తాడేపల్లి: ‘‘రైతు శ్రమ, అవసరాలు తెలిసిన ప్రభుత్వంగా రాష్ట్ర చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాల చరిత్రలో కూడా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనంతగా మన ప్రభుత్వం రైతులకు తోడుగా నిలబడుతోంది. విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు తోడుగా, అండగా నిలబడుతున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతులకు మంచి చేసే విషయంలో సంతోషాన్ని కలిగించే మరో ఘట్టం ‘వైయస్‌ఆర్ సున్నావడ్డీ పథకం’ శ్రీకారం అని చెప్పారు. పంట రుణాలను సకాలంలో చెల్లించిన 14.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2019 ఖరీఫ్ పంటకు సంబంధించి రూ.510 కోట్ల వడ్డీ రాయితీతో పాటు, గత నెల (అక్టోబర్)లో అధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన 1,97,525 రైతు కుటుంబాలకు రూ.132 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఈ రోజు విడుదల చేస్తున్నామని వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ‘వైయస్‌ఆర్ సున్నావడ్డీ పథకం’ శ్రీకారంతో పాటు అక్టోబర్‌లో జరిగిన పంటల నష్టం పరిహారాన్ని సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. అంతకు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడారు. సీఎం ఏం మాట్లాడారంటే.. రైతులకు మంచి చేసే విషయంలో సంతోషాన్ని కలిగించే మరో ఘట్టం ఇది. ఈ రోజు రైతులకు చేస్తున్న ఈ కార్యక్రమం రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించే డిసిప్లేన్ ఏర్పడుతుంది. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ఆ వడ్డీని ప్రభుత్వమే కడుతుందనే నమ్మకాన్ని రైతులకు మనం ఇస్తున్నాం. గతంలో ఇటువంటి కార్యక్రమాలు, ఇలా చేస్తే మంచి జరుగుతుందని ఏ రోజూ ఏ ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చింది లేదు. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం చెప్పిన మాట చేస్తుందనే నమ్మకం ఇవ్వగలుగుతున్నాం. ఈ నెలాఖరుకు మన ప్రభుత్వం అధికారం చేపట్టి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది. 18 నెలల కాలంలో మేనిఫెస్టో ప్రజలకు చూపించి, ఎన్నికల హామీలు పేపర్ మీద పెట్టి ప్రజల్లోకి వెళ్లి ఎన్నికలు అయిపోయిన తరువాత అది చెత్తబుట్టకు పరిమితం కాకుండా.. ఎన్నికల మేనిఫెస్టోలో లిఖిత పూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలు ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి దాదాపు 90 శాతం హామీలు అమలు చేశాం. మాటకు అంతగా కట్టుబడ్డాం కాబట్టే నా పాదయాత్ర ప్రారంభానికి మూడేళ్లయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులంతా గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు 90 శాతం అమలు చేయబడ్డాయని సగర్వంగా గ్రామాల్లోకి వెళ్లగలుగుతున్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. అందులో భాగంగానే వైయస్‌ఆర్ సున్నావడ్డీకి శ్రీకారం చుడుతున్నాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల హామీల్లో చెప్పకపోయినా రైతుల బాగు కోసం వాటి ప్రాధాన్యాన్ని గమనించి ఆర్‌బీకేలను తీసుకువచ్చాం. నవరత్నాల్లో మొదటి వాగ్దానం అయిన రైతు భరోసాను రూ.12,500 సాయాన్ని రూ.13,500లకు పెంచి నాలుగేళ్లు ఇస్తామని చెప్పింది ఐదేళ్లు అమలు చేసున్నాం. వరుసగా రెండవ ఏడాది రైతు భరోసా సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయగలిగాం. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో చేయగలుగుతున్నాం. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా రాష్ట్రంలో దాదాపుగా ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబానికి అంటే దాదాపు 50 లక్షల పైచిలుకు కుటుంబాలకు రైతు భరోసా సొమ్మును అందించగలిగాం. సకాలంలో పంట రుణాలు చెల్లించిన 14.58 లక్షల మంది రైతులకు, 2019 ఖరీఫ్ పంటకు సంబంధించి రూ.510 కోట్లను వైయస్‌ఆర్ సున్నావడ్డీ పథకం కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. రైతు భరోసాగా పెట్టుబడి సాయంతో పాటు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లిస్తే వడ్డీలను కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నా. దేశ చరిత్రలో మన ప్రభుత్వం ఒక్కటే ఈ మాదిరిగా చేస్తుంది గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. రుణమాఫీ వాగ్దానం ఎలా అటకెక్కించారో గమనించాం. రుణమాఫీ చేస్తారని రుణాలు కట్టని రైతులు చివరకు సున్నావడ్డీకి అర్హత కోల్పోయారు. ఆ భారం రైతులే భరించాల్సి వచ్చింది. 2014–15లో 2015–16లో రుణమాఫీ అవుతుందేమోనన్న ఆశతో రైతులు డబ్బులు కట్టకపోవడంతో వడ్డీలు కూడా ప్రభుత్వమే కడుతుందని ఆశించి నిరాశ మిగిలింది. 2014–15, 2015–16లో రైతులు కట్టకపోవడంతో 2017–19 వరకు మూడేళ్లు గత ప్రభుత్వం సున్నావడ్డీ బకాయిలు చెల్లించక ఏకంగా రూ.1180 కోట్లు రైతుల మీద భారం పడితే.. రైతులపై బాధ్యత, మమకారంతో మన ప్రభుత్వమే చెల్లించింది. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టాలకు పరిహారాన్ని ఆ సీజన్ ముగిసేలోగా ఇస్తామన్న మాటకు కట్టుబడి ఈ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాల వల్ల పంట నష్టపోయిన 1.66 లక్షల రైతు కుటుంబాలకు రూ.135.73 కోట్లు ఇప్పటికే అందించాం. అక్టోబర్‌లో కురిసిన వర్షాలు, వరదలకు జరిగిన పంట నష్టానికి కూడా 1,97,525 రైతు కుటుంబాలకు రూ.132 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఈ రోజు విడుదల చేస్తున్నాం. లక్ష వరకు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులందరికీ వైయస్‌ఆర్ సున్నావడ్డీ పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని వర్తింపజేశాం. అర్హత ఉండి కూడా వడ్డీలేని రుణాలు అందలేదని రైతులు భావిస్తే రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించవచ్చు. బ్యాంకుల ద్వారా తప్పిదాల జరిగినా ప్రభుత్వం కలగజేసుకొని న్యాయం చేస్తుంది. రైతు భరోసా కేంద్రాల వద్ద జాబితా ప్రదర్శిస్తారు. అర్హత ఉండి అందకపోతే ఆర్‌బీకేల్లో, వలంటీర్లను సంప్రదించవచ్చు. లేదా 155251 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించవచ్చు. అర్హత ఉన్నవారందరికీ ప్రతీ పథకం అందాలని ఆరాటపడే ప్రభుత్వం మనది. మనది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి స్థానంలో మీ బిడ్డ ఉన్నాడు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు తోడుగా, అండగా నిలబడేందుకు దాదాపు 10641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటికి సంబంధించి గ్రామాల్లో పక్కా భవనాల నిర్మాణం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అండగా ప్రతి నియోజకవర్గంలో వైయస్‌ఆర్ జలకళ కార్యక్రమం ద్వారా ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమం అమలు చేస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తున్నాం. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు పెట్టిన రూ.8,655 కోట్ల బకాయిలను చెల్లించిన ప్రభుత్వం మనది. ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తనాల సబ్సిడీ కింద రూ.384 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాల కింద చెల్లించాల్సిన రూ.1180 కోట్లు గత ప్రభుత్వం బకాయిలు పెడితే.. ఇవన్నీ మీ బిడ్డగా, రైతు పక్షపాతిగా మన ప్రభుత్వమే చెల్లించింది. రైతులకు పగటిపూట ఉచితంగా 9 గంటల కరెంటు ఇచ్చే కార్యక్రమానికి అడుగులు ముందుకువేశాం. రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఈ రోజు దాదాపు 90 శాతం పైచిలుకు ఫీడర్లను పగటిపూట కరెంట్ ఇచ్చే స్థితికి తీసుకువచ్చాం. ఈ నెలాఖరుకు మిగిలిన 10 శాతం పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. రైతుల తరఫున బీమా ప్రీమియం కూడా మన ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2019లో ఖరీఫ్‌కు సంబంధించి రైతులు వారి తరఫున రూ.1 కడితే.. రాష్ట్రంలోని రైతుల తరఫున రూ.506, ప్రభుత్వం తరఫున రూ.524 కోట్లు రెండూ కలిపి రూ.1,031 కోట్లు మన ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇన్సూరెన్స్ సొమ్మును దాదాపుగా రూ.1800 కోట్లు డిసెంబర్‌లో చెల్లించేట్లుగా కార్యాచరణ చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాం. 13 జిల్లాల్లో జిల్లాస్థాయి అగ్రిల్యాబ్‌లను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 147 ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం.. విత్తనాలు, పురుగుల మందు, ఎరువులను నాణ్యత పరీక్షలను నిర్వహించి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నాం. 2019–20లో దాదాపుగా రూ.15 వేల కోట్లతో వరిధాన్యం కొనుగోలుతో పాటు కోవిడ్ సమయంలో రైతులకు అండగా నిలబడుతూ మొక్కజొన్న, సజ్జ, పొగాకు, ఉల్లి, పసుపు, టమాటా, అరటి, బత్తాయి వంటి పంటల కొనుగోలుకు రూ.3200 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మనది. పత్తి కొనుగోలు కోసం మరో రూ.666 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు ఇంకా అధిక రాబడి కల్పించేందుకు అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. పాలసేకరణ కోసం ఫస్ట్ ఫేజ్ కింద ఈ నెల 26న మూడు జిల్లాల్లో ప్రకాశం, చిత్తూరు, కడపలో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లను ప్రారంభం చేస్తున్నాం. తరువాత మిగిలిన జిల్లాల్లో విస్తరింపజేస్తాం. బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ల కోసం రూ.980 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతు శ్రమ, అవసరాలు తెలిసిన ప్రభుత్వంగా రాష్ట్ర చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాల చరిత్రలో కూడా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనంతగా దేవుడి దయతో రైతులకు తోడుగా నిలబడగలుగుతున్నాం. దేవుడు ఇంకా గొప్పగా దీవించాలని, రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సున్నావడ్డీ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. అధిక వర్షాల వల్ల నాణ్యత దెబ్బతిన్న వరి, వేరుశనగ పంటలను కొనుగోలు చేసి రైతులకు ఆదుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చాం. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించవచ్చు.