పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదు

మన పిల్లలు బాగా చదవాలి.. గొప్ప స్థానాలకు చేరాలి

నా పాదయాత్రలో ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను

ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదనే ‘జగనన్న విద్యా దీవెన’ తీసుకొచ్చాం

అర్హులైన విద్యార్థులకు వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ఈ ఏడాది మూడో విడత 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు విడుదల

వారం పది రోజుల్లోపు కాలేజీలకు వెళ్లి ఫీజులు చెల్లించాల‌ని త‌ల్లిదండ్రుల‌కు మ‌న‌వి 

విద్యా దీవెన పథకం కింద ఇప్పటివరకు రూ.6,259 కోట్లు ఖర్చు చేశాం

దాదాపుగా 21,48,477 మంది విద్యార్థులకు మేలు జరిగింది

జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.2,267 కోట్లు ఖర్చు చేశాం

అక్షరాస్యత మాత్రమే కాదు.. మన పిల్లలను గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టాలన్నదే లక్ష్యం

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం

కాలేజీల్లో చేరే గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో 35.2 శాతానికి పెరిగింది

దేశం కంటే మెరుగ్గా ఉన్నాం.. మనం చేరాల్సిన దూరం చాలా ఉంది

ఆ గమ్యాన్ని కూడా కచ్చితంగా చేరుతామనే నమ్మకం నాకుంది

విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

తాడేపల్లి: ‘‘పేదరికం పెద్ద చదువులకు అడ్డు రాకూడదు.. కాకూడదు. పేదరికం పోవాలన్నా, మన తలరాతలు మారాలన్నా.. చదువు ఒక్కటే మార్గం. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలను బయటకు తీసుకువచ్చేందుకు, ఆ పిల్లలకు అండగా, తోడుగా నిలబడుతూ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  అర్హులైన విద్యార్థులందరికీ వంద శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నామని సీఎం చెప్పారు. అక్షరాల 11.03 లక్షలమంది పిల్లలకు మంచి జరిగేలా జగనన్న విద్యా దీవెన పథకం కింద 9,87,965 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో మూడవ త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు రూ.686 కోట్లు జమ చేస్తున్నామని సీఎం చెప్పారు. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం గొప్పగా అమలు చేస్తున్నామన్నారు. 

‘రాష్ట్రంలో కనీసం 80 శాతం పైచిలుకు 17–23 వయస్సులో ఉన్నవారంతా కాలేజీల బాటపట్టాలి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. గొప్ప చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలి. తలరాతలన్నీ మారాలి. పేదరికం నుంచి బయటకు రావాలి. ఇది మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరే దిశగా అడుగులు పడుతున్నాయి. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోలో దేశంకంటే మెరుగ్గా ఉన్నాం.. అయినా చేరాల్సిన దూరం చాలా ఉంది. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఆ గమ్యాన్ని కూడా కచ్చితంగా చేరుతామనే నమ్మకం నాకుంది’ అని సీఎం అన్నారు. 

జగనన్న వసతి దీవెన పథకం కింద 11.03 లక్షల మంది విద్యార్థులకు మేలు చేస్తూ 9,87,965 మంది తల్లుల ఖాతాల్లో ఈ ఏడాది మూడో విడత పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ నగదు రూ.686 కోట్లను సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. 

సీఎం ఏం మాట్లాడారంటే..
వందకు వందశాతం అక్షరాస్యత మాత్రమే మన లక్ష్యం కాదు.. వందకు వంద శాతం గ్రాడ్యుయేట్లుగా పిల్లలను నిలబెట్టాలన్నదే మన లక్ష్యం. ఇలాంటి మంచి ఆశయాలతో, మంచి మనసుతో పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అందిస్తున్నాం. ఇలా ఈ ఏడాది మూడవ విడతకు సంబంధించి త్రైమాసికంలో రాష్ట్రంలో 11.03 లక్షల మంది పెద్ద చదువులు చదువుతున్న తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ద్వారా రూ.686 కోట్లను 9,87,965 మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 

మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా.. గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టి వదిలేసిన రూ.1778 కోట్లతో కలిపి.. మనం చేసిన ఖర్చు అక్షరాల రూ.6,259 కోట్లు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఖర్చు చేశాం. ఈ డబ్బులతో దాదాపుగా 21,48,477 మంది విద్యార్థులకు మేలు జరిగింది. నాన్నగారు ఉన్నప్పుడు.. అప్పట్లో పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం తీసుకురావడం.. నాన్న చనిపోయిన తరువాత వచ్చిన ప్రభుత్వాలు, నాయకులు ఎలా ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారో మనమంతా చూశాం. కాలేజీలకు ఏళ్ల తరబడి బకాయిలు పెడితే.. ఆ కాలేజీల్లో నాణ్యతను గురించి అడిగే పరిస్థితి ఎక్కడొస్తుంది..? ఏళ్ల తరబడి బకాయిలు పెడితే.. వాళ్లు జీతాలు ఏమిస్తారు.. చదువులు బాగా చెప్పాలని ఊహించడం ఎలా కుదురుతుంది. 

కాలేజీ యాజమాన్యాలు చదువుకుంటున్న పిల్లలను పరీక్షలు రాయనివ్వం.. కాలేజీలకు రావొద్దని కూడా చెప్పిన సంఘటనలు చూశాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర సమయంలో చెప్పిన సంఘటన నా కళ్ల ఎదుట కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర దారెంబడి ఒక ఇంటికి ఫొటోతో ఫ్లెక్సీ కనిపించింది. ఆ ఇంట్లో నుంచి అమ్మనాన్న ఇద్దరూ వచ్చారు. పిల్లాడి ఫొటోతో ఉన్న ఫ్లెక్సీ గురించి వారిని అడిగితే.. ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో వివక్ష చూపుతున్నారు. ఫీజులు రూ.75 వేలు.. ఇచ్చేది రూ.35 వేలు.. అది కూడా సమయానికి ఇవ్వరు. మిగిలిన ఫీజులు, బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చులు అన్నీ కలుపుకుంటే మళ్లీ సుమారు రూ.75 వేల పైచిలుకు ఖర్చు వస్తుంది. ఆ డబ్బు కట్టలేని పరిస్థితుల్లో నా మీద ఒత్తిడి తీసుకురావడం ఇష్టం లేక నా కొడుకు చనిపోయాడని ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. 

ఆ పరిస్థితి ఎప్పటికీ రాకూడదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి అడుగు కూడా ఆ దిశగానే వేశాం. ఈ వ్యవస్థలోకి గొప్ప మార్పు తీసుకువచ్చాం. అరకొరగా ఇచ్చే ఫీజులు, ఎప్పుడో సంవత్సరాల తరబడి బకాయిలు పెట్టి తరువాత ఇచ్చే పరిస్థితి నుంచి మార్పు చేసి.. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. అర్హులైన పేద విద్యార్థులందరికీ వందకు వందశాతం పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదవాలనుకున్నా.. చదువుతున్నా.. వారందరికీ జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమలు జరుగుతుంది. 

దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. గవర్నమెంట్‌ కాలేజీల్లో పీజీ కోర్సులు చేసే విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. పేద విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు ప్రతి మూడు నెలలకోసారి జమ చేస్తూ.. కాలేజీలకు ఆ పిల్లల తల్లులే వెళ్లి అక్కడి పరిస్థితులు, వసతులు చూసి ఫీజులు చెల్లించే బాధ్యతను అప్పగించాం. తల్లులు ప్రతి మూడు నెలలకు ఒకసారి కాలేజీలకు  వెళ్లి ఫీజులు వారే చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు ఎలా జరుగుతున్నాయి.. పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అనే విషయాలపై అవగాహన వస్తుంది. కాలేజీల్లోని వసతులను ఆ తల్లులు పరిశీలించి.. లోటుపాట్లపై యాజమాన్యలను ప్రశ్నిస్తారు. దీని వల్ల కాలేజీలకు జవాబుదారీ తనం పెరుగుతుంది. కాలేజీ స్థితిగతులు, పిల్లల బాగోగులపై తల్లుల పర్యవేక్షణ ఉంటుంది. యాజమాన్యాలను ప్రశ్నించడమే కాకుండా.. 1902 నంబర్‌కు కాల్‌ చేసి ప్రభుత్వానికి కూడా సమస్యలు తెలియజేయవచ్చు. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని స్థితిగతులను మార్పు చేయిస్తుంది. దీని వల్ల కాలేజీలు బాగుపడతాయి.

తల్లులందరికీ మనస్ఫూర్తిగా ఒక మనవి చేస్తున్నాను. ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ తల్లుల ఖాతాల్లో జమ అయిన పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ సొమ్మును వారం పది రోజుల్లోపు కాలేజీలకు వెళ్లి ఫీజులు తప్పకుండా చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉందని దయచేసి మరిచిపోవద్దు. ప్రభుత్వం విడుదల చేసిన ఫీజులు అందిన తరువాత కూడా కాలేజీలకు చెల్లించకపోతే.. తదుపరి విడతలో మీ బ్యాంకు ఖాతాల్లోకి కాకుండా.. ఆ ఫీజుల డబ్బు నేరుగా కాలేజీలకు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ప్రతి తల్లి గుర్తుపెట్టుకోవాల్సిందిగా వినయపూర్వకంగా తమ్ముడిగా, అన్నగా విన్నవించుకుంటున్నా. 

గతంలో మెరిట్‌ ఉన్నా.. ఆర్థిక భారం కారణంగా ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో పేద విద్యార్థులు అడ్మిషన్లు పొందలేని దుస్థితి గతంలో ఉండేది. ఇదంతా మన కళ్లారా చూశాం. వీటిలో కూడా మార్పులు తీసుకువచ్చాం. అన్ని ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో కూడా మెడికల్, డెంటల్‌ కోర్సులు అయితే కచ్చితంగా 50 శాతం సీట్లు, ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు అయితే 35 శాతం సీట్లు కచ్చితంగా కన్వీనర్‌ కోటా గవర్నమెంట్‌ కోటాలో భర్తీ చేయాలని ఏకంగా చట్టంలో మార్పులు తీసుకువచ్చాం. దీని వల్ల ఇంతకు ముందు అవకాశంలేని దాదాపు 2,118 పేద విద్యార్థులకు ఈ సంవత్సరం పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ప్రభుత్వమే ఈ ప్రైవేట్‌ యూనివర్సిటీలో సీట్లు ఇప్పించింది. విద్యారంగంలో ఇదొక గొప్ప మార్పులు తీసుకువచ్చేందుకు అడుగుపడ్డాయి. 

ప్రతిభ ఉన్న అర్హులైన పేద విద్యార్థులకు గతానికి భిన్నంగా ప్రఖ్యాత ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం ఈరోజు లభించింది. మనసున్న ప్రభుత్వంగా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వల్ల చదువులకు మనం ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ఫలితాలు బాగా మెరుగుపడ్డాయి. ఇటీవల ఆల్‌ ఇండియా సర్వే ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టులో మన రాష్ట్రంలో ఉన్న విద్య కోసం కాలేజీల్లో చేరే 17–23 వయస్సులో ఉన్న విద్యార్థులను గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) 2020 నాటికి 35.2 శాతానికి పెరిగింది. ఇంతకు ముందు జీఈఆర్‌ 27 శాతంలో ఉండేవి. 2020 నాటికి 35.2 శాతానికి పెరిగింది. దేశ వ్యాప్తంగా ఇదే సమయంలో జీఈఆర్‌ పెరుగుదల 3.04 శాతం పెరిగినట్టుగా నమోదవుతే.. మన రాష్ట్రంలో ఏకంగా 8.06 శాతంగా పెరుగుదల నమోదైంది. 
దేశ వ్యాప్తంగా గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో ఎస్సీల్లో 1.7 శాతం, ఎస్టీల్లో 4.5 శాతం నమోదైంది. బాలికలు 2.27 శాతం జీఈఆర్‌ నమోదైంది. మన రాష్ట్రంలో ఎస్సీల్లో 7.5 శాతం పెరుగుదల, ఎస్టీల్లో 9.5 శాతం పెరుగుదల, బాలికల్లో 11.03 శాతంగా పెరుగుదల నమోదైంది. ప్రతి అడుగు దేశం కంటే మెరుగ్గా వేస్తున్నాం. మనం అనుకున్న టార్గెట్‌ చేరుకోవాలంటే ఇంకా చాలా దూరం వెళ్లాలి. 

రాష్ట్రంలో కనీసం 80 శాతం పైచిలుకు 17–23 వయస్సులో ఉన్నవారంతా కాలేజీల బాటపట్టాలి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చిరునవ్వుతో గొప్ప చదువులు చదివి బయటకురావాలి.. మంచి ఉద్యోగాలు చేయాలి. తలరాతలన్నీ మారాలి. పేదరికం నుంచి బయటకు రావాలి. ఇది మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశంకంటే మెరుగ్గా ఉన్నా.. అయినా చేరాల్సిన దూరం చాలా ఉంది. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఆ గమ్యాన్ని కూడా కచ్చితంగా చేరుతామనే నమ్మకం నాకు కచ్చితంగా ఉంది. 

పిల్లలను బడిబాట పట్టించే కార్యక్రమంలో భాగంగా, పెద్ద చదువులు చదివించే కార్యక్రమంలో భాగంగా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఒక్కటే సరిపోదు.. జగనన్న వసతి దీవెన పథకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గ్రహించింది. డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదివించాలంటే పిల్లలకు బోర్డింగ్, మెస్, లాడ్జింగ్‌ ఖర్చులు సంవత్సరానికి రూ.20 వేలు అవుతుంది. ఆ డబ్బు కూడా చెల్లించలేని పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు.. ఆ పరిస్థితి కూడా రాకూడదు.. అప్పులపాలు కాకూడదనే  ఉద్దేశంలో జగనన్న వసతి దీవెన పేరుతో ఐటీఐ చదివే వారికి రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ చదివే పిల్లలకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదివే పిల్లలకు రూ.20 వేలు లాడ్జింగ్‌ అండ్‌ బోర్డింగ్‌ ఖర్చుల కింద ప్రతి ఏటా రెండు దఫాల్లో ఇచ్చే జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

వసతి దీవెన పథకం కింద ఇప్పటి వరకు రూ.2,267 కోట్లు పిల్లల కోసం నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చాలా సంతోషంగా.. పిల్లలకు మంచి మేనమామలా, ఆ తల్లులకు మంచి అన్నగా, తమ్ముడిగా మంచి చేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. విద్యా దీవెన, వసతి దీవెన రెండు పథకాలకు సంబంధించి అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో మొత్తంగా రూ.8,526 కోట్లు ఇవ్వగలిగామని సంతోషంగా, సగర్వంగా తెలియజేస్తున్నాను. 

ఉన్నత విద్యారంగంలో పెనుమార్పులు తీసుకువస్తున్నాం. పిల్లలను బాగా చదివించాలి. భావిభారత దేశంలో పిల్లలందరికీ ఉద్యోగాలు ఇంకా మెరుగ్గా వచ్చే పరిస్థితులు రావాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం 11 గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలు ఉంటే.. మరో 16 మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. మరో రెండు సంవత్సరాల్లో మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. 

విజయనగరం జిల్లాలో గురజాడ జేఎన్టీయూ ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టాం. రెండు చోట్ల యూనివర్సిటీలు తీసుకురావడం వల్ల.. ప్రతి జిల్లాలో కూడా ఈరోజు యూనివర్సిటీ ఉంటుంది. కడపలో వైయస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టాం. కురుపాం గిరిజన ఇంజినీరింగ్‌ కాలేజీకి శ్రీకారం చుట్టాం. పాడేరులో మెడికల్‌ కాలేజీ నిర్మిస్తున్నాం. సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీ నిర్మించేందుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. రుసలో భాగంగా కర్నూలులో క్లస్టర్‌ యూనివర్సిటీని నెలకొల్పుతున్నాం. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 డిగ్రీ కాలేజీల ఏర్పాటు జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అక్షరాల రూ.880 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టాం. మరో రెండు సంవత్సరాల్లో ఇవన్నీ పనులు పూర్తవుతాయి. 

డిగ్రీ కోర్సుల్లో మార్పులకు శ్రీకారం చుట్టాం. అన్నీ ఇంగ్లిష్‌ మీడియం వైపు అడుగులు వేస్తున్నాం. పిల్లలు ఎవరూ ఇబ్బంది పడకూడదని పాఠ్యపుస్తకాలను ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లిష్‌ ప్రింట్‌ చేపిస్తున్నాం. బైలింగ్వల్‌ పాఠ్యపుస్తకాలు ఏకంగా 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు అందిస్తున్నాం. డిగ్రీ కోర్సులన్నీ జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులుగా మార్పులు తీసుకువచ్చాం. పిల్లలందరికీ వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ రావాలని ప్రతి డిగ్రీ కోర్సులో ఇంటర్న్‌షిప్‌ భాగస్వామ్యం చేశాం. జిల్లాల్లోని పరిశ్రమలు, స్కిల్‌ కాలేజీలను అనుసంధాన చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఏకంగా 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక స్కిల్‌ యూనివర్సిటీని కూడా స్థాపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్‌ చదివిన పిల్లలను జాబ్‌ఓరియంటెడ్‌ దిశగా తీర్చిదిద్దుతారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 1.62 లక్షల మంది విద్యార్థులకు 40 రకాలకు సంబంధించిన కోర్సుల్లో ట్రైనింగ్‌ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తుంది. వీళ్లందరికీ ఉచితంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. డేటా అనలిస్టిక్స్, ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, కోడింగ్, లాంగ్వేజ్‌ ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్‌ ఇటువంటి 8600 అంశాలను తీసుకురావడం జరుగుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్, టీసీఎన్‌ఎల్, న్యాస్‌కామ్‌ వంటి వారిని స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీలతో అనుసంధానం చేసే కార్యక్రమం జరుగుతుంది. 

పిల్లలకు మంచి జరగాలి. వారి భవిష్యత్తు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. అందులో భాగంగానే విద్యా దీవెన, వసతి దీవెన, విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇవన్నీ బాగా జరగాలని, పిల్లలంతా మంచి డిగ్రీలు పొందాలని, మంచి ఇంజినీర్లు, డాక్టర్లు కావాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top