తాడేపల్లిగూడెం: గిఫ్ట్ సంగతి తర్వాత చూద్దాం.. ముందు ఏపీకి రిటర్న్ రమ్మనండి.. తండ్రి జైల్లో ఉంటే కొడుకు ఢిల్లీలో ఖరీదైన లాడ్జిలో కులుకుతున్నాడు.. అంటూ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ లోకేశ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో లోకేశ్ ఉన్న లాడ్జికి రోజుకు రూ.2 లక్షల 25 వేలు అద్దె చెల్లించి అక్కడ జల్సా చేస్తున్నాడని ఆయన చెప్పారు. తాడేపల్లిగూడెం మండలం కృష్ణయపాలెం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు పీఏ అమెరికా పారిపోగా, ఇంకొకరు దుబాయ్ పారిపోయాడని మరొకరు మాయమైపోయాడని ఆయన అన్నారు. ఇక లోకేశ్ విషయానికొస్తే ఏ క్షణంలో అయినా తనను అరెస్టు చేస్తారని భయంతో ఢిల్లీలో దాక్కున్నాడని చెప్పారు. అది కూడా రోజుకు రూ.2,25,000 అద్దె చెల్లించి లాడ్జిలో జల్సా చేస్తున్నాడని విమర్శించారు. ఇక్కడ తండ్రి చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో జైలులో ఉంటే అక్కడ కొడుకు లోకేశ్ ఖరీదైన లాడ్జిలో జల్సాగా గడుపుతున్నాడని చెప్పారు. రాష్ట్రం నుంచి పారిపోయి ఢిల్లీలో దాక్కుని సొల్లు కబుర్లు చెప్పడం కాదని, ఆంధ్రప్రదేశ్‌కు వస్తే ఎవరికి ఎవరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో తెలుస్తుందని అన్నారు.