అవ్వాతాతలపై చల్లని చూపు

నేడు వైయస్‌ఆర్‌ కంటి వెలుగు మూడో విడత ప్రారంభం

 56.88 లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు  

175 నియోజకవర్గాల నుంచి ఒక్కో మండలం ఎంపిక 

 నేడు కర్నూలులో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి: పాదయాత్రలో..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అవ్వాతాతలకు సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇవ్వకపోయినా పెద్ద మనవడిగా కంటి వెలుగు అనే కార్యక్రమం ద్వారా చూపు ప్రసాదించనున్నారు. ఇన్నాళ్లు ఎవరు ఆలోచించని విధంగా సీఎం వైయస్‌ జగన్‌ బృహత్తర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని విధంగా తొలిసారి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే డాక్టర్‌ వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం మూడో విడత కింద కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఉచితంగా కంటి పరీక్షలు, కంటి ఆద్దాలను ఇవ్వడమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మంగళవారం కర్నూలులో ప్రారంభించనున్నారు.  

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రాథమిక, సెకండరీ స్క్రీనింగ్‌ కంటి పరీక్షలను సమాంతరంగా ప్రారంభించి జూలై 31వ తేదీ నాటికి పూర్తి చేస్తారు. అద్దాలు అవసరమైన వారికి సెకండరీ స్క్రీనింగ్‌ పూర్తయిన తర్వాత పక్షం రోజుల్లో వలంటీర్ల ద్వారా పెన్షన్లతో పాటు కళ్ల జోళ్లను కూడా అందజేయనున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తారు. మార్చి 1వ తేదీ నుంచి గుర్తించిన ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయిస్తారు. తొలుత 175 నియోజకవర్గాల్లో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసి.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత మరో మండలంలో పూర్తి చేస్తారు. ఇలా అన్ని మండలాల్లో కంటి పరీక్షలను నిర్వహించనున్నారు.  

అంధత్వ శాతం తగ్గించడమే లక్ష్యం 
ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రస్తుతం 1 శాతం ఉన్న అంధత్వాన్ని 0.3 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా  రాష్ట్ర వ్యాప్తంగా 5.30 కోట్ల మందికి ప్రభుత్వం కంటి వైద్య పరీక్షలు చేపట్టింది. రూ.560 కోట్ల వ్యయంతో 2022 జనవరి 31కి ఆరు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తొలి విడత గత ఏడాది అక్టోబర్‌ 10 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని (ప్రభుత్వ, ప్రైవేట్‌) 60,401 పాఠశాలల్లో 66,15,467 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 4,36,979 మందికి కంటి సమస్యలున్నట్లు గుర్తించారు. రెండవ విడత కార్యక్రమంలో వీరికి పరీక్షలు నిర్వహించి 2,40,997 మందికి ఔషధాలు పంపిణీ చేశారు. 1,52,779 మంది విద్యార్థులకు కళ్లద్దాలు ఇవ్వాలని వైద్యులు సూచించగా, ఈ నెల 15వ తేదీ వరకు 56,767 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. మిగతా వారికి పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 46,286 మంది విద్యార్థులకు మూడోసారి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. 2,177 మంది విద్యార్థులకు శస్త్ర చికిత్స అవసరమని ప్రాథమికంగా గుర్తించారు.  

 

  • - కంటి పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను ఏ రోజుకారోజు ఏఎన్‌ఎంలు గ్రామ సచివాలయం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కంప్యూటరీకరించనున్నారు.  
  • -  ప్రాథమిక స్కీనింగ్‌ బృందం రోజుకు 50 నుంచి 100 మందికి పరీక్షలు చేయనుంది.  
  • -  మంచంలో ఉన్న అవ్వాతాతల ఇళ్లకే వెళ్లి ప్రాథమిక స్క్రీనింగ్‌ చేయనున్నారు. 
  • - వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు అవ్వాతాతలను గ్రామ సచివాలయాల్లోని స్క్రీనింగ్‌ కేంద్రాలకు తీసుకువస్తారు. అక్కడే ప్రాథమిక స్క్రీనింగ్, అవసరమైన వారికి సెకండరీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. 
     
Back to Top