సమయం పట్టినా.. చివరకు న్యాయమే గెలుస్తుంది

త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతాం

రూ.22 వేల కోట్ల విలువైన ఆస్తులను 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం

విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పనులు వేగంగా జరగాలి

స్కూళ్లలో ‘నాడు–నేడు’ పనులు త్వరగా పూర్తిచేయాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

‘స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి: రూ.22 వేల కోట్ల విలువైన ఆస్తులను 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయబోతున్నామని, దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కవగా ఉన్నారని, చంద్రబాబు, టీడీపీ నేతలు కేసులు వేసి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారన్నారన్నారు. వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తుంది. కొంత సమయం పట్టినా చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతామన్నారు. ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్‌ ప్రక్రియ పూర్తి కావాలని, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. 

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ అధికారులతో చర్చించి పలు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

పనులు వేగంగా జరగాలి...
గ్రామ సచివాలయాలు, ఆర్బీకే, వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారు. ‘ప్రతి జిల్లాలో ప్రతి వారం రూ.10 కోట్ల మెటీరియల్‌ కాంపౌనెంట్‌ పనులు జరగాలి. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్, వైయస్‌ఆర్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పనులు వేగంగా జరగాలి’. 

కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టిపెట్టాలి..
స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ‘స్కూళ్లలో నాడు – నేడు పనులపై కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టిపెట్టాలి. సెప్టెంబర్‌ 5 నుంచి స్కూళ్లు తెరవాలని ఆలోచిస్తున్నాం. నాడు– నేడు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. సెప్టెంబర్‌ 5వ తేదీ లోగా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అంగన్‌వాడీ స్కూల్స్‌ను వైయస్‌ఆర్‌ ప్రీప్రైమరీ స్కూల్స్‌గా మారుస్తున్నాం. 55 వేల అంగన్‌వాడీల్లో నాడు–నేడు కింద పనులు చేపడుతున్నాం’. 

ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలి..
వైయస్‌ఆర్‌ చేయూత, స్వయం సహాయక చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైయస్‌ఆర్‌ చేయూత అందించాం. బ్యాంకులకు ఈ డబ్బుపై ఎలాంటి హక్కు లేదు. ఎక్కడైనా సమస్యలు వస్తే కలెక్టర్లు వెంటనే పరిష్కరించాలి. మహిళలకు స్థిరమైన జీవనోపాధి మార్గాలను చూపడానికి హిందుస్థాన్, యూనిలీవర్, ఐటీసీ, పీఅండ్‌జీ, రిలయన్స్, అమూల్, అలానా గ్రూపులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. రాష్ట్ర స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి మంత్రుల బృందం రివ్యూ చేస్తుంది. మహిళలకు ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాలి. వారు ఎంపిక చేసుకున్న జీవనోపాధి మార్గాల్లో చేయూతనివ్వాలి’ అని సీఎం వైయస్‌ జగన్‌ కలెక్టర్లను ఆదేశించారు. 
 

Back to Top