రాష్ట్రానికి చేరుకున్న మత్య్సకారులు

విజయవాడలో మంత్రి మోపిదేవి ఘన స్వాగతం

గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద అల్పహారం అందించిన ఎమ్మెల్యే సామినేని 

 విజయవాడ : చేపల వేటకు గుజరాత్‌కు వెళ్లిన  ఉత్తరాంధ్రకు చెందిన 876 మంది మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చేరుకున్నారు. లాక్‌డౌన్‌  నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో వారంతా శుక్రవారం గుజరాత్ నుంచి తెలంగాణ మీదుగా మొత్తం 12 బస్సుల్లో 850 మంది మత్య్సకారులు శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి గరికపాడు చెక్ పోస్టు వద్ద విప్ సామినేని ఉదయభాను, ఎస్పీ రవీంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ విప్ ఉదయభాను మత్య్సకారులకు జగ్గయ్యపేట వద్ద కిచిడీ ప్యాకెట్లు పంపిణి చేశారు. 

విజయవాడలో ఘన స్వాగతం
గుజరాత్‌ నుంచి వచ్చిన మత్స్యకారులకు రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని, కరోనా పట్ల జాగ్రతగా ఉండాలని అవగాహన కల్పించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐదు చోట్ల అల్పాహార పాకెట్లు, వాటర్‌ బాటిళ్లను సిద్ధం చేసినట్లు మత్య్సశాఖ పేర్కొంది. మత్య్సకారులు ఉన్న బస్సులు ఆగే ఐదు చోట్ల పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. వారంతా భౌతిక దూరం పాటించేలా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం 
విశాఖపట్నం : కొద్ది నెలల క్రితం చేపల వేటకు గుజరాత్‌కు వెళ్లి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన 876 మంది మత్స్యకారులు శుక్రవారం విశాఖకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని నేరుగా గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానితో మాట్లాడిన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో బస్సులు, ఇతరత్రా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం గుజరాత్‌ నుంచి బస్సుల్లో బయలుదేరిన వారందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి 9 గంటలకు తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నారని తెలిపారు.శుక్రవారం మధ్యాహ్నానికి వారు విశాఖకు రానున్నారని, ప్రతి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీస్‌ చెక్‌పోస్టులలో ఆలస్యం అవుతోందని వారు వివరించారు. మత్స్యకారుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 396 మంది, విశాఖపట్నం 420, విజయనగరం జిల్లాకు చెందిన వారు 25 మంది కాగా, మిగతా వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు. 

Back to Top