గుంటూరు: పల్నాడుజిల్లా గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలను సొంతపార్టీ వారే ఆదిపత్య పోరు కారణంగా దారుణంగా హతమారుస్తే, ఆ కేసును వైయస్ఆర్సీపీ నేతలపై బనాయించడం దుర్మార్గమని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యకే జూలకంటి బ్రహ్మారెడ్డి చెప్పారని పోలీసులు వైయస్సార్‌సీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై కేసు నమోదు చేయడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి వంతపాడే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు, మృతుల బంధువులు సైతం టీడీపీలోని ప్రత్యర్థివర్గం వారే ఈ హత్యలు చేశారంటూ స్పష్టం చేస్తున్నా, పోలీసులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లతో ఇలాంటి తప్పుడు కేసులు బానాయించారని అన్నారు. దీనికి బాధ్యులైన పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే.. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు కోటేశ్వరరావులను సొంత పార్టీకి చెందిన మరో వర్గం వారే చంపేశారు. తెలంగాణలో ఒక ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా బోదలవీడు వద్ద బైకుపై వెళ్తున్న వారిద్దర్నీ స్కార్పియో వాహనంతో ఢీకొట్టి చంపారు. గుండ్లపాడు టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగానే ఈ ఇద్దర్నీ దారుణంగా చంపేశారని స్వయంగా జిల్లా ఎస్పీనే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తెలుగుదేశం కర పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడు సహా ఇది అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య సోదరులతోపాటు జెలిశెట్టి శ్రీనివాసరావు వర్గం వారిని చంపేసిందని కూడా రాశారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యపోరు కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈ హత్యలు జరిగాయని ఆ పత్రికలే రాశాయి. అత్యంత సమస్యాత్మక ప్రాంతం అని తెలిసినా పటిష్ట నిఘా వేయడంలో పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ హత్యలు జరిగినట్టు ఈనాడు పత్రిక రాసింది. జిల్లా ఎస్పీతోసహా అన్ని ప్రధాన పత్రికల్లోనూ హత్యకు ఆధిపత్యపోరే కారణమని రాసినా, నిందితులతో వైయస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేకపోయినా పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్‌లో విచిత్రంగా వైయస్ఆర్‌సీపీ నేతల పేర్లను రాయడం చూస్తుంటే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయందో అర్థమవుతోంది. ఈ హత్యలకు వైయస్సార్సీపీ నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కారణమంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం టీడీపీ కుట్ర. హంతకులు వదిలిన వాహనంపై టీడీపీ ఎమ్మెల్యే పేరు హత్య అనంతరం నిందితులు స్కార్పియో వాహనాన్ని అక్కడే వదిలిపారిపోయారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న స్కార్పియో వాహనం పసుపు రంగులో జేబీఆర్ అంటూ స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పేరు కూడా ఉంది. మృతుల కుటుంబ సభ్యులు జెలిశెట్టి ఆంజనేయులు సైతం మా పార్టీ వారే హత్య చేశారని చెప్పినా వైయస్సార్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమో పోలీసులు ఆలోచించుకోవాలి. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్భలంతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదు. రాష్ట్రంలో ఏ దుర్ఘటన జరిగినా దానికి వైయస్ జగన్, వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే కారణంగా చూపించాలని ఫిక్స్ అయిపోయారు. తప్పుడు కేసులు, అసత్య కథనాలతో వేధిస్తున్నారు. మొన్నటికి మొన్న హరికృష్ణ అనే వైయస్ఆర్‌సీపీ కార్యకర్త మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి దారుణంగా వేధించారు. వైయస్సార్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టడం, మా వారిని కొట్టడమే కూటమి ప్రభుత్వంలో పోలీసుల డ్యూటీ. అయితే ఇటీవల తప్పుడు కేసు పెట్టేందుకు ఒప్పుకోని కారణంగా డీఎస్పీగా మొదటిసారి పోస్టింగ్ మీద వచ్చిన జగదీశ్ అనే అధికారిని మూడు నెలల్లోనే ట్రాన్సఫర్ చేసేశారు. ఇప్పటికీ ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఏం చెప్పినా కళ్లు మూసుకుని చేసే అలవాటున్న సత్తెనపల్లి డీఎస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఈ గ్రామంలో ఫ్యాక్షన్ ను అరికట్టలేకపోయారు. గతంలో హత్యకావించబడిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్యది కూడా ఈ గ్రామమే. ఆయన కొడుక్కి చంద్రబాబు ఈ మధ్యనే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాడు. ప్రకాశం జిల్లాలో హత్యకావించబడిన వీరయ్య చౌదరి కేసులోనూ వైయస్ఆర్‌సీపీ నాయకులను ఇరికించడానికి చివరి వరకు ప్రయత్నించారు. ఈ రాష్ట్రంలో ఎస్పీల చేతుల్లోనూ ఏమీ లేదు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకే ఎవరైనా నడుచుకోవాల్సిందే. లేదంటే వారికి ట్రాన్సఫర్‌లు రావడం ఖాయం. వారి మాట వినకపోతే పోస్టింగులు కూడా ఉండవు. అయితే టీడీపీ భజన పత్రిక ఈనాడులో పదే పదే ఎస్పీ వైఫల్యం అంటూ వార్తలు రాస్తున్న విధానం చూస్తుంటే ఆయన్ను తప్పించాలని ఈనాడు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.