ఏలూరు: కరోనా పాజిటివ్ వచ్చినవారి కుటుంబ సభ్యులు పోలీసులు, వైద్య సిబ్బందికి సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హెచ్చరించారు. ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్‌కు తరలించాలని సూచించారు. పోలీస్, మెడికల్ టీమ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని సూచించారు. నాలుగు జోన్లలో ఒక్కొక్క జోన్‌కు స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని, రెడ్‌జోన్ ప్రాంతంలో ప్రజలు బయటకు రాకుండా చూడాలన్నారు. సర్వేలైన్స్‌కు ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏలూరు నియోజకవర్గానికి ప్రత్యేకంగా సర్వేలైన్స్ టీమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఏలూరు కార్పొరేషన్‌లోని రెడ్‌జోన్ ప్రాంతంలో శానిటేషన్ చేయించాలని, రెడ్‌జోన్ ప్రాంతంలో పూర్తిగా సర్వే చేయాలని ఆదేశించారు.