విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతిపరుడంటూ గతంలో అనేక ఆరోపణలు చేసిన తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు.. ఇప్పుడు ఉన్నట్టుండి బాబుపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తుండడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి నిప్పులు చెరిగారు.ఒకప్పుడు ఎన్టీఆర్‌ని చంపించింది చంద్రబాబు నాయుడేనని మాట్లాడిన మోత్కుపల్లి ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబుని పొగుడుతున్నారని విమర్శలు గుప్పించారు. అవినీతి చేసి అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా దీక్షకు దిగిన మోత్కుపల్లిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు నాయుడు పెద్ద అవినీతి పరుడని, నయవంచకుడని గతంలో విమ్మర్శలు చేసిన మోత్కుపల్లి ఇప్పుడు ఆయనేదో నీతిపరుడన్నట్లు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ని చంపించింది చంద్రబాబు నాయుడేనని మాట్లాడిన మోత్కుపల్లి.. ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబుని పొగుడుతున్నాడన్నారు. ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించం అని మోత్కుపల్లిని వారించారాయన. అసలు అవినీతిని కనిపెట్టిందే చంద్రబాబు నాయుడని.. స్కిల్ స్కామ్‌లో కోట్లు కొల్లగొట్టాడని ఈరోజు ఆయన పాపం పండి కటకటాల పాలయ్యాడని అన్నారు. ఇక బీజేపీ నేత పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిలా కాకుండా టీడీపీ అధ్యక్షురాలిలా వ్యవహరిస్తోందని, ఆరోజు డబ్బు కోసం, పదవి కోసం ఆశపడి పురందేశ్వరి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిందని అన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే చంద్రబాబు అవినీతిపరుడని చెబుతుంటే.. పురందేశ్వరి మాత్రం ఆయనేదో సత్యహరిశ్చంద్రుడన్నట్టు మద్దతిస్తున్నారన్నారు. మద్యం షాపుల్లో నగదు, ఆన్‌లైన్ పేమెంట్లు రెండూ తీసుకుంటున్నారని.. పురందేశ్వరి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని హెచ్చరిస్తూనే ఆమె ఏమైనా ఆడిటరా..? అని చురకలంటించారు.