ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి 

కరోనా వైరస్‌ నియంత్రణపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష 
 

అమరావతి: ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.  జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా వైరస్‌ నియంత్రణపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణలో కేసు నమోదయ్యిందని గుర్తు చేశారు. గల్ఫ్‌ దేశాల్లో వైరస్‌ బాగా విస్తరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కేసు నమోదు కాలేదని, ప్రజలను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  

కరోనాపై ప్రచారం చేయండి 
కరోనా వైరస్‌ ఎలా వస్తుంది? వస్తే ఏం చేయాలి? అన్నదానిపై ప్రచారం చేయాలని సీఎం సూచించారు.  ప్రతి గ్రామ సచివాలయంలో కరపత్రాలను అతికించాలి. ‘సిబ్బందికి శిక్షణ చాలా ముఖ్యం. వైద్యాధికారులను కలుపుకుని శిక్షణ కార్యక్రమాలపై కార్యాచరణ ముఖ్యం. ప్రజలను చైతన్యం చేయాలి. బాడీ మాస్క్‌లు, మౌత్‌ మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలి. ఆర్డర్లు ఇప్పటినుంచే ఇస్తే మంచిది. అప్పటికప్పుడు ఆందోళన చెందే కన్నా.. ముందస్తుగా సన్నద్ధం కావాలి’అని సీఎం పేర్కొన్నారు.
 
 

Back to Top