. ఒక్క యూరియా స‌ర‌ఫ‌రాలోనే రూ. 200 కోట్ల‌కుపైగా దోచుకున్నారు. 

-   చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరింది

ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్న వైయ‌స్సార్సీపీ పార్టీని ఫేక్ పార్టీ అని, వైయ‌స్సార్సీపీ నాయ‌కుల‌ను తోలు తీస్తామ‌ని బెదిరించ‌డం నియంతృత్వానికి నిద‌ర్శ‌నం. చంద్ర‌బాబు పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరింది. క‌ళ్ల ముందు రైతులు ప‌డుతున్న క‌ష్టాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తుంటే ఫొటోలు, వీడియోలు కూడా ఫేక్ అనే మ‌నిషిని చ‌రిత్ర‌లో తొలిసారి చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీని మించిన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ దేశంలోనే లేదు. పింఛ‌న్ ఎందుకు తొల‌గిస్తున్నార‌ని ప్ర‌శ్నించిన దివ్యాంగుల‌ను దొంగ‌లంటున్నారు. ప్ర‌భుత్వ వైఫల్యాల‌ను ప్ర‌శ్నిస్తుంటే చంద్ర‌బాబు స‌మాధానం చెప్పుకోలేక స‌హ‌నం కోల్పోయి నోటి దురుసుతో మాట్లాడుతున్నారు. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం, ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి చేయాల్సిన వ్యాఖ్య‌లేనా ఇవి. ఆధార్ కార్డు తీసుకుని కాకుండా పొలం పాస్ బుక్ ఆధారంగా యూరియాను పంపిణీ చేస్తేనే నిజ‌మైన రైతుల‌కు మేలు జ‌రుగుతుంది. 

మీడియా ప్రతినిధుల ప్రశ్న‌ల‌కు స్పందిస్తూ...
 
-  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌తి మాట‌ను ఆచితూచి మాట్లాడాలి. వినేవారు ఉన్నారు క‌దా అని మ‌న‌సుకు తోచిన‌ట్టు నోటికొచ్చింది మాట్లాడటం క‌రెక్టు కాదు. తాను త‌ప్పుగా మాట్లాడే ప్ర‌తి మాట‌కు ఖ‌చ్చితంగా భ‌విష్య‌త్తులో జ‌వాబు చెప్పుకోవాల్సిన రోజు వ‌స్తుంద‌ని గుర్తుంచుకోవాలి. 

-  వైయ‌స్ జ‌గ‌న్ అతి కష్టం మీద 17 మెడిక‌ల్ కాలేజీలు సాధించుకొస్తే, చంద్ర‌బాబు జేబులు నింపుకోవ‌డ‌మే ధ్యేయంగా ప్రైవేటుప‌రం చేస్తున్నాడు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి మీద కోపంతో పులివెందుల మెడిక‌ల్ కాలేజీకిచ్చిన సీట్ల‌ను కూడా వెన‌క్కిచ్చేస్తూ ఇండియ‌న్ మెడిక‌ల్ కౌన్సిల్‌కి చంద్ర‌బాబు లేఖ రాయ‌డం దుర్మార్గం. వైయ‌స్ జ‌గ‌న్ మాదిరిగా రాష్ట్ర ప్ర‌జ‌లంతా నా వారేన‌ని ప‌నిచేయ‌డం చంద్ర‌బాబు నేర్చుకోవాలి. ఏ ముఖ్య‌మంత్ర‌యినా మా రాష్ట్రానికి మ‌రిన్ని మెడిక‌ల్ సీట్లు కావాల‌ని అడ‌గడం చూస్తుంటాం. కానీ చంద్ర‌బాబు మాత్రం జ‌గ‌న్ గారు తీసుకొచ్చిన సీట్ల‌ను వెన‌క్కివ్వ‌డం చూస్తున్నాం. చంద్ర‌బాబు చ‌ర్య‌ల వ‌ల్ల డాక్ట‌ర్ కావాల‌న్న పేద విద్యార్థి ఆశ‌లు అడుగంటిపోతున్నాయి.

Back to Top