విశాఖపట్నం: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అహంకారం, అత్యాశ, దురాశతోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల విషయంలో ఉద్దేశపూర్వకంగా ఎన్నోవిషయాలను దాచి ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలనుపై షర్మిల ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. తన మాటలు ప్రజలు నమ్మడం లేదనే కడుపుమంటతో చిన్నప్పుడు ఎత్తుకుని పెంచిన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని సైతం నీచంగా మాట్లాడారని ఆక్షేపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకుల నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మీద నమ్మకంతోనే ఉన్నారు తప్ప ఎవరి మోచేతి నీళ్లు తాగే దౌర్భాగ్య పరిస్థితి లేదన్నారు. ఏ వ్యక్తినైతే వైయస్ఆర్ కుటుంబం శత్రువుగా భావించిందో, ఎవరితోనైతే కడదాకా దివంగత మహానేత వైఎస్సార్ పోరాడారో ఆ చంద్రబాబుతోనే షర్మిల చేతులు కలిపిందని, ఏ పార్టీ అయితే మహానేత చనిపోయాక కేసులు పెట్టిందో ఆ పార్టీలోనే ఆమె చేరిందని దుయ్యబట్టారు. కాబట్టే ప్రైవేటుగా కుటుంబ సభ్యులు చేసుకున్న ఎంవోయూను లీక్ చేసి టీడీపీకి అందించారని, ఆ విషయం గురించి మాట్లాడితే బాబాయ్‌ని, తనతో కలిసి 40 ఏళ్లపాటు పెరిగిన అన్నయ్యను కూడా దౌర్భాగ్యుడు అని నోటికొచ్చినట్టు మాడ్లాడుతున్నరని షర్మిల పై గుడివాడ ఆగ్రహించారు. వైయస్ఆర్ చనిపోయేనాటికి రూ. 1300 కోట్ల అప్పుల్లో కంపెనీలు వైయస్ జగన్ సతీమణి భారతమ్మ ఆస్తులు అటాచ్ చేసిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే షర్మిల చెప్పలేదని, నలుగురు మనవళ్లు మనవరాళ్లకు ఆస్తి సమానంగా పంచాలని చెప్పారన్న విషయాన్ని సాక్షులుగా ఉన్నవారు కూడా ఒప్పుకోవడం లేదని అమర్ తెలిపారు. పార్టీ కోసం ఇంత కష్టపడిన నాకు అన్న ఏమిచ్చాడని ప్రశ్నించిన షర్మిల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ. 200 కోట్లకుపైగా ఆస్తులను రాసిచ్చి, స్వార్జితమైన ఆస్తుల్లోనూ 40 శాతం వాటా ఇచ్చినా ఆశ తీరలేదని ఆరోపించారు. 2019 ఆగస్టులో ఎంవోయూ జరిగినప్పుడే ఆస్తుల బదలాయించుకుంటే రూ. 200 కోట్ల వరకు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని భయపడి వెనక్కి తగ్గిన షర్మిల.., ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు బదలాయిస్తే అన్నకు న్యాయపరంగా చిక్కులు ఎదురవుతాయని తెలిసినా ఎందుకు కుట్రపూరితంగా షేర్లు బదలాయించుకున్నారని నిలదీశారు. అంటే చంద్రబాబు నాయుడు అండతో జైలుకు పంపాలని చూశారా అని షర్మిలని గుడివాడ సూటిగా ప్రశ్నించారు. సరస్వతీ షేర్లపైన హైకోర్టు స్టే ఇచ్చిన విషయంలో అబద్ధాలు చెప్పడాన్ని ఆక్షేపించారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలను గుర్తుచేశారు. ఆస్తుల గురించి మాట్లాడిన షర్మిలకు అప్పుల గురించి, నష్టాల గురించి తెలియకపోవడం విడ్డూరమని, సాక్షి ఏర్పాటైన కొత్తల్లో ప్రతినెలా రూ. 20 కోట్లు నష్టం వచ్చేదని, వైఎస్సార్ చనిపోయేనాటికి వైఎస్ జగన్ ప్రారంభించిన సంస్థలు రూ. 1300 కోట్ల రుణభారంతో ఉన్నాయనే విషయాలు ఆమెకు తెలియవా అని ప్రశ్నించారు. షర్మిల చర్యల కారణంగానే తల్లిపై కోర్టుకు.. తల్లిని చెల్లిని కోర్టుకు లాగారు అని షర్మిల మాట్లాడుతున్నారని.. దానికి కారణం ఆమె అక్రమంగా షేర్ల బదలాయింపునకు పాల్పడటమేనని వివరిస్తూ, కోట్ల మంది నమ్ముకున్న పార్టీని బతికించుకోవడానికి, న్యాయ పరమైన సమస్యలు ఎదురుకాకుండా చూసేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నారని అమర్నాథ్ వివరించారు. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కారణంగానే ఎఫ్ఐఆర్‌లో వైయస్ఆర్ పేరు చేరిందని షర్మిల పెద్ద అబద్ధం చెప్పారని, వైఎస్సార్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు వైయస్ జగన్‌ను బాధ్యుడ్ని చేయడంపైనే ఆయన కోర్టుకెళ్లారని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుట్రపూరితంగా 16 నెలలపాటు జైలుపాలు చేసిన విషయాన్ని షర్మిల మర్చిపోయారా అని నిలదీశారు. వైయస్ఆర్‌సీపీ ఆమె ఒక్కరి వల్లనే గెలిచిందని చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. ఆమెతోపాటు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ కష్టం, వేలాది మంది నాయకులు శ్రమ, కోట్ల మంది కార్యకర్తల పట్టుదలతోనే 2019లో సమిష్టి విజయం దక్కిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దివంగత మహానేత వైయస్ఆర్ కూతురిగా, మా నాయకులు వైయస్ జగన్ సోదరిగా ఎప్పుడూ షర్మిలను ఉన్నతంగానే చూశామని కానీ, ఆమె శత్రువులతో చేతులు కలిపి పార్టీని భూస్థాపితం చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోసారి పార్టీ నాయకులు, కార్యకర్తలపై నోటికొచ్చినట్టు మాట్లాడటం తగదని హితవు పలికారు