రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూ

రూ.1600 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో 18–45 ఏళ్ల వారందరికీ ఉచితంగా టీకా

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు

సీటీ స్కాన్‌ పేరుతో దోపిడీ చేస్తే సీరియర్‌ యాక్షన్‌

కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వామ్యం చాలా ముఖ్యం

డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

తాడేపల్లి: వ్యాక్సినేషన్‌కు మొదటి నుంచి అత్యంత ప్రాధాన్యమిస్తూ విజయవంతంగా నిర్వహిస్తున్నామని, వ్యాక్సిన్‌ ప్రజలకు మరింత చేరువలో తీసుకెళ్లడం కోసం సీఎం వైయస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇందులో భాగంగా 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సున్న వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందజేయాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18–45 ఏళ్ల వయస్సు ఉన్న సుమారు 2.04 కోట్ల మందికి రూ.1600 కోట్ల నిధులు ఖర్చు చేసి ఉచితంగా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. 

కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారని, రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారన్నారు. 
 
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రానుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తే బాగుంటుందని సీఎం సూచించారని, రాష్ట్రంలో టెస్టింగ్‌ కెపాసిటీని పూర్తిగా వినియోగించుకోవాలని ఆదేశించారన్నారు.  

అదే విధంగా సీటీ స్కాన్‌ పేరు ప్రజలను దోపిడీ చేస్తున్నారని సీఎం దృష్టికి రావడంతో.. ముఖ్యమంత్రి సీరియస్‌ అయ్యారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. సీటీ స్కాన్‌కు దీనికి రూ. 2,500 ధర నిర్ణయించామన్నారు. అధిక వసూళ్లకు పాల్పడితే వారిపై సీరియర్‌ యాక్షన్‌ తీసుకోవాలని సీఎం సూచించారన్నారు. 

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దోపిడీకి పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. 

కరోనా కట్టడితో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, మాస్క్, భౌతిక దూరం వంటి కోవిడ్‌ నియమాల అమలులో ప్రజలను భాగస్వామ్యం చేయమని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. కల్యాణ మండపాలను కోవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చాలని సీఎం ఆదేశించారన్నారు. బెడ్స్, కోవిడ్‌ రిక్రూట్మెంట్‌ కూడా పెంచుతున్నామన్నారు. జిల్లా స్థాయిలో 104 కాల్‌ సెంటర్లకు జాయింట్‌ కలెక్టర్‌ స్థాయి అధికారిని నియమించాలని కోరామన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top