తాడేపల్లి: స్వార్థపూరితమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. పవన్‌కు ఒక ఎజెండా లేదని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే ఆయన లక్ష్యమన్నారు. నరసాపురం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఆళ్లనాని తీవ్రంగా ఖండించారు. రాయలసీమ రౌడీలు, గుండాలంటూ పవన్ ప్రజల్లో భయానక పరిస్థితులు నెలకొల్పేలా వ్యాఖ్యలు చేస్తున్నారని తప్పుపట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్‌ను రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రానివ్వకుండా చేయలన్న ప్రయత్నం, చంద్రబాబును ఏదో విధంగా ముఖ్యమంత్రిని చేయాలనే ఏకైక లక్ష్యంతో పవన్ వారాహీ యాత్ర చేస్తున్నట్లు అర్థమవుతుంది. వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నా మేం ఎంతో సహనంతో ఉంటున్నామే కానీ, చేతకాని తనం కాదు. స్వార్థపూరిత ఆలోచనలతో వారాహి యాత్ర చేస్తున్నాడని చెప్పడానికి నిదర్శనం ఉభయ గోదావరి జిల్లాలో పవన్ యాత్రనే నిదర్శనం. ఈ యాత్రలో ప్రజలపై కూడా పవన్ తన అక్కస్సును వెళ్లగక్కుతున్నాడు. గత ఎన్నికల్లో తనను చిత్తు చిత్తుగా ఓడించారని ప్రజలపై అక్కసు వెళ్లగక్కేందుకు వెనుకాడటం లేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో యాత్ర చేస్తూ నర్సాపురంలో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తూ పులివెందుల రౌడీయిజం అంటూ పచ్చగా ఉండే ప్రాంతంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్ ప్రయత్నం చేశారు. కులాలను విభజిస్తూ మాట్లాడుతున్నారు. రాయలసీమ గుండాలు, రౌడీలు అంటూ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా ప్రసంగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేశారు. ఈ విషయాన్ని ప్రజలు బాగా గుర్తు పెట్టుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలో రాయలసీమ పేరు చెప్పి జరగని సంఘటనలు జరిగినట్లుగా ప్రజలను అయోమయంలోకి నెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దురదృష్టకరం. దేవుడిని కూడా తన రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవడం బాధాకరం. నర్సాపురం సభలో మాట్లాడుతూ..అంతర్వేదిలో జరిగిన రథం సంఘటనను ప్రస్తావించారు. అదేదో వైయస్ జగన్ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం అన్నట్లుగా మాట్లాడారు. ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిన వెంటనే విచారణకు ఆదేశించడమే కాకుండా కొత్త రథాన్ని తయారు చేయించడమే కాకుండా వైయస్ జగనే స్వయంగా భగవంతుడికి అంకితం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ మిత్రపక్షంలో ఉన్నాడు. విజయవాడ నడిబొడ్డున 40 ఆలయాలను ధ్వంసం చేస్తే..సాధువులు, సన్యాసులు వచ్చి నిరసన తెలిపితే వారిపై కూడా దాడులు చేయించిన చరిత్ర చంద్రబాబుది. అటువంటి పరిస్థితుల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఆ ఆలయాలను పున ర్ నిర్మించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్. ఎదుటివారిపై నిందలు వేయలేదు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రథాన్ని తయారు చేయించారు. 34 సీట్లలో ఒక్కచోట కూడా వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలవనివ్వమని పవన్ అంటున్నారు. వారాహి యాత్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. ఎలాంటి ఎజెండా లేకుండా కేవలం తిట్ల పురాణం, సవాళ్లతో కొనసాగిస్తున్నారు. వైయస్ జగన్‌ను అప్రతిష్టపాలు చేయాలన్న కుట్రలతో యాత్రలు చేస్తే..మీకు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క స్థానంలో కూడా గెలవనివ్వకుండా చేసే సత్తా వైయస్ జగన్‌కు, వైయస్‌ఆర్‌సీపీకి ఉంది. ప్రజలు మీపై తిరగబడే పరిస్థితి వస్తుందని ఆళ్ల నాని హెచ్చరించారు. l