నవరత్నాలే సీఎం వైయస్‌ జగన్‌ సంకల్పం  

 ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ 
 

వైయస్‌ఆర్‌ జిల్లా : ‘సచివాలయంలోని ముఖ్యమంత్రి గదిలోకి వెళ్లగానే ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా తాను ఇచ్చిన ‘నవరత్నాలు’ హామీలే కనిసిస్తాయి. అనునిత్యం వాటిని గుర్తుపెట్టుకొని కార్యాచరణ చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నదే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పమని’ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధ్‌ రాజుతో కలిసి వైయస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బోస్‌ మాట్లాడుతూ.. మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ నాలుగడుగులు ముందుకు వేసి నెరవేరుస్తున్నారని ప్రశంసించారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి కుల, మత భేదాలు చూడకుండా ప్రతీ ఒక్క పేద కుటంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.
గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో రాక్షస పాలన చేసినందునే ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పారని గర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి అందరూ విభేదాలు పక్కనపెట్టి కృషి చేయాలని, అంబేద్కర్‌, గాంధీల మధ్య ఎన్ని అభిప్రాయభేదాలున్నా ప్రజా సంక్షేమం కోసం అంబేద్కర్‌తో రాజ్యాంగాన్ని రాయించారని తెలిపారు. మంత్రి రంగనాధ్‌ రాజు మాట్లాడుతూ.. మహానేత ఆశయాల కొనసాగింపుగా బడుగు, బలహీన వర్గాలకు 25 లక్షల ఇళ్లు కట్టించాలని నవరత్నాలలో హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రాజన్న పాలనను అందించడానికి తపన పడుతున్న ముఖ్యమంత్రి జగన్‌ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. 

Back to Top