తాడేపల్లి: కరోనా వైరస్ నివారణపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. కరోనా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్లకు సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. అపోహలతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసర సరుకులకు ఎట్టి పరిస్థితుల్లో కొరత రాదని, నిత్యావసర వస్తువుల ధరలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. కరోనా వైరస్ సాకుతో నిత్యావసర సరులకు ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవన్నారు. కరోనా నివారణ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడా కూడా పొరపాట్లకు తావివ్వకూడదని, ప్రజల్లో అవగాహన పెంచాలని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గ్రావిటీని బట్టి కలెక్టర్లు పర్యవేక్షణ సమర్థవంతంగా చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు, కలెక్టర్‌ను కన్వీనర్ చేశామని, ఇందులో జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్‌ఎస్‌లు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారన్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా టాస్క్‌ఫోర్స్ సమావేశం జరగాలని ఆదేశించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిని రోజూ పర్యవేక్షించాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లొద్దు. బస్సులో పరిశుభ్రత, శానిటైజ్ చేస్తున్నారా.. లేదా..? అనేది చూసుకోవాలన్నారు. జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు తనిఖీలు చేయాలని, కావాల్సిన మందులు ఉన్నాయా..? లేదా అనేది చూసుకోవాలని ఆదేశించారు.