నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దు

మనబడి నాడు–నేడు పనులపై క్వాలిటీ ఆడిటింగ్‌ జరగాలి

అన్ని స్కూళ్లల్లో పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి

మే చివరి నాటికి పెయింటింగ్, స్మార్ట్‌ టీవీలు, వాల్‌ ఆర్ట్‌తో సహా అన్నీ పూర్తవ్వాలి

స్కూళ్లలో నాడు–నేడు ఫొటోలు తప్పనిసరిగా ప్రదర్శించాలి

విద్యా కానుక కిట్లలో ప్రతి ఒక్కటీ పూర్తి నాణ్యత కలిగి ఉండాలి

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా టెన్త్, ఇంటర్‌ పరీక్షలు నిర్వహణ

కోవిడ్‌ జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించాలి.. ఏమాత్రం అలక్ష్యం చూపొద్దు

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

తాడేపల్లి: ‘మనబడి నాడు–నేడు’ పనులు పూర్తి నాణ్యతగా ఉండాలని, ఈ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రతి పని క్వాలిటీ ఆడిటింగ్‌ జరగాలన్నారు. ఎప్పటికప్పుడు అన్ని స్కూళ్లల్లో పనుల నాణ్యతను తనిఖీ చేయాలని సూచించారు. మే చివరి నాటికి నాడు–నేడు మొదటి దశ పనులు పూర్తి కావాలని ఆదేశించారు. జూలైలో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక కిట్లు సిద్ధం చేయాలన్నారు.  

మనబడి నాడు–నేడు (పాఠశాల విద్యాశాఖ)పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. మొదటిదశలో 15,715 స్కూళ్లలో చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే.. 

రూపురేఖలు మార్చుకుంటున్న స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, బిల్డింగ్‌పై కూడా పెయింటింగ్స్‌ వేయండి. నాడు–నేడు పనులు పూర్తయ్యాక, ప్రతి స్కూల్‌లో నాడు ఆ స్కూల్‌ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అన్న ఫోటోలు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అప్పుడే మనం చేసిన పనులకు మరింత విలువ వస్తుంది. వాటి ప్రాధాన్యత తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఆ స్కూల్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపైనా వారికి అవగాహన కలుగుతుంది.

నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదు..
స్కూళ్లలో పెయింటింగ్‌ పనులు, స్మార్ట్‌ టీవీలు, వాల్‌ ఆర్ట్‌తో సహా అన్ని పనులు తప్పనిసరిగా మే చివరి నాటికి పూర్తి కావాలి. పనుల నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదు. అందుకే పేరెంట్స్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాడు–నేడులో ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా పనులు జరగాలి. వాటిలో ఎక్కడా తేడా ఉండకూడదు. అలాగే మే, జూన్‌ నెలల్లో పూర్తిగా పనులు నాణ్యతను చూడాలి. ప్రతి స్కూల్‌ సందర్శించాలి. అన్నీ నోట్‌ చేయాలి. క్వాలిటీ ఆడిట్‌ పూర్తి కావాలి. టాయిలెట్‌ నిర్వహణ వ్యవస్థ కూడా స్కూళ్లు తెరిచే నాటికి పూర్తి కావాలి.

విద్యా కానుక కిట్‌లో ఇంగ్లిష్‌ డిక్షనరీ..
పిల్లలు స్కూళ్లకు వచ్చే నాటికే విద్యా కానుక కూడా రెడీ కావాలి. ఈసారి కిట్లలో ఇంగ్లిష్‌ డిక్షనరీ కూడా తప్పనిసరిగా ఉండాలి. విద్యా కానుక కింద ఇస్తున్న కిట్లలో ప్రతి ఒక్కటీ పూర్తి నాణ్యత కలిగి ఉండాలి. జూలైలో స్కూళ్లు తెరవగానే, నాడు–నేడు మనబడి రెండో దశ పనులు మొదలు కావాలి. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సజావుగా జరిగేలా టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే వారు ఏ ఇబ్బంది లేకుండా ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్పగలుగుతారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు.. 
ఏ పరిస్థితిలో ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది చెప్పాలి. నిన్న కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదు. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసమే మనం టెన్త్, ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం.

పరీక్షలతో కలిగే ప్రయోజనం:
పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్‌ మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. అదే పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అలాంటప్పుడు మంచి కాలేజీల్లో వారికి సీట్లు ఎలా వస్తాయి? పరీక్ష రాసిన వారికి 70 శాతం పైగా మార్కులు వస్తే, సీట్లు వారికే వస్తాయి కదా?. కేవలం పాస్‌ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏమిటి?.

మంచి చేయాలనే..
విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిజానికి పరీక్షల రద్దు చేయడం చాలా సులభం. పరీక్షల నిర్వహణ ఇంకా బాధ్యతతో కూడుకున్నది. కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలి. కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నాము.

టీచర్లు గుర్తించాలి..
విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచర్‌ గుర్తించాలి. ఇందులో అందరి సహాయ సహకారాలు కావాలని, తోడ్పాటు కావాలన్న విషయాన్ని వారందరికీ బలంగా చెప్పండి. అలాగే పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఏ మాత్రం అలక్ష్యం చూపొద్దు. అన్ని కోవిడ్‌ జాగ్రత్తలతో ఈ పరీక్షలు నిర్వహించాలి’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా  అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top