తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్‌

అనంతపురం: కూటమి ప్రభుత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేయిస్తున్న తరుణంలో.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కుట్రకు దిగింది. బలవంతంగా అరెస్ట్‌ చేయించింది. 
ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్‌ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, రహస్య ప్రాంతానికి తరలించగా.. ఇప్పటికే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొచ్చన్న హైకోర్టు అనుమతిచ్చిన విషయాన్ని పోలీసులకు పెద్దారెడ్డి గుర్తు చేశారు. దీంతో చేసేది లేక పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు.  

నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?
అనంతపురం రాంనగర్‌లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తం కావడంతో తాడిపత్రిలో ఉద్రికత్తత నెలకొంది.  

అంతకుముందు, పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేతకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది.  టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేలా మునిసిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. 
 

మున్సిపల్‌ అధికారులు తన ఇంటి కొలతలు తీసుకున్నారనే సమాచారంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. అదే సమయంలో పెద్దారెడ్డిపై దాడులు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు.

 
కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాడిపత్రిలో  కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగు పెట్ట నివ్వడం లేదు. అడుగడుగునా కూటమి నేతలు అడ్డు తగులుతున్నారు. ఈ క్రమంలో  తాడిపత్రి  వెళ్లేందుకు పెద్దారెడ్డి హైకోర్టులో అనుమతి తీసుకున్నారు. అయినప్పటికీ కూటమి నేతలు పదేపదే బెదిరింపులు, దాడులతో కక్ష సాధింపు చర్యలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో  పెద్దారెడ్డి మరోమారు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. 

Back to Top