తాడేపల్లి: క్వారంటైన్లలో వసతి, సదుపాయాలు మెరుగుపర్చడంపై దృష్టిసారించాలని ఉన్నతాధికారులను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. క్వారంటైన్లలో మంచి భోజనం అందించాలన్నారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. కర్నూలు జీజీహెచ్‌లో సౌకర్యాలపై పరిశీలన చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. క్వారంటైన్లలో వసతి, సదుపాయాలు మెరుగుపర్చడం, పారిశుద్ధ్యం, మంచి భోజనం అందించాలని సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 94,558 కరోనా పరీక్షలు చేశామని, ప్రతి పదిలక్షల జనాభాకు 1,771 పరీక్షలు జరిపామని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల శాతం 1.48 ఉందని, దేశ వ్యాప్తంగా 4 శాతం ఉందన్నారు. మరణాల రేటు రాష్ట్రంలో 2.21 శాతం అయితే దేశ వ్యాప్తంగా 3.25 శాతం ఉందన్నారు. ఇవికాక 68 వేలకుపైగా ర్యాపిడ్ టెస్టులు చేశామని అధికారులు వివరించారు. గత మూడు - నాలుగు రోజుల్లో కరోనా మరణాలు లేవని, రానున్న రెండు మూడు రోజుల్లో కరోనా పేషెంట్ల డిశ్చార్జ్ సంఖ్య బాగా పెరుగుతుందని సీఎంకు వివరించారు.