సచివాలయం: ఆలయ భూముల అన్యాక్రాంతాన్ని సహించేది లేదని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 4.60 లక్షల ఎకరాల దేవాలయాల భూమి ఆక్రమణల్లో ఉన్నట్టు, 1.65 కోట్ల గజాల వాణిజ్య స్థలాలు ఆక్రమణలో ఉన్నాయని గుర్తించామని చెప్పారు. ఆక్రమణల్లో ఉన్న దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. సచివాలయంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖ భూముల స్వాధీనానికి చట్టంలో కీలక మార్పులు చేసి కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చామని వివరించారు.
రూ.5 లక్షల ఆదాయం లోపు ఉన్న 23,600 ఆలయాలను గుర్తించామని, ఈ దేవాలయాలను అర్చకులకు, ఫౌండర్ ట్రస్టీకి అప్పగించనున్నామని చెప్పారు. వీటికి ఇప్పటి వరకు 37 అప్లికేషన్స్ వచ్చాయని, ఫౌండర్ ట్రస్టీ, వారి కుటుంబ సభ్యులు ముందుకువస్తే ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలు వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ధర్మ ప్రచార కార్యక్రమాలను సంవత్సరం పొడవునా ప్రముఖ ఆలయాల పరిధిలో కొనసాగిస్తామని వివరించారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని చాటించడమే ప్రధాన లక్ష్యమన్నారు. శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్తే షాపులు మూయించినట్టు కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా ప్రచురించాయని మండిపడ్డారు.